Friday, August 8, 2025

చేనేత రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ కోసం రూ.33 కోట్లు విడుదల చేసినట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గురువారం పీపుల్స్ ప్లాజా వద్ద జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వందకు పైగా స్టాళ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తెలంగాణ అతెంటిక్ వేవ్స్ లోగోను, త్రిలింగ పట్టు చీరలను మంత్రి ఆవిష్కరించారు. ఎలక్టానిక్ మడత ఆసు మిషన్ ను మంత్రి పరిశీలించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారులను మంత్రి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. జియో ట్యాగింగ్‌లో కూడా మనమే ముందంజలో ఉన్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. వరుసగా పది రోజుల పాటు కొనసాగే చేనేత వస్త్ర ప్రదర్శన నేత కార్మికుల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుందన్నారు.

నేతన్నలకు సర్కారు అండ
దేశానికి అన్నంపెట్టే రైతన్నను, వస్త్రాన్ని ఇచ్చే నేతన్నకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. నేతన్న భద్రత పథకం ద్వారా మృతిచెందిన నేతన్న కుటుంబ నామినికి రూ.5లక్షలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. చేనేత భారతీయ సంస్కృతికి ప్రతీక అని, తరతరాలుగా వారసత్వంగా అందిన హస్తకళను పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. తెలంగాణ చేనేత రంగం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించిందని, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దపేట గొల్లభామ, వరంగల్ దర్రిస్, కరీంనగర్ బెడ్ షీట్స్ వంటి ఉత్పత్తులు అంతర్జాతీయంగా పేరుగాంచాయని వివరించారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టి) ద్వారా యువతకు నైపుణ్య శిక్ష అందిస్తూ చేనేత కళను కొత్త తరం ఆస్వాదించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యార్ మాట్లాడుతూ చేనేత కళలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News