Friday, September 13, 2024

శాశ్వత చిరునామా ఉంటే స్థానికులే

- Advertisement -
- Advertisement -

స్థానికత నిర్ధారణకు మార్గదర్శకాలు రూపొందించండి
వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల స్థానికత కేసులో హైకోర్టు ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సిజె జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని సూచించింది. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది.

ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలల్లో ప్రభుత్వం మార్పులు చేసిన చేసిన సంగతి విదితమే. నిబంధనల్లో రూల్ ‘3 ఎ’ను చేరుస్తూ ప్రభుత్వం జీవో 33ను జారీ చేసింది. నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వెల్లడించింది. వైద్యా రోగ్యశాఖ జారీ చేసిన జీవోను పలువురు విద్యార్థులు సవాల్ చేశారు. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, సీతారాంమూర్తి వాదనలు వినిపించారు.

సర్కారు జారీ చేసిన ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే ఎక్కువ నష్టం కలుగుతుందని కోర్టుకు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల వారితో పాటు భారతీయ మూలాలున్న ప్రవాసులు ఇక్కడ 4 సంవత్సరాలు చదువుకుంటే 85 శాతం స్థానిక కోటా కింద అవకాశం దక్కించుకుంటారన్నారు. దీనివల్ల తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి నష్టం వాటిల్లుతుందని వాదనలు వినిపించారు. స్థానిక కోటా ఇక్కడ నివాసం ఉన్నవాళ్లకే అడుగుతున్నామని, చదువుకున్నవారు అన్న దానిపై అడగడం లేదని కోర్టుకు విన్నవించారు.

ఉద్యోగులు బదిలీ కావడం వంటి పరిస్థితుల్లోనూ, అలాగే మెరుగైన విద్య కోసం, ఇంటర్ మరో రాష్ట్రంలో చదువుకున్న తెలంగాణ విద్యార్థి స్థానికుడు కాదనడం సరికాదన్నారు. ఐఎఎస్, ఐపిఎస్ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఇస్తామన్న ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకు అవ కాశం నిరాకరించడం వివక్ష చూపడమేనన్నారు. ఇక ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకువచ్చినట్లు తెలిపారు. నిబంధనలు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి ఉందని వెల్లడించారు. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వారు పలు సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను ధర్మాసనం ముందుంచా రు. వాదనలను విన్న ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది.

రాష్ట్రంలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని మెడికల్ కాలేజీల్లో 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడేవారు. అయితే 2024 జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. దీంతో కన్వీనర్ కోటా సీట్లన్నీ స్థానిక విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. అయితే ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టులో నమోదైన పిటిషన్లపై సెప్టెంబరు 5న తీర్పు వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News