మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కేయవచ్చు అంతే కాదండోయ్ పసందైన భోజనం చేస్తూ అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం ఎక్కడ అనుకుంటున్నారా..? గ్రేటర్ హైదరాబాద్ కు అనుకొని ఉన్న హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ డీ.పోచంపల్లిలో వెలిసిన ప్రత్యేక ఆకర్షణ టెర్మినల్-1 రెస్టారెంట్ వేదిక అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట్రాం రెడ్డి దీన్ని నిర్వహిస్తున్నారు. దుబాయ్ లో 18 ఏళ్లు హోటల్ వ్యాపారం చేసిన ఆయన, కరోనా అనంతరం స్వదేశం చేరుకుని, పాత విమానాన్ని కొనుగోలు చేసి, హైడ్రాలిక్ పరికరాలతో కదిలించేలా విమానాన్ని తయారు చేశారు.
ఇక్కడ, నిజమైన విమానం లోపల విందు భోజనం ఆస్వాదించవచ్చు. ఎయిర్ హోస్టెస్ల తీరులో స్వాగతం, వాతావరణం చక్కటి కొత్త అనుభూతినిస్తుంది. ఒక్కసారి 50 మంది కూర్చునే అవకాశం ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా 150 మందికి సరిపడే చిన్నపాటి ఫంక్షన్ చేసుకునే వీలు ఉంది. పిల్లలకు కాంబో మీల్ రూ.399, పెద్దలకు రూ.599 (వెజ్, నాన్ వెజ్ రెండూ లభ్యం). వీక్ ఏండ్స్ , సెలవుల్లో కుటుంబాలు, మిత్రులతో ప్రత్యేకంగా రావడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ గా మారింది. ఎప్పుడు విమానం ఎక్కని వారు విమాన ప్రయాణ విశేషాన్ని భూమ్మీదనే ఆస్వాదించాలనుకుంటే, cటెర్మినల్-1 బెస్ట్ చాయిస్ గా ఎంచుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన మాదిరిగానే భోజనం చేస్తూ గాలి మోటారు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
కస్టమర్లకు అందించే మెనూ ఇదే
ఫ్లైట్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు మాదిరిగానే సీట్లో కూర్చోబెట్టి వెళ్ళగానే కాంప్లిమెంటరీ సాఫ్ట్ డ్రింక్, ఒక స్వీటు, టిక్కా, కాంబో మిల్, వెజ్ మరియు నాన్ వెజ్ ఎవరికి ఏది అవసరం ఉంటే అది, ఒక వాటర్ బాటిల్ 599 అందిస్తున్నారు. ప్రస్తుతం పోటాపోటీ మార్కెట్లో హంగు ఆర్భాటాలతో ఫైవ్ స్టార్ హోటల్లు, త్రీ స్టార్ హోటల్లు వెలుస్తున్న ఈ రోజుల్లో సామాన్యుల కోసం ఇలాంటి టెర్మినల్ వన్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం. అతి తక్కువ ఖర్చుతో కడుపునిండా భోజనం పెట్టి, విమానా ప్రయాణం కళ్ళకు కొట్టొచ్చినట్టు చూపిస్తూ సామాన్యులకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఇటువంటి హోటల్లు మరిన్ని ఏర్పాటు చేయాలని కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన కస్టమర్ నవీన్ యువతను, టెర్మినల్ వన్ రెస్టారెంట్ నిర్వాహకులు వెంకట్రాం రెడ్డిని కోరారు.