Sunday, April 28, 2024

కుదిపేసిన కుంభవృష్టి

- Advertisement -
- Advertisement -

Terrific Rains in Hyderabad due to cyclone

 

చరిత్రలో ఇదే
భారీ వర్షం

వాయుగుండం ప్రభావంతో పొద్దుగాల మొదలు పెడితే తెల్లారేవరకు రాజధాని హైదరాబాద్ సహా యావత్ తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగింది. నల్లని మబ్బులతో పగబట్టినట్టే వరుణుడు భయోత్పాతం సృష్టించాడు. గంట కూడా గెరువియ్యకుండ ఏకధారలా కురిసిన వర్షంతో రాష్ట్రం చెరువైంది. కుంభవృష్టితో జన జీవనం స్తంభించిపోయింది. బయట అడుగుపెట్టలేక ఇంటికే పరిమితయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే విలవిల్లాడిపోతున్నారు. ఇళ్లలోకి వచ్చి చేరుతున్న వరద నీటిని ఎత్తిపోయడానికి ఆపసోపాలు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నోళ్ల ఇంట్లో వాళ్ల బాధలు ఇక చెప్పలేం. గ్రామాల్లో వాగులు వాయువేగంతో ప్రవహిస్తున్నాయి. చెరువులు గిర్రున నిండి అ లుగులు దుంకుడు అలవాటు చేసుకున్నాయి. నదులపై ఉన్న గేట్లు బా ర్లా తెరుచుకుని సంద్రం వైపు సరసరా సాగుతున్నాయి. ఎటొచ్చి ఈ అతివృష్టి అన్నదాతను మల్ల ఆగం చేసింది. వేలాది ఎకరాల్లో పంట చేలను మింగేసింది. పత్తిరైతు బాధ వర్ణననాతీతం. మంచి పూత, కాపు కాసి విచ్చుకునే దశలో నీళ్లు నిలిచి పత్తి కాయలు మురిగిపోతున్నాయి. వరిపంట నేలకు ఒరిగి ంది. మొక్కజొన్న, మిర్చి, కంది, కూరగాయలు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

n పొంగిపొర్లిన వాగులు, వంకలు.. చెరువులు, కుంటలకు వరద ఉద్ధృతి
n రహదారులపై నేలకొరిగిన చెట్లు.. ఇబ్బందుల పాలైన వాహన చోదకులు
n లోతట్టు ప్రాంతాలు జలమయం.. స్తంభించిన జనజీవనం n నీట మునిగిన రహదారులు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం n పంటపొలాలు నీట మునక.. రైతన్నలు కడగండ్లపాలు… n ఇళ్లు నేలమట్టం.. 20 గొర్రెలు మృత్యువాత n కుర్నవల్లి ఉన్నత పాఠశాలలో వరద నీరు చేరిక n నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, బతుకమ్మ చీరలు నీటిపాలు n మధిర ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు n సూర్యాపేట జిల్లాలో పొంగిపొర్లిన ఎర్రవాగు n వనపర్తి జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన యువకుడు n తడిసి ముద్దయిన భాగ్యనగరం n కొండ చరియలు విరిగిపడి ఇల్లు ధ్వంసం n నిండుకుండలా హిమాయత్‌సాగర్.. గేట్లు ఎత్తివేత…!

మన తెలంగాణ/హైదరాబాద్ : వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. సోమవారం రాత్రి నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్,రూరల్, ఖాజీపేట, హన్మకొండ, మహబూబాబాద్, వనపర్తి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలలో ఎడతెరపి లేకుండా వాన దంచికొడుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కంటలకు వరద ఉద్థృతి కొనసాగుతోంది. పలు చోట్ల చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రహదారులపై చెట్లు నేలకొరగడంతో వాహన చోదకులు ఇక్కట్ల పాలయ్యారు. కొన్ని చోట్ల రహదారులు నీట మునిగిన దృష్టా రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. మరికొన్ని చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. మళ్లీ ఓరుగల్లు జోరువాన కురిసింది. ఎడతెరపి లేని వర్షంతో నగరం తడిసి ముద్దైంది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల్లో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే నమోదైంది. కుంభవృష్టి వల్ల వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. వాగులో ముగ్గురు గల్లంతు కాగా.. ఇద్దరు క్షేమంగా గట్టుకు చేరుకోగా.. ఒకరి ఆచూకి లభించలేదు. అనేక చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. గ్రామగ్రామాలకు మధ్య రాకపోకలు స్తంభించగా.. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వేంసూర్ మండలం తాళ్ల చెరువుకు అలుగు పడింది. ఇదే మండలంలో లచ్చన్నగూడెంలో బెతుపల్లి కాలువకు గండిపడింది. పెనుబల్లి మండలంలో రాతోని చెరువు అలుగు ఉద్ధృతికకి రైతు మల్లెల రవి, ఆయన కుమారుడు జగదీశ్ నీటిలో కొట్టుకుపోగా కుమారుడు జగదీశ్ బయటపడగా తండ్రి గల్లంతయ్యారు. నర్సాపురం గ్రామ శివారులోని చిన్నవాగు ప్రవాహానికి చెప్టా వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో తోగూడెం.. నర్సాపురం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

ఖమ్మం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల ఇల్లూరు, ఏపిలోని కోనతమాత్మకూర్ వద్ద రాకపోకలు స్తంభించాయి. మధిర నుంచి ఖమ్మంకు వెళ్లే దారిలో కృష్ణాపురం సమీపాన పాలవాగు పొంగి రహదారి నీట మునిగింది. దేశినేనిపాలెం, మాటూరు, సిరిపురం గ్రామాల్లో పంటపాలాలు ముంపునకు గురయ్యారు. ఖమ్మం నుంచి ఎపి సరిహద్దు గ్రామమైన అన్నవరం గ్రామాల మధ్య దానయ్యవాగు పొంగిపొర్లడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. మధిరలోని హనుమాన్‌కాలనీ, ముస్లిం కాలనీ, రాఘవాపురం, లడక్‌బజార్ రోడ్డు ప్రాంతాల్లోని ఇళ్ల వెంబడి చుట్టూ వరదనీరు చేరికతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితే లేకుండాపోయింది. జిల్లాలోని వైరా, సత్తుపల్లిలోని పలు ప్రాంతాలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంట పాలాలు నీటమునిగాయి. కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. వరదనీటిలో చిక్కుకున్న వస్తువులు కాపాడుకోవడానికి ప్రజలు నానా ఇక్కట్లకు లోనయ్యారు.

తల్లాడ మండలం కుర్నవల్లి ఉన్నత పాఠశాలలో వరద నీరు చేరింది. పాఠశాలలో నిల్వ చేసిన బతుకమ్మ చీరలు, రేషన్ బియ్యం నీటి పాలయ్యాయి. అదే గ్రామంలో వరి పొలాలు జలమయమయ్యాయి. 20 గొర్రెలు మృత్యువాత పడగా, మరో 20 గాయాల పాలయ్యాయి. దీంతో గొర్రెల కాపరులు కన్నీటి పర్యంతమయ్యారు. సత్తుపల్లి-ఖమ్మం జాతీయ రహదారిలో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు బోల్తాపడ్డాయి. రహదారుల వెంట చెట్లు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. మధిరలో కురుస్తున్న కుండపోత వర్షానికి ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. మధిర ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు చేరింది. ప్రసూతి వార్డులోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 67 గ్మ్రాలలో 4198 మంది రైతులు చెందిన 8313 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రకటించారు.

ఇదే జిల్లాలో వర్షాలకకు 115 గృహాలు దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో 36 రోడ్లు కోతకు గురికాగా ఆరు కుంటలకు గండ్లు పడ్డాయి. ఏడు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 24 విద్యుత్ స్తంభాలు, 77 భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే 42 గ్రామాలకు రాకపోకకలు స్తంభించిపోయాయి. చండ్రుగొండ మండలంలో వెంగళరాయి సాగ్ చెరువు అలుగు కట్టకు గండి పడి నీరంతా పంట పొలాల్లోకి చేరింది. పదుల సంఖ్యలో పశువులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అశ్వారావుపేట-వేలేరుపాడు రహదారిపై నుంచి పెద్దవాగు పొంగి ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడం వల్ల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం కారణంగా పలుచోట్ల జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలలో ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వనపర్తి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. ఆత్మకూర్, మదన్‌పూర్ వెళ్లేటటువంటి రహదారిపైకి వరద పోటెత్తింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

ఓ యువకుడు రోడ్డు దాటాలని వెళ్లి వాగులో పడి కొట్టుకుపోతూ ఒడ్డుకు చేరాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడు ప్రాణాలు దక్కించుకోవడంతో తోటి ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాలకు సరళ సాగర్ ప్రాజెక్టు సైఫాన్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఓపెన్ కావడంతో వంద క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం మదన్‌పూర్ రోడ్డుపైకి చేరింది. సూర్యాపేట జిల్లాలో ఏకధాటి వర్షానికి హుజూర్‌నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో ఎర్రవాగు పొంగిపొర్లింది. వరదనీరు రోడ్డుపైకి రావడంతో రాకపోకలు స్తంభించాయి. ఎర్రవాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న వర్షం కురిసినా వాగు పొంగి ఫలితంగా పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు వాపోతున్నారు.

భాగ్యనగరాన్ని కమ్మేసిన చిమ్మ చీకట్లు

వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటలకే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసి అధికారులు హెచ్చరించారు. దాదాపు పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ జలాశయం నిండింది.

తడిసి ముద్దయిన భాగ్యనగరం

భాగ్యనగరం తడిసి మద్దయింది. భారీ వరదనీటితో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడుతోంది. బేగంబజార్, కోఠి, బషీర్‌బాగ్, నాంపల్లి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, మైత్రీవనం, బాలానగర్, జీడిమెట్ల, సుచిత్ర, కుత్బుల్లాపూర్, యూసఫ్‌గూడ, వెంగళరావునగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, పాతబస్తీ, జూపార్క్, బహదూర్‌పురా, పురానాపూల్, గోల్కోండ, లంగర్‌హౌస్, కార్వాన్, జియాగూడ, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లిలో వర్షం పడింది. హిమాయత్‌నగర్‌లో మోకాళ్ల లోతు వర్షం నీరు నిలిచిపోయింది. అలాగే బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయం నుంచి పీజీ న్యాయకళాశాల మీదుగా కింగ్ కోఠి వరకు మోకాళ్ల లోతు వర్షం నీరు చేరింది. టోలిచౌకలో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.

నదీం కాలనీలో భారీగా వరద నీరు చేరింది. మల్లాపూర్ డివిజన్ భవానీనగర్ కాలనీలో ఐదు అడుగుల లోతులో నీరు ప్రవహిస్తుండటంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపు ఇళ్లను గుర్తించి తరలించేందుకు జిహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. అటు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు గడ్డి అన్నారం, దిల్‌సుఖ్‌నగర్, కోదండరాం నగర్, చైతన్యపురి, శారదానగర్, పి అండ్ టి కాలనీ, వీవీ నగర్‌లోకి భారీగా వరద ప్రవాహం చేరింది. కాగా, సికింద్రాబాద్, ప్రకాష్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరుకుంది. ఇక సాగర్ రింగ్‌రోడ్డు, సాగర్ ఎన్‌క్లేవ్ కాలనీలోని ఇళ్లల్లో వరద నీరు చేరింది. మల్కాజ్‌గిరి, సత్తిరెడ్డినగర్‌లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. చైతన్యపురి, కమల్‌నగర్‌లో రహదారులు జలమయమయ్యాయి. నేరెడ్‌మెట్, అంబర్‌పేట్‌లలో రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. ఇదిలా ఉండగా..

మౌలాలి, సుభాష్‌నగర్ గోదాం వీధిలోకి ఇళ్లల్లోకి నీరు చేరింది

సికింద్రాబాద్, అల్వాల్‌లో చెరువులు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షం కొనసాగితే కాలనీలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. శ్రీబేకరి, శ్రీనివాస్‌నగర్ కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. హయత్‌నగర్‌లో మరోసారి సాహెబ్ నగర్ చెరువు తెగింది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరింది. అంబర్‌పేట శివం రోడ్‌లో భారీ చెట్టు నేలకొరిగింది. రాకపోకలు నిలిపివేసి చెట్టును తొలగించిన విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. సికింద్రాబాద్, కార్ఖానా ప్రాంతంలో రహదారిపై భారీగా వరద నీరు చేరింది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. నేరెడ్‌మెట్‌లో రహదారికి అడ్డంగా చెట్టు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.

హైదరాబాద్‌లో ఆరెంజ్
తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వాయుగుండం తీరం దాటి బలహీనపడుతుండటంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్‌లో ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోనూ ఆరెంజ్ హెచ్చరికకలు జారీ చేసింది. తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ విశ్వజిత్ కోరారు.

భారీ వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఏపిలోని కాకినాడ వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వాయుగుండంగా బలహీనపడిందని రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

హైదరాబాద్‌లో బీభత్సం

మన తెలంగాణ/హైదరాబాద్ : భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కారణంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల వాహనాల రాకపోకలుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, పనామా, సుష్మా వద్ద వాహనాలు కదలలేని పరిస్థితి ఉంది. ఆటోనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేటలోనూ వర్షపు నీరు రహదారిపైకి చేరడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. రెండు గంటలుగా వాహనాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ వద్ద ఓ పురాతన భవనం పెచ్చులూడి పడి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. భవనంలో 13 కుటుంబాలు అద్దెకు ఉంటున్నారన్న సమాచారాన్ని అందుకున్న అధికారులు హుటాహుటిన వారిని ఖాళీ చేయించారు. భారీ వర్షాల ప్రభావం మెట్రో సేవలపై కూడా పడింది. మంగళవారం ఉదయం నుంచి భాగ్యనగరంలో కుండపోతగా వర్షం కురి యడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

దీంతో, పలువురు నగర వాసులు మెట్రోను ఆశ్రయించారు. అయితే భారీ వర్షాలు, దీనికి తోడు ఈదురుగాలులతో మెట్రో సేవలు నెమ్మదించాయి. అమీర్‌పేట-ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడవగా.. భారీ వర్షాలు, గాలి కారణంగా అక్కడక్కడ కొద్దిసేపు మెట్రో సేవలు నిలిపివేశారు. భారీ వర్షంతో మూసారాంబాగ్ స్టేషన్‌లో కాసేపు మెట్రో రైలు నిలిచిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో హిమాయత్‌సాగర్ నిండకుండను తలపిస్తోంది. ప్రాజెకుట పూర్తిస్థాయి నీటిమట్ట 1763 అడుగులు ఉండగా.. ప్రస్తుతం అత్యధిక స్థాయిలో 1762.176 అడుగులకు నీరు చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు 833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. మంగళవారం అర్థరాత్రి సాగర్ గేట్లు ఎత్తనున్నారు. పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి ఎనిమిది మంది దుర్మరణం చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News