Sunday, April 28, 2024

బక్కచిక్కిన రూపాయి

- Advertisement -
- Advertisement -

The dollar to rupee exchange rate is Rs. 80

ఏడంతస్థుల భవనంపై నుంచి మెట్ల మీద ఏకబిగిన దొర్లుకొంటూ పడుతున్నట్టుగా ఉంది రూపాయి పతనం. అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో బ్రిటన్‌ను తలదన్ని అయిదవ స్థానం చేరుకొన్నామని, త్వరలో మరో మెట్టు ఎక్కబోనున్నామని చంకలు గుద్దుకొంటున్న తరుణంలో మన ఆర్ధిక అధోగతిని, అధ్వాన స్థితిని రూపాయి భారీ పతనం రుజువు చేస్తున్నది. గురువారం నాడు డాలర్‌తో రూపాయి మారకపు రేటు రూ. 80 దాటిపోయి 81కి చేరువ అయిపోయింది. రూ 80.86కు చేరుకొన్నది. ఈ పతనం ఎక్కడికి దిగజారుతుందో తెలియని అయోమయావస్థ కనిపిస్తోంది. దీని వల్ల అత్యవస ర దిగుమతులు ప్రియమైపోతాయి.మన అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న క్రూడాయిల్ భరించలేనిదైపోతుంది. ఎగుమతుల ఆదాయం పెరిగినా ఆ రంగంలో మన రికార్డు చెప్పుకోదగినది కాదు. మన తయారీ రంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది.

క్రూడాయిలు, బొగ్గు, తదితరాల దిగుమతి ఖర్చు పెరగడంతో దేశ వాణిజ్యలోటు భారీ స్థాయికి చేరిపోయింది. ఈ ఏడాది మే నెలలో 24.3 బిలియన్ డాలర్లుగా వున్న లోటు జూన్‌లో 25.6 బిలియన్ డాలర్లకు చేరుకొన్నది. అంటే వచ్చే ఆదాయానికి మించి అంత ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు డాలరుతో రూపాయి విలువ 7 శాతం పడిపోయింది. అయితే గత జూలై 15 తేదీ నాటికి యూరోతో రూపాయి విలువ 4.97 శాతం పెరిగిందని, బ్రిటిష్ పౌండుతో 6.25 శాతం, జపాన్ ఎన్‌తో 12.25 శాతం ఎక్కువైందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నది పెద్దగా ఉబ్బితబ్బిబ్బు అయిపోవలసిన విషయం కాదు. అవేవీ అంతర్జాతీయ మారకపు కరెన్సీలు కావు. కేవలం డాలర్‌కే ఆ ప్రాధాన్యం ఉంది. అది లింకు కరెన్సీ. అంతర్జాతీయ మార్కెట్‌లో లావాదేవీలన్నీ డాలర్లలోనే జరుగుతాయి. దిగుమతి సరకులన్నిటికీ డాలర్‌లోనే చెల్లించాలి.

మన ఎగుమతులు మన అవసరానికి మించి డాలర్లను సంపాదించినప్పుడే అంతర్జాతీయ వాణిజ్య లోటు తొలగుతుంది లేదా పరిమితమవుతుంది. గత ఏడాది మన వాణిజ్య లోటు మన జిడిపి (స్థూలదేశీయోత్పత్తి )లో 1.2 శాతం కాగా, ఈ ఏడాది 3.2 శాతం కానున్నదని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ -రష్యా యుద్ధం వల్ల, అంతర్జాతీయ ఆర్ధిక ఒత్తిడి వల్ల డాలరుతో రూపాయి విలువ పతనమవుతున్నట్టు సీతారామన్ ప్రకటించారు. అంతర్జాతీయ ఆర్ధిక ఒత్తిడి అంటే అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం వల్ల కలిగే వొత్తిడి. స్వదేశంలో ద్రవ్యోల్బణాన్ని పరిమితిలో ఉంచుకోడానికి అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుంటుంది.అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను అత్యధికంగా 75 బేసిస్ పాయింట్లు పెంచింది, ముందు ముందు ఇంకా పెంచొచ్చని అంటున్నారు. అక్కడ ఎక్కువ వడ్డీ వస్తుండడం వల్ల మన వంటి దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు తరలిపోతాయి.

ఈ ఏడాది ఇంతవరకు 23 బిలియన్ డాలర్లు ఈ విధంగా దేశాన్ని వీడిపోయాయి. ఇందువల్ల మన డాలర్ నిల్వలు పడిపోయి డాలర్‌తో రూపాయి బలహీనపడిపోతున్నది. కొవిడ్ పట్టిపీడించిన రెండేళ్లలో మనం 21 బిలియన్ డాలర్లను కొనుగోలు చేశాము. అంతకు మించిన మొత్తంలో డాలర్లు మన స్టాక్ మార్కెట్ల నుంచి ఈ ఏడాది తరలి వెళ్లిపోయాయి. డాలర్‌తో రూపాయి పతనాన్ని ఆపడానికి రిజర్వు బ్యాంకు ఒక్క జూలైలోనే 19 బిలియన్ డాలర్లను అమ్మిందని ఒక సమాచారం చెబుతున్నది. అనవసరమైన దిగుమతులను మానుకోడమో, తగ్గించుకోడమో చేయడం ద్వారా డాలర్‌తో రూపాయి పతనాన్ని పరిమితం చేయవచ్చు. గత మే నెలలో 107 టన్నుల బంగారం దిగుమతి చేసుకొన్నాము. అలాగే జూన్‌లో కూడా బంగారం దిగుమతులు గణనీయంగా ఉన్నాయి. మే నెలలో మన బంగారం దిగుమతుల విలువ గత ఏడాది మే నెల దిగుమతులతో పోల్చుకొంటే 789 శాతం పెరిగిందని తెలుస్తున్నది.

బంగారాన్ని డాలర్లు చెల్లించి తెచ్చుకోవలసి ఉంటుంది. అది అవసరమైన దిగుమతి కాదు. అందుచేత దాని దిగుమతిని నిరుత్సాహపరచడం ద్వారా డాలర్లను పొదుపు చేయాలని భావించి దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. డాలర్‌తో రూపాయి విలువ భారీగా పడిపోడం వల్ల మన క్రూడ్ ఆయిల్ బిల్లు పెరిగిపోయి దేశంలో ఇప్పటికే పేట్రేగిపోయిన పెట్రోల్, డీజెల్ ధరలు ఇంకా విజృంభిస్తాయి. దాని ప్రభావంతో రవాణా ఖర్చు మితిమించి అన్ని సరకుల ధరలూ మరింత పెరుగుతాయి. తాత్కాలికంగా వచ్చిపోయే విదేశీ పోర్టుఫోలిమో పెట్టుబడులపై ఆధారపడినంత కాలం మన డాలర్ నిల్వలు నిలకడగా ఉండవు. ఎగుమతుల ద్వారా డాలర్ల రాబడిని పెంచుకొన్నప్పుడే రూపాయికి ఈ దారిద్య్రం తొలగుతుంది. దేశంలో తయారయ్యే వస్తువులకు విదేశీ మార్కెట్లలో గిరాకీ పెంచుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వస్తువులను తయారు చేయగలగాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చేయవలసింది చాలా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News