Sunday, May 5, 2024

వర్షాల నష్టాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై తీసుకున్న జాగ్రత్తలు, నష్టాలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ మేరకు సికెం కెసిఆర్ రూ.500 కోట్లను వరద ప్రాంతాల్లో సహాయం కోసం ప్రకటించారని ప్రభుత్వం తరఫున రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రభుత్వ నివేదికను బుధవారం పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. ఇటీవల భారీ వర్షాలు, వరదల సందర్భంగా పూర్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు.. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉన్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

డాక్టర్ చెరుకు సుధాకర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వం తరఫున రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి తీవ్రత ఉన్న ప్రాంతాలకు ముందస్తుగా పది ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, రెండు హెలికాప్టర్లతో పాటు రాష్ట్ర పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని పంపించి నట్లు పేర్కొంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే సహాయక శిబిరాలు, అవసరమైన వైద్య, ఆహార ఏర్పాట్లను సిద్ధం చేశాయని ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. వరదల సమయంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఐఎఎఫ్, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, రెండు హెలికాప్టర్లు, 27 బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 11,748 మందిని 177 సహాయ కేంద్రాలకు తరలించినట్లు ప్రభుత్వం నివేదించింది.

జిల్లా యంత్రాంగానికి చేదోడుగా ఉండేందుకు అనుభవమున్న ఏడుగురు రాష్ట్రస్థాయి అధికారులను పంపించినట్లు పేర్కొంది. సచివాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా ఐఆర్‌సిఎస్ కేంద్రం ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు, సాయం అందించినట్లు వివరించింది. జిల్లా స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేశాయని నివేదికలో తెలిపారు.వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితులకు సహాయక చర్యలు కొనసాగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మృతులు, క్షతగాత్రులను గుర్తించి ఎస్‌డిఆర్‌ఎఫ్ నిబంధనల మేరకు బాధితులకు సాయం చేపట్టినట్లు తెలిపింది.

వరదల వల్ల జరిగిన నష్టం అంచనాకు కసరత్తు జరుగుతోందని, సాయం కోసం కేంద్రానికి నివేదిక పంపించే అవకాశం ఉందని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. రోడ్లు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించామని నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. మృతులకు రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాలు, వరదలకు 471 రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని, వాటిలో 181 రోడ్లను ఇప్పటికే తాత్కాలికంగా పునరుద్ధరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పంచాయతీ రాజ్ రోడ్లు 118 దెబ్బతినగా, ఇప్పటివరకు 75 తాత్కాలికంగా పునరుద్ధరించినట్లు తెలిపింది. విద్యుత్ సరఫరా 773 గ్రామాల్లో దెబ్బతినగా, 721 పునరుద్ధరణ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. మొబైల్, ఇంటర్నెట్ వ్యవస్థలను ప్రైవేట్ సంస్థలు పునరుద్ధరించాయని ప్రభుత్వం పేర్కొంది. వరద బాధితుల్లో మనో ధైర్యం నింపేందుకు వైద్య, ఎన్‌ఎంఎ సిబ్బంది, ఆశావర్కర్లు కౌన్సెలింగ్ ఇచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా దోమల పాగింగ్, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి చర్యలు చేపట్టామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News