Thursday, May 2, 2024

సెంట్రల్ విస్టాపై డౌట్‌లొద్దు

- Advertisement -
- Advertisement -

Central-Vista

 అవకతవకలకు తావులేదు
అనుభవజ్ఞులకే అప్పగింత
కేంద్ర మంతి హర్దీప్ సింగ్ పూరి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ప్రధాన కార్యాలయాలు ఉండే సెంట్రల్ విస్టా ప్రాంతానికి కొత్త రూపురేఖల విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని కేంద్ర పట్టణ, గృహ నిర్మాణాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ శనివారం స్పష్టం చేశారు. నిర్మాణాలపై కొందరు ఆర్కిటెక్ట్‌లు పలు రకాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో మంత్రి స్పందించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ఎటువంటి అవకతవకలకు తావే లేదని తెలిపారు. పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో నిమగ్నం అయిన వారు ప్రత్యేకించి ఇంజనీర్లు, రూపకర్తలు అంతా కూడా సరైన అనుభవం ఉన్నవారే అని తెలిపారు.

నిర్మాణ ప్రక్రియ దశలో వారు పలువురు టౌన్‌ప్లానర్లను, నిర్మాణ రంగ నిపుణులను సంప్రదించారని చెప్పారు. ప్రతిపాదిత ప్రక్షాళనతో వారసత్వ కట్టడాలు దెబ్బతింటాయని పలువురు హెరిటేజ్ , నిర్మాణరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రతీకాత్మక వారసత్వ కట్టడాలు ఎక్కడివక్కడే ఉంటాయని, వాటిని తొలిగించే లేదా రూపం మార్చే ప్రసక్తే లేదన్నారు. సెంట్రల్ విస్టాను తీర్చిదిద్దే బృహత్తర ప్రాజెక్టును గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ కంపెనీ హెచ్‌సిపి డిజైన్స్ దక్కించుకుంది. ఈ సంస్థకు ప్రముఖ నిర్మాణవేత్త బిమల్ పటేల్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సంస్థకు పలు కట్టడాలలో తగు అనుభవం ఉందని మంత్రి తెలిపారు. విస్తరణ పనులతో బహిరంగ స్థలాలు చాలా వరకూ హరించుకుపోతాయనే వాదనను మంత్రి తోసిపుచ్చారు. వీటి విస్తీర్ణం పెరుగుతుందే కానీ తరిగే ప్రసక్తే లేదన్నారు.

సిడ్నీ ఒపేరా తరహా కట్టడం

ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్ (ఐజిఎన్‌సిఎ)ను ప్రస్తుత స్థలం నుంచి మార్చే ప్రతిపాదన వివాదాస్పదం అవుతోన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించారు. దేశంలోని ప్రధాన అధికారిక కేంద్ర కార్యాలయాలన్ని నెలకొని ఉన్న లూట్యెన్స్‌ను ఆధునిక రీతిలో తీర్చిదిద్దేందుకు మోడీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఐజిఎన్‌సిఎ విషయాన్ని ప్రస్తావించగా మంత్రి దీనిపై నేరుగా స్పందించలేదు. అత్యద్భుతమైన భారీ స్థాయి సాంస్కృతిక కేంద్రం రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఇది సిడ్నీలోని అందమైన కట్టడం సిడ్నీ ఒపేరా హౌస్‌ను పోలి ఉంటుందన్నారు. తాము ఎప్పటికప్పుడు బిమల్ పటేల్‌తో మాట్లాడుతన్నామని, తగు జాగ్రత్తలు వెలువరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు ఉంటుందనే వాదనపై మంత్రి స్పందించారు.

రెండేళ్లలో త్రికోణాకృతి పార్లమెంట్

స్థలాలను పూర్తి స్థాయిలో నిర్మాణాల విషయంలో పర్యావరణ, స్థిరత్వ కోణం ఉండనే ఉంటుందని అన్నారు. సెంట్రల్ విస్టాలో భాగంగా త్రికోణాకృతి పార్లమెంట్ రూపుదిద్దుకుంటుంది. 900 నుంచి 1200 మంది ఎంపీలు సకల సౌకర్యాలతో కూర్చునే వీలుంటుంది. దీని నిర్మాణాన్ని 2022 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. మరో రెండేళ్లలో దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు జరుగుతాయని, అప్పటికి నూతన పార్లమెంట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇక 2024 నాటికి ఉమ్మడి కేంద్రీయ సచివాలయం నిర్మితం అవుతుంది.

There has been total transparency in Central Vista revamp

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News