Tuesday, April 30, 2024

నీట్ రద్దు చేసే ఆలోచన లేదు

- Advertisement -
- Advertisement -

విద్యార్థులకు సౌకర్యవంతగా ఉండేలా సిలబస్‌పై నిర్ణయం
నీట్ రద్దు చేసే ఆలోచన లేదు
ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తాం
పరిస్థితులు మెరుగుపడకపోతే సిబిఎస్‌ఇ పరీక్షల వాయిదా
విద్యార్థులు, తల్లిదండ్రులతో వెబినార్‌లో
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

Three times conduct Jee Mains exam

మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ మెయిన్స్‌ను ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. రెండు కంటే ఎక్కువ సార్లు జెఇఇ మెయిన్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మేలు కలుగుతుందనే ప్రతిపాదనలు ముందుకొచ్చాయని, దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2021 పరీక్షను రద్దు చేసే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీట్‌ను రద్దు చేయడం విద్యార్థులకు, దేశానికి భారీ నష్టం అని, అందుకే అలాంటి ఆలోచన ఏది చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే నీట్ జరుగుతోందని, ఒకవేళ విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే బాగుండని భావిస్తే, ఆ అంశాన్నీ తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. త్వరలో జరగబోయే పోటీ పరీక్షలు, బోర్డు పరీక్షలపై గురువారం ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన లైవ్ వెబినార్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా 2021లో జరిగే సిబిఎస్‌ఇ, జెఇఇ మెయిన్, నీట్ పరీక్షలపై విద్యార్థుల సందేహాలను కేంద్ర మంత్రి నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా 2021 నీట్, జెఇఇ మెయిన్ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు.

జెఇఇ సిలబస్ తగ్గింపుపై చర్చిస్తున్నాం

జెఇఇ మెయిన్ 2021 సిలబస్ తగ్గింపుపైనా చర్చలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి పోఖ్రియాల్ తెలిపారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని బోర్డులు సిలబస్ తగ్గించాయని, మరికొన్ని బోర్డులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యవంతగా ఉండేలా జెఇఇ మెయిన్ సిలబస్‌పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సిబిఎస్‌ఇ పరీక్షల గురించి ప్రస్తావిస్తూ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులు మెరుగుపడకపోతే విద్యార్థులకు మరింత సమయం కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పోటీ, బోర్డు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను కేంద్రమంత్రి అభినందించారు. కొవిడ్ పరిస్థితులు కొద్దికొద్దిగా మెరుగుపడుతున్న నేపథ్యంలో త్వరలోనే విద్యార్థులు అందరూ తిరిగి పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 17 రాష్ట్రాలు స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించాయని పేర్కొన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏడాది జెఇఇ, నీట్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కొవిడ్ సమయంలో ప్రపంచంలో జరిగిన అతిపెద్ద పోటీ పరీక్ష నీట్ కావడం విశేషమని వ్యాఖ్యానించారు. ఈసారి నీట్ పరీక్షా కేంద్రాలను పెంచామని, విద్యార్థులు తమకు అనుకూలమైన ప్రాంతంలో పరీక్ష రాసే అవకాశం కల్పించామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో జెఇఇ మెయిన్ 2020, నీట్ 2020 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ ఎంతగానో దోహదపడిందని చెప్పారు. ల్యాబ్ ప్రయోగాల కోసం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకపోతే ప్రాక్టికల్స్ నిర్వహించడం సాధ్యం కాదని, దీనిపై చర్చిస్తామని తెలిపారు. ఇప్పటికే సిబిఎస్‌ఇ 30 శాతం వరకు సిలబస్ తగ్గించిందని, కొవిడ్ పరిస్థితులు ఇలాగే ఉంటే 2021లో జరిగే సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తామని చెప్పారు. ఆ తర్వాత సిలబస్‌పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News