Thursday, May 2, 2024

ఎంఎల్‌ఎ పదవికి టిఎంసి కీలక నేత సువేందు అధికారి రాజీనామా

- Advertisement -
- Advertisement -

TMC key leader Suvendu Adhikari resigns as MLA

 

19న అమిత్‌షా సమక్షంలో బిజెపిలోకి..

కోల్‌కతా : బెంగాల్‌లో అధికార టిఎంసిలోని కీలక నేత, మాజీమంత్రి సువేందు అధికారి బుధవారం తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా నందిగ్రాం నియోజకవర్గానికి అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో అసెంబ్లీకి చేరుకున్న అధికారి అక్కడ స్పీకర్ లేకపోవడంతో తన రాజీనామా లేఖను కార్యాలయంలో అందజేశారు. ఈస్ట్ మిడ్నాపూర్ జల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు, ఓ అసెంబ్లీ స్థానానికి అధికారి కుటుంబసభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కొంటాయి మున్సిపాలిటీలోనూ వారి కుటుంబమే అధికారం చెలాయిస్తోంది. ఆ ప్రాంతంలోని మరికొన్ని జిల్లాల్లోనూ పట్టున్న నేతగా అధికారి గురించి చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఈ నెల 19న అధికారి బిజెపిలో చేరనున్నట్టు ఇప్పటికే ఆయన సన్నిహితులు వెల్లడించారు. బిజెపిలో చేరుతానంటే అధికారికి సాదరంగా స్వాగతం చెబుతామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టిఎంసికి చెందిన మరికొందరు ఎంఎల్‌ఎలు, ఎంపీలు కూడా బిజెపిలో చేరనున్నట్టు భావిస్తున్నారు.

ఈ నెల 19, 20 తేదీల్లో అమిత్‌షా బెంగాల్‌లో పర్యటిస్తారు. మూడు జిల్లాల్లో అమిత్‌షా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ కూడా అందులో ఒకటి. అధికారి ఇప్పటికే మమతాబెనర్జీ పాలనాతీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతనెల మంత్రి పదవికి రాజీనామా చేశారు. మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అధికారి వ్యతిరేకించారని సన్నిహితులు చెబుతున్నారు. బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నందిగ్రాంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నడపడంలో అధికారి కీలక పాత్ర పోషించారు. ఆ ఉద్యమం టిఎంసికి ప్రజల్లో ఆదరణను పెంచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News