Thursday, May 2, 2024

గెలిస్తేనే నిలుస్తారు..

- Advertisement -
- Advertisement -

Today match between Sunrisers and Bangalore

 

సన్‌రైజర్స్‌కు పరీక్ష, నేడు బెంగళూరుతో పోరు

షార్జా: ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో గెలవడం తప్ప సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మార్గం కనిపించడం లేదు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో చేజేతులా ఓడడం ద్వారా సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా గెలిచే స్థితి నుంచి ఓటమి చవిచూసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ద్వారా హైదరాబాద్ మళ్లీ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌తో పాటు ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తేనే హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ రెండింటిలో గెలిచినా నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకోవడం కష్టమే. దీని కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. ఇక ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ అసాధారణ ఆటతో అలరించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ఘన విజయం సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్, వృద్ధిమాన్ సాహా మెరుపులు మెరిపించారు. మనీష్ పాండే కూడా అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ 200కి పైగా పరుగులు సాధించింది. బౌలర్లు కూడా మెరుగ్గా రాణించడంతో ఢిల్లీపై భారీ విజయాన్ని సాధించింది. ఇక బెంగళూరుపై కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఇరు జట్లలోనూ కొదవలేదు. హైదరాబాద్‌తో పోల్చితే విరాట్ కోహ్లి సేన కాస్త బలంగా కనిపిస్తోంది. పడిక్కల్, డివిలియర్స్, కోహ్లి, ఫిలిప్, క్రిస్ మోరిస్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

అంతేగాక చాహల్, నవ్‌దీప్, మోరిస్, స్టెయిన్, సిరాజ్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే మారింది. దీంతో బెంగళూరుపై విజయం సాధించడం హైదరాబాద్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. అయితే ప్రతిభావంతులైన బౌలర్లు కలిగిన హైదరాబాద్‌ను తక్కువ అంచన వేయలేం. సమష్టిగా రాణిస్తే ఎంత పెద్ద జట్టునైన అలవోకగా ఓడించే సత్తా వార్నర్ సేనకు ఉంది. దీంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయం. ఇదిలావుండగా ప్రస్తుతం బెంగళూరు 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే విరాట్ కోహ్లి జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. హైదరాబాద్ ఓడితే మాత్రం నాకౌట్ రేసు నుంచి వైదొలగక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News