Friday, May 3, 2024

ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్

- Advertisement -
- Advertisement -

Tragedy King actor Dilip Kumar

 

బాలీవుడ్ సినిమాను మలుపుతిప్పిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్. భారతీయ చలనచిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్‌గా చెప్పుకునే తరానికి ఆయన ప్రతినిధి. దేవదాస్, మొఘల్- ఎ- ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి వంటి క్లాసిక్ సినిమాలు ఆయనవే. బాలీవుడ్‌లో ట్రాజెడీ కింగ్‌గా పాపులరైన దిలీప్ కుమార్ కెరీర్ నాలుగున్నర దశాబ్దాల పాటు దిగ్విజయంగా కొనసాగింది. ఆయన తన కెరీర్‌లో 70 చిత్రాలలో నటించారు. దేవదాస్ (1955), -నయా దౌర్ (1957)-,మొఘల్ -ఎ- అజామ్ (1960),- గంగా జమునా (1961), -క్రాంతి (1981),- కర్మ (1986) వంటి క్లాసిక్ హిట్స్‌లో నటించారు.

దిలీప్‌కుమార్ చివరిసారిగా 1998లో ‘ఖిలా’లో కనిపించారు. మ్యూజికల్ హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్ దిలీప్ కుమార్. ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో పాటలన్నీ హిట్టయ్యేవి. ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ బాలీవుడ్ ఆల్‌టైమ్- 50 క్లాసిక్ సాంగ్స్‌లో దిలీప్ కుమార్ పాటలే ఎక్కువే. అదీ ఆయన స్టామినా. హిందీ సినిమాకి ఫార్ములాటిక్ నటనను అలవరిచిన మార్గదర్శకుడు దిలీప్ కుమార్. ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్. 1922, డిసెంబర్ 11న ప్రస్తుత పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆయన జన్మించారు. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారి. మహారాష్ట్రలో వారికి భూములు ఉండడంతో ముంబయ్‌కి మకాం మార్చారు.

అనుకోకుండా సినిమాల్లోకి…

మెథడ్ యాక్టర్‌గా పేరున్న దిలీప్ కుమార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటానికి ముందు ఏం చేశారన్న విషయం ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. ఆ మాటకు వస్తే.. ఆయన సినిమాల్లోకి ఎంట్రీనే సినిమాటిక్ సీన్‌తో మొదలైందని చెప్పాలి. నిజానికి ఈ రోజుకు ఏదైనా సినిమాకు వాడేందుకు వీలున్న సీన్‌గా దీన్ని చెప్పాలి. ఇంతకీ ఆయన సినిమా ఎంట్రీ ఎలా మొదలైందంటే… ప్రఖ్యాత నటి కమ్ బాంబే టాకీస్ యజమాని దేవికా రాణి ఫుణె రోడ్డు మీద వెళ్తున్నారు. ఆమెకు రోడ్డు మీద పండ్లు అమ్మే ఒక యువకుడిని చూశారు. అతడిని చూసినంతనే హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. ఆలస్యం చేయకుండా తాను తీసే సినిమాలో హీరోగా ఎంపిక చేశారు. ఆ యువకుడి పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్. అయితే అతని పేరు మార్చితే బాగుంటుందని సినిమా టీమ్ అనుకుంది. అప్పట్లో సూపర్ స్టార్‌గా అశోక్ కుమార్ ఉన్నారు కాబట్టి.. కొత్తగా తాము పరిచయం చేస్తున్న నటుడికి దిలీప్ కుమార్ అని పేరు పెడితే బాగుంటుందని భావించారు. అందుకు యూసుఫ్ ఖాన్ ఓకే చెప్పడంతో.. సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరు దిలీప్‌కుమార్‌గా సుస్థిరమైంది. ఆతర్వాత ఆయన దిగ్గజ నటుడిగా నిలిచిపోయారు. ఇక సినిమాల పట్ల ఆసక్తి ఉన్నా నటుడిని అవుతానని దిలీప్‌కుమార్ ఏ రోజూ అనుకోలేదట.

పట్టుదలతో మహా నటుడిగా…

దొరికిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోవటమే కాదు.. భారతీయ సినిమా మీద ఏదైనా రీసెర్చ్ చేయాలంటే.. దిలీప్ కుమార్ సినీ జీవితాన్ని చూస్తే సరిపోతుందంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దిలీప్‌కుమార్ నటించిన తొలి చిత్రం ‘జ్వార్ భాటా’.. 1944లో విడుదలైంది. ఈ మూవీ అట్టర్ ప్లాప్ కావటమే కాదు.. సినీ విమర్శకులు అతని నటనను తీవ్రంగా విమర్శించారు. అదే అతనిలో పట్టుదలను పెంచడమే కాదు.. చివరకు మహా నటుడిగా నిలిచేటట్లు చేసింది. తన తొలి సినిమా తర్వాత దిలీప్ కుమార్ నటనపై కసి పెంచుకున్నారు. క్రమం తప్పకుండా సినిమాలు చూసేవారు. హాలీవుడ్ నటుడు జేమ్స్ స్టువర్ట్ సహజ నటన అతనికి నచ్చడంతో ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లారు. అనంతరం దిలీప్‌కుమార్ నటించిన ‘జుగ్ను’, ‘మిలన్’ తదితర చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

పలువురితో ప్రేమాయణం…

దిలీప్ కుమార్ సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే. ఆయన వ్యక్తిగత జీవితం సైతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన వైవాహిక జీవితం. పలువురు నటీమణులతో ప్రేమాయణం నడిచినప్పటికీ… అనుకోని కారణాలతో పెళ్లి వరకు వెళ్లలేకపోయాయి. తనతో నటించిన నటీమణులలో కామినీ కౌశల్‌తో దిలీప్‌కుమార్ సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆమెను పెళ్లి చేసుకోలేకపోయారు. ఆతర్వాత మధుబాలతో లవ్ ఎపిసోడ్ అందరికి తెలిసిందే. అదీ.. ఫెయిల్ అయింది. వైజయంతిమాలతోనూ ఆయన ప్రేమాయణం సక్సెస్ కాలేదు. చివరకు తన కంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును తన 44 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. కానీ వారికి పిల్లలు లేరు.

గొప్ప నటనతో మెప్పించారు…

దిలీప్‌కుమార్ తన సహజ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ‘దేవదాస్’లో ప్రేయసిని పొందే ధైర్యం లేక, తాగి జీవితాన్ని నాశనం చేసుకున్న పాత్రలో ఆయన జీవించారు. ‘కోహినూర్’ చిత్రంలో మరచిపోలేని హాస్యాన్ని అందించారు. ‘యహూది’లో ప్రేమికుడిగా అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులను మెప్పించారు. దిలీప్‌కుమార్ నటించిన ‘మధుమతి’ భారతీయ సినీ చరిత్రలో అద్భుత చిత్రంగా నిలిచింది. ఆయన నటించిన మరో అద్భుత దృశ్య కావ్యం ‘మొఘల్ ఎ ఆజం’. అదేవిధంగా ‘గంగా జమున’లో తన గొప్ప నటనతో ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు దిలీప్ కుమార్. 1949లో వచ్చిన ‘అందాజ్’ దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్‌ల సినీ కెరీర్‌ణు మలుపు తిప్పింది. తారానా, సంగ్‌దిల్, దాగ్, షికస్త్, ఫుట్‌పాత్ వంటి సూపర్ హిట్ సినిమాలతో దిలీప్‌కుమార్ ట్రాజెడీ కింగ్‌గా ఎదిగారు. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్‌గా వెలుగుతున్న రోజుల్లో ఆయనకు ధీటుగా నిలబడిన స్టార్ దిలీప్‌కుమార్ ఒక్కరే. ఈ నేపథ్యంలో దిలీప్‌కుమార్, అమితాబ్‌తో దర్శకుడు రమేష్ సిప్పీ తెరకెక్కించిన ‘శక్తి’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రంలో ఉత్తమ నటనకు గాను దిలీప్‌కుమార్ ఫిలింఫేర్ అందుకున్నారు.

ప్రముఖ తెలుగు ఫిల్మ్‌మేకర్ బి.నాగిరెడ్డి రూపొందించిన ‘రామ్ ఔర్ శ్యామ్’లో దిలీప్ నటించారు. తెలుగు, తమిళ వర్షన్‌లో రామారావు, ఎంజీఆర్ నటించారు. తెలుగు సినిమా ‘బొబ్బలి బ్రహ్మన్న’ హిందీ రీమేక్ ‘ధర్మాధికారి’లో దిలీప్‌కుమార్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక తన చివరి సినిమా ‘ఖిలా’లో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత…

రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దిలీప్‌కుమార్ ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. ఆయన తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకునే వారు కాదు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు దిలీప్‌కుమార్. ఇక భారత చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో ఆయనను గౌరవించింది. ఇవేకాకుండా తన కెరీర్‌లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు దిలీప్ కుమార్.

హాలీవుడ్ సినిమాను కాదనుకొని…

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌కు ఒకసారి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. హాలీవుడ్ సినిమా ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’లో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు డేవిడ్ లీన్… సినిమాలోని ప్రిన్స్ షరీఫ్ అలీ పాత్రను దిలీప్ కుమార్‌కు ఆఫర్ చేశారు. భారతీయ సినిమాలంటే ఇష్టపడే డేవిడ్ తన సినిమా కోసం దిలీప్ కుమార్‌ను సంప్రదించగా… తనకు హాలీవుడ్‌లో నటించాలనే ఉద్దేశం లేదని ఆయన చెప్పారట. 1962లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ సినిమా ఏడు అవార్డులను దక్కించుకోవడం విశేషం.

సినీ ప్రముఖుల సంతాపం…

బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ అస్తమయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో విషాదం నింపింది. దిగ్గజ నటుడితో తమకున్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ఘన నివాళులు అర్పించారు. భారత సినీ చరిత్రను దిలీప్ కుమార్‌కు ముందు తర్వాత రాయాలని బిగ్ బీ అమితాచ్చన్ సంతాపం ప్రకటించారు. “భారతీయ సినీచరిత్రలో ఒక శకం ముగిసింది. లెజెండ్ దిలీప్ కుమార్ సాబ్ మరణించినందుకు చాలా విచారంగా ఉంది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు ఆయన. యాక్టింగ్ స్టూడియో.. నేషనల్ ట్రెజర్ ఆయన.. ప్రపంచానికి ఆయన నటుడిగా ఎంతో వినోదం పంచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. దిలీప్ కుమార్‌తో కలిసి ఉన్న నాటి క్లాసిక్ ఫోటోని చిరు ట్విట్టర్‌లో షేర్ చేశారు. “భారతీయ సినిమాకు ఆయన ఓ లెజెండ్. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారు”అని మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ నివాళులు అర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News