Thursday, May 2, 2024

సమాధిగత చట్టానికి ప్రాణం!

- Advertisement -
- Advertisement -

SC shocked on Section 66A of IT Act‌

 

రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకోడాన్నే ఉగ్రవాద చర్యగా పరిగణించి గాఢమైన వృద్ధాప్యంలోనూ నిర్బంధంలో ఉంచి ప్రాణాలు కోల్పోయే దుస్థితిని దాపురింప చేసిన ఫాదర్ స్టాన్ స్వామి ఉదంతం కేంద్ర పాలనలోని నిరంకుశత్వానికి నిదర్శనంగా నిలవగా, సుప్రీంకోర్టు కొట్టి వేసిన ఆరేళ్ల తర్వాత కూడా ఐటి చట్టంలోని ఒక పాశవిక సెక్షన్‌ను ఉపయోగించి పోలీసులు కేసులు పెడుతున్న దారుణం దిగ్భ్రాంతిని, భయోత్పాతాన్ని కలిగించడం సహజం. ఇప్పటికే చట్ట అతిక్రమణలో అందె వేసిన చేతులుగా నిరూపించుకున్న పోలీసులను సుప్రీంకోర్టు తీర్పులు కూడా అదుపులో పెట్టలేకపోతే జనాభాలో బలహీనులే అధికంగా ఉన్న దేశంలో వారి విశృంఖలత్వాన్ని ఆపగలిగేదెవరు? ‘ఇది చాలా దారుణం, పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో తెలియజేస్తున్న ఘోర ఉదంతం’ అంటూ సుప్రీం ధర్మాసనం ఆందోళనతో కూడిన విస్మయాన్ని ప్రకటించడం చాలా అరుదైన విషయం. ఆరేళ్ల క్రితమే తాను రద్దు చేసిన సమాచార సాంకేతికత చట్టం లోని 66 ఎ సెక్షన్‌ను ఉపయోగించి అనేక రాష్ట్రాల్లోని పోలీసులు ఇంకా కేసులు పెడుతున్నారని తెలిసి న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, కెఎం జోసెఫ్, బిఆర్ గవాయ్‌ల సుప్రీం ధర్మాసనం తనను తాను నమ్మలేకపోయిన స్థాయిలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

కంప్యూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్‌లు వంటి వాటిపై ఆధారపడి నడిచే మీడియా ద్వారా అనగా స్థూలంగా సామాజిక మాధ్యమాల ద్వారా పంపించే ఏ రూపంలోని సందేశం, సమాచారమైనా అభ్యంతరకరమైనదిగా అనిపిస్తే కేసు పెట్టే అధికారాన్ని పోలీసులకు ఈ సెక్షన్ సంక్రమింప చేసింది. ఈ సెక్షన్ కింద ఆరోపణ రుజువైతే గరిష్ఠంగా మూడేళ్లు జైలు శిక్ష విధించే అధికారం న్యాయస్థానాలకు కల్పించింది. 2015 మార్చి 24న శ్రేయ సింఘాల్ x కేంద్ర ప్రభుత్వం కేసులో తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ను కొట్టి వేసింది. తద్వారా సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాణం పోసింది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును దేశమంతా సవినయంగా స్వీకరించి పాటించవలసి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు, పోలీసులు దానిని శిరోధార్యంగా పరిగణించవలసి ఉంది. దిగువ న్యాయస్థానాలు కూడా సుప్రీం అభిప్రాయాన్ని ప్రాణ ప్రదంగా పరిగణించి వ్యవహరించుకోవాలి. కాని ఈ సెక్షన్ విషయంలో ఆరేళ్లుగా అందుకు పూర్తి విరుద్ధమైన ధోరణి అప్రతిహతంగా సాగిపోడం సుప్రీం ధర్మాసనానికి దిగ్భ్రాంతి కలిగించిందంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు.

పౌర స్వేచ్ఛల ప్రజా సంఘం (పియుసిఎల్) అనే ప్రభుత్వేతర సంస్థ ఈ సెక్షన్ కింద ఇప్పటికీ కేసుల నమోదు జరుగుతున్న విషయాన్ని ఎత్తి చూపుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ను కొట్టి వేసిన తర్వాత అంటే 2015 మార్చి 24 గడిచిన అనంతరం ఈ ఏడాది మార్చి 10 నాటికి దీని కింద 11 రాష్ట్రాల్లోని జిల్లా కోర్టుల్లో 745 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఒక్క మహారాష్ట్రలోనే 381, యుపిలో 245 వ్యాజ్యాలు దాఖలయ్యాయని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ పరేఖ్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఇంకెన్ని కేసులు నమోదై ఉన్నాయో ఆరా తీస్తే తెలుస్తుంది. ఈ కఠోర వాస్తవాన్ని గురించి తెలుసుకున్న న్యాయమూర్తి నారిమన్ ‘ఆశ్చర్యకరం, ఏమి జరుగుతున్నదో గమనిస్తే మతి పోతోంది’ అని వ్యాఖ్యానించారు. విచిత్రమేమిటంటే ఆ సెక్షన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని చట్ట పాఠంలోని 66 ఎ పక్కన బ్రాకెట్‌లో పేర్కొనడానికి బదులు అధోపాఠం (ఫుట్‌నోట్) గా చేర్చడం వల్ల పోలీసులు దానిని గమనించకుండా కేసులు పెడుతూ పోతున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి తెలియజేశారు.

ఇంతకంటే విడ్డూరం మరొకటి ఉంటుందా? అథోపాఠాన్ని కూడా గమనించకుండా చట్టం లోని కొట్టి వేసిన సెక్షన్ కింద కేసులు బనాయిస్తూ పోడం రాజ్యాంగ విహిత న్యాయ పాలన ఎలా అవుతుంది? ఈ ఒక్క విషయంలోనే కాదు, పౌర స్వేచ్ఛలు, స్త్రీ స్వాతం త్య్రం, బాలల హక్కులు వంటి అనేక సున్నితమైన అంశాలలో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో శోధించి, పదహారణాల ప్రజాస్వామిక స్ఫూర్తితో కూర్చిన విధి విధానాలను పక్కనపెట్టి దేశంలో శతాబ్దాలుగా అమల్లో ఉన్న అసమ, అణచివేత లక్షణాలు గల సామాజిక దుర్నీతి నియమాలనే అనుసరిస్తున్నట్టు రుజువు చేసే ఉదంతాలనేకం. ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా ఇది సాగడం గమనించగలం. అదే మానసిక స్థితిలో ఉండి పోలీసులు, న్యాయస్థానాలు వ్యవహరిస్తున్న చోట వారిని సుప్రీంకోర్టు తీర్పులు మాత్రం ఎలా అడ్డుకోగలవు? ఈ దుస్థితిపై కూలంకషమైన చర్చ జరగాలి. దుష్ట చట్టాలను, వాటి సెక్షన్‌లను సమాధుల నుంచి తవ్వి తీసి పాలకుల నిరంకుశ విధానాలకు అనుగుణంగా ఉపయోగించుకునే దుర్మార్గానికి ఇకనైనా తెరపడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News