Friday, April 26, 2024

మగపిల్లాడికో శిక్షణ

- Advertisement -
- Advertisement -

 Male Child

 

ఈ మధ్యకాలంలో మంత్రులు, ప్రజాసేవకులమని చెప్పుకొనేవాళ్లు కూడా ఏదైనా కోపంగా చెప్పాలనుకుంటే ‘మేం గాజులు తొడుక్కున్నామా’ అంటారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే వాళ్లకు గాజులు, పువ్వులు పంపుతూ ఉంటారు. అంటే మాటల్లోనే ఇది ఆడవాళ్ల స్థానం అని నిరూపించటంగా లేదూ? భారతీయ సమాజమే పురుషాధిక్య భావజాలం ఉన్న సమాజం. మగవాళ్లు ఏదైనా చేయగలరు అన్న ఆలోచనలోనే ఉంటారు.

స్త్రీలు దాన్ని ఆమోదించే వర్గంగా తరాల తరబడి, నిలబడి ఉన్నారు. ఈ దృక్పథం కొంత మారింది కానీ పూర్తిగా కాదు. ఆలోచనా తీరుతో మార్పు రావాలి. అలా వస్తేనే దాన్ని పిల్లల పెంపకంలో ఇంప్లిమెంట్ చేసే వీలుంటుంది. ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఉంటే అమ్మాయికి బార్బీడాల్, అబ్బాయికి టాయ్‌గన్ కొనిపెడుతూ ఉంటారు. ఆడే ఆటలు, మాట్లాడే మాటలు, తప్పకుండా వేరేగానే ఉంటున్నాయి. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో పెంపకంలో ఉండే తేడానే వాళ్లని వాళ్ల దృష్టిలో హీరోలుగా, ఆడపిల్లలంతా తమ కంటే తక్కువ వాళ్లుగా చూసేలా చేస్తోంది.

ఇళ్లలో సంభాషణ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం ఎంత తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నామో తేలిపోతుంది. అబ్బాయికి సిగ్గుగా మాట్లాడలేక పోతుంటే, అదేమింట్రా ఆడపిల్లలా సిగ్గుపడతావు అంటారు. అమ్మాయిలా మెలికలు తిరుగుతావు అంటారు. ఏడిస్తే అమ్మాయిలా ఏడుపేమిటీ? ఇండోర్ గేమ్స్ ఆడుతుంటే, ఆడపిల్లలా ఆ ఆటలేమిటి? మగ పిల్లలతో ఆడుకోమనో అలా చెప్పేస్తూ ఉంటారు. అమ్మాయిలకు చెప్పే నీతులు ఏవీ మగపిల్లలకు చెప్పరు. గట్టిగా అరవద్దు, పరుగెత్తకు, డిస్కషన్ల జోలికి పోవద్దు, తలవంచుకో, మగపిల్లలతో మాట్లాడకు, కుటుంబ గౌరవం నిలబెట్టు.

ఇవన్నీ ఆడపిల్లలకు మాత్రమేనా? ఇవన్నీ పిల్లలకు చెందే మంచి విషయాలు. సమాజంలో అన్ని సద్గుణాలతో ఉండాలంటే పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి అంతేగానీ అందులో ఆడ, మగ విచక్షణ అక్కరలేదు. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న అత్యాచారాలు గమనిస్తే మగపిల్లల్ని పెంచే తీరులో తల్లిదండ్రులు వాళ్ల దృక్పథం మార్చుకోవాలి అనిపిస్తుంది.

ఇవే తప్పులంటే: మగపిల్లవాడు ఏడుస్తూ అది ఆడపిల్లలు చేసే పని అని అర్థం వచ్చినట్లు చెబుతూ ఉంటారు. ఇలాంటి భావన మగపిల్లవాడికి కలిగించటం అతని భావోద్వేగాన్ని అణచి వేయటంగా చెబుతారు సైకాలజిస్టులు. ఒక ఉద్వేగాన్ని అణుచుకోవటం ప్రాక్టీస్ చేస్తారు వాళ్లు. అలా అణిచిపెట్టిన ఉద్వేగం తీవ్రరూపంలో కోపం దూకుడుతనంగా బయటపడుతూ ఉంటుంది. ఇక ఇలా కోపంగా దూకుడుగా ఉంటే సమాజంలో ప్రత్యేకంగా కనిపిస్తాం అనుకుంటారు.

అలాగే అమ్మాయిలకు చెప్పినట్లు, చీకటి పడగానే ఇంట్లో ఉండమనో, స్నేహితుతో బయటికి వెళుతుంటే ఎవరితో వెళుతున్నావు? ఎందుకు ఇప్పుడని చెప్పరు. మగపిల్లలు ఇలా ఉంటారనే ఆలోచన లోంచి ముందు అమ్మానాన్న బయటికి రావాలి. వాళ్ల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే దండించాలి, నియంత్రించాలి. అమ్మాయికో నియమం, అబ్బాయికో పద్ధతి అంటూ మగపిల్లల్ని వేరు చేయకూడదు. మగపిల్లవాడు సన్మార్గంలో పెరగాలంటే ఎలా నడుచుకోవాలో చెప్పాలి. పెరిగే వయసులో వాళ్ల స్నేహితులనో, వాళ్లు గడిపే సమయాన్ని గమనించుకోవాలి.

ప్రతి తల్లి తన కొడుక్కి సమాజంలో ఉండే ఆడపిల్లల పట్ల మెలగవలసిన ఒక పద్ధతి నేర్పించాలి. అమ్మాయిలతో స్నేహం నేరం కాదు కానీ అదొక సహజమైన విషయంగానే చూసేలా పెంచాలి. లైంగిక విషయాల గురించి, శరీరంలో వచ్చే మార్పులు, మెదడులో కలిగే ఆలోచనలు అన్నీ వాళ్లతో చర్చించాలి. విచ్చలవిడి సెక్స్ సంబంధంతో వచ్చే అనర్థాల గురించి వివరించాలి. ఒక బాధ్యతగల పౌరుడిగా ఎదిగామంటే ఎలాంటి ప్రవర్తన పద్ధతి ఎలా ఉండాలో వాళ్లతో నిరంతరం చెబుతూనే రావాలి.

పిల్లలకు తల్లిదండ్రులే రోల్‌మోడల్స్. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన, పిల్లలపైన అధికమైన ప్రభావం చూపెడుతుంది. తాగుడు, గృహహింస అక్రమ సంబంధాలు వంటివి ఇంట్లో ఉంటే అది పిల్లలపైన దుష్ప్రభావం చూపించకుండా ఉండదు. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పనక్కర్లేదు. వాళ్లు చూసి ఇదంతా సక్రమమైందే అనుకునే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే అది పిల్లలకు ఒక చక్కని జీవితం గురించి అవగాహన ఉంటుంది. ముందు పెద్దవాళ్ల నడవడిక బావుంటే పిల్లలు దాన్ని చక్కగా చూసి నేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, బాధ్యత పిల్లలకు ఒక సంపదలాగే అందుతాయి. ఉరకలు వేసే నదికి అడ్డుకట్టలు కట్టి దాన్ని సహజంగా మళిస్తేనే అది చుట్టు పక్కల నేలను సస్యశ్యామలం చేస్తుంది. అలాగే పిల్లలు సన్మార్గంలో ఉండాటంటే పెద్దవాళ్లు వాళ్లను సవ్యమైన మార్గాలతో నడిపించాలి. ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో, ఎలా సత్పవర్తనతో జీవించాలో నేర్పాలి. ఆడపిల్లలయినా మగపిల్లలయినా ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడాలి.

 

Training for the Male Child
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News