Tuesday, April 30, 2024

ఆరుగురు టిఎంసి రాజ్యసభ అభ్యర్థుల జాబితా వెల్లడి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : ఈనెల 24 న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సోమవారం వెల్లడించింది. ఈ జాబితాలో డెరెక్ ఓబ్రెయిన్, సుఖేందు శేఖర్ రాయ్, డోలాసేన్, సాఖేత్ గోఖలే, సమిరుల్ ఇస్లాం, ప్రకాష్ చిక్ బరైక్ బరిలో ఉంటారని టిఎంసి ప్రకటించింది. వీరిలో ఓబ్రెయిన్, సుఖేందు శేఖర్ రాయ్, డోలాసేన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే వీరి పదవీకాలం ముగియనుండడంతో మళ్లీ వీరికి చోటు కల్పించడమైంది. ఓ బ్రెయిన్ 2011 నుంచి రాజ్యసభ ఎంపీగా ఉంటున్నారు. సుఖేందు శేఖర్ రాయ్ 2012 లో మొదటిసారి రాజ్యసభ ఎంపీ అయ్యారు. డిప్యూటీ చీఫ్ విప్ డోలా సేన్ సీనియర్ నాయకునిగా, కార్మిక సంఘ నాయకునిగా పేరు పొందారు. 2017లో మొదటిసారి రాజ్యసభ ఎంపీ అయ్యారు.

ఈ జాబితాలో కొత్తవారిలో బంగ్లా సంస్కృతి మంచా అధ్యక్షుడు సమిరుల్ ఇస్లాం, అలిపుర్‌దుయార్ జిల్లా టిఎంసి అధ్యక్షుడు ప్రకాష్ చిక్ బరైక్, సమాచార హక్కు ఉద్యమ నేత , టిఎంసి అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఉన్నారు. ఓబ్రెయిన్, రాయ్, సేన్‌లతోపాటు కాంగ్రెస్ ఎంపి ప్రదీప్ భట్టాచార్య, టిఎంసి అస్సాం నాయకులు సుస్మితాదేవ్, డార్జిలింగ్ నేత శాంతా చెత్రి పదవీకాలం కూడా ముగియ నున్నది. మాజీ గోవా సిఎం లుయిజినో ఫెలీరో టిఎంసి ఎంపీగా గత ఏప్రిల్‌లో రాజీనామా చేసిన తరువాత పశ్చిమబెంగాల్‌కు చెందిన ఏడో రాజ్యసభ స్థానం కూడా ఖాళీగానే ఉంది. ఆ స్థానానికి ఆరు రాజ్యసభ స్థానాలతోపాటు ఈనెల 24న ఎన్నిక జరుగుతుంది. ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం తమకు సంతోషంగా ఉందని టిఎంసి ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ అభ్యర్థులు ప్రజలకు సేవ చేయడం ద్వారా తమ అంకిత భావాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు టిఎంసి ప్రకటనలో పేర్కొంది. ప్రతి పౌరుడి హక్కుల పరిరక్షణకు తృణమూల్ పోరాట వారసత్వాన్ని వారు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నట్టు తెలియజేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News