వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే వారం రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవవచ్చని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. “ట్రంప్‌ను కలవాలనే కోరికను రష్యన్లు వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరినీ కలవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. జూన్ 2021లో మాజీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ జెనీవాలో పుతిన్‌ను కలిశారు. దీని తర్వాత మళ్లీ ఇప్పడు ట్రంప్, పుతిన్ తో భేటి కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే, వైట్ హౌస్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ ఇంకా స్పందించలేదు.
కాగా, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ట్రంప్.. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ముగించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు ట్రంప్, జెలెన్స్కీని కలిశారు, కానీ ఇంకా పుతిన్‌ను కలవలేదు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యన్ ఉత్పత్తులు, గ్యాస్, చమురు, ఆయుధాలను కొనుగోలు చేసినందుకు భారత్ తోపాటు పలు దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించాడు. భారత్ పై భారీగా సుంకాలను పెంచాడు. ఇంకా పెంచుతామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.