న్యూయార్క్: భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని మంగళవారం అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కారు. భారత్‌పై సుంకాలు పెంచబోతున్నట్లుగా సోమవారం తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
‘వాణిజ్యం విషయంలో భారత మంచి భాగస్వామికాదు. ఆ దేశం మాతో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తోంది.కానీ మేము ఆ స్థాయిలో చేయడం లేదు. కాబట్టి 25 శాతం సుంకాలు విధించాం. రానున్న 24 గంటల్లో దీన్ని మరింతగా పెంచబోతున్నాం. ఎందుకంటే వారు రష్యానుంచి చమురును కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారు. వారు అలా చేస్తూ ఉంటే నేను సంతోషంగా ఉండను’ అని ట్రంప్ అన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం గురించి అడగ్గా, ‘వారు అత్యధిక టారిఫ్‌లనుంచి జీరో టారిఫ్‌లు ఇస్తామని అంటున్నారు. అయితే అది చాలదు. ఎందుకంటే వారు చమురుతో వ్యాపారం చేస్తున్నారు’ అని అమెరికా అధ్యక్షుడు అన్నారు.