Thursday, May 2, 2024

శ్రీశైలం వెళ్లే భక్తులకు టిఎస్ ఆర్‌టిసి టూర్ ప్యాకేజీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ ఆర్‌టిసి ) ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జెబిఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570 గా టిఎస్ ఆర్‌టిసి యాజమాన్యం ఖరారు చేసింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జెబిఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజిబిఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది.

మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఉంటుంది. రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్‌అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార.. పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజిబిఎస్‌కు, 8.30 గంటలకు జెబిఎస్‌కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చారు.

ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని ఆర్‌టిసి వెల్లడించింది.ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు కనుక హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టిఎస్ ఆర్‌టిసి నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలని కోరింది. మరిన్ని వివరాల కోసం టిఎస్ ఆర్‌టిసి అధికారిక వెబ్‌సైట్ టిఎస్ ఆర్‌టిసి ఆన్‌లైన్ డాట్ ఇన్ ( tsrtconline.in ) లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలని తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టిఎస్ ఆర్‌టిసి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , సంస్థ ఎండి విసి సజ్జనర్‌లు
బుధవారం నాడొక ప్రకటనలో సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News