వాషింగ్టన్: వలసదారులపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్న అమెరికా తాజాగా వీసా ఆశావహుల నెత్తిపై మరో బాంబు పేల్చడానికి సిద్ధమయింది. బిజినెస్, టూరిస్టు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు 15 వేల డాలర్లదాకా బాండ్ చెల్లించాలని ఆ దేశం ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం(స్థానిక కాలమానం ప్రకారం)ఫెడరల్ రిజిస్ట్రీలో నోటీసులు పబ్లిష్ చేయనుంది.12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధనను తీసుకు రానున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బీ1( బిజెనెస్), బీ2(టూరిస్టు) వీసాలపై ఈ నిబంధనను తీసుకు రానున్నారు.ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారిక నోటీసు పెట్టిన 15 రోజుల్లో ఈ పైలట్ పథకం అమలుకానుంది. దీనిప్రకారం బిజినెస్, పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5వేలు, 10 వేలు,లేదా 15 వేలడాలర్లదాకా సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసాకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఒక వేళ సదరు వీసాదారుడు నిబంధనలు సక్రమంగా పాటించి, గడువు పూర్తయిన తర్వాత దేశం వీడి వెళ్లే సమయంలో ఈ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా నడుచుకున్నా, గడువు ముగిశాక కూడా అమెరికాలో ఉండడం లాంటివి చేస్తే ఎలాంటి రీఫండ్ దక్కదు. అయితే ఈ బాండ్ నిబంధన అన్ని దేశాలకు వర్తించదట! షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. 90 రోజుల బిజినెస్, పర్యాటక ప్రాణాల కోసం తీసుకొచ్చిన వీసా వేవర్ పథకం కింద ఉన్న దేశాలకు ఈ బాండ్ వర్తించబోదని సంబంధిత అధికారులు చెప్పారు.ఈ పథకం కింద 42 దేశాలున్నాయి.అందులో మెజారిటీ ఐరోపా దేశాలు కాగా కొన్ని ఆసియా, మధ్యప్రాచ్యంనుంచి కూడా ఉన్నాయి. వీసా గడువు తీరినా కొంతమంది దేశం వీడి వెళ్లడం లేదని, అందుకోసమే ఈ నిబంధనను తీసుకువచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. గతంలో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఈ తరహా పైలట్ ప్రాజెక్టును తీసుకువచ్చారు. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు.