Sunday, April 28, 2024

అమెరికా అతిక్రమణ!

- Advertisement -
- Advertisement -

US warship stirs the waters ‘without Indian consent’

 

పామును ముద్దాడినా కాటేయడం మానదు, అమెరికా కూడా అంతే. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనకు మన ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఎన్ని మైత్రీ సన్నివేశాలు విరగబూసి పరిమళించాయో కళ్లారా చూశాము. మనం మన అలీన విధానాన్ని కట్టగట్టి అవతల పారేసి అమెరికాతో ఎంతగా చెట్టపట్టాలు వేసుకున్నామో తెలిసిందే. అమెరికా అభ్యంతరం చెప్పడంతో మనకెంతో ప్రయోజనకరమైన ఇరానీ చమురు దిగుమతులను విశేషంగా తగ్గించుకున్నాం, ఆ మేరకు అమెరికా నుంచి మన చేతి చమురు వదిలించే ఆయిల్ దిగుమతులను భారీగా పెంచుకున్నాం. మన వేలు దాని నోట్లో పెట్టి దాని వేలితో మన కన్ను పొడిపించుకుంటున్నాం. అంత చేసినా మనతో తనకున్న స్వల్ప వాణిజ్య లోటును పూడ్చుకోడానికి అమెరికా డోనాల్డ్ ట్రంప్ హయాంలో మన సరకుల దిగుమతులకు అప్పటి వరకు గల సుంకాలు వర్తించని జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎస్‌పి) వ్యవస్థను రద్దు చేసింది.

మన ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై విశేషంగా సుంకాలు విధించింది. తన వ్యవసాయ సామగ్రి పై ఇండియా మితిమించిన సుంకాలు వసూలు చేస్తున్నదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. ఇలా ‘ఎక్కడైనా బావ గాని వంగ తోట వద్ద కాదు’ అనే సామెతను అమెరికా మన పట్ల రక్తికట్టిస్తున్నది. మాటల్లో తేనె కురిపిస్తూ ఆచరణలో తన పెత్తనాన్ని స్వప్రయోజనకాండను నిరాఘాటంగా సాగించుకుంటున్నది. ట్రంప్ దిగిపోయి జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత కూడా ఇండియా పట్ల ద్వంద్వ ప్రమాణాలను కొనసాగిస్తూనే ఉంది. బైడెన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అధినేతల ‘క్వాడ్’ శిఖరాగ్ర సభ ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది. చైనా విస్తరణ కాంక్షకు విరుగుడుగా ఈ నాలుగు దేశాలు ఏకమయ్యాయనే సూచనలు కూడా వెలువడ్డాయి.

అంతగా ఇండియాను ఇష్టపడుతున్నట్టు, అక్కున చేర్చుకున్నట్టు కనిపిస్తున్న అమెరికా ఇటీవల ఉన్నట్టుండి మన సాగర జల పరిధుల ఉల్లంఘనకు పాల్పడి అదంతే అంటూ కటువుగా సమాధానమిచ్చి చెంప చెళ్లుమనిపించినం త పని చేసింది. మన అనుమతి తీసుకొని మన జలాల్లో తన యుద్ధ నౌకను ప్రవేశపెట్టవలసి ఉండగా నీ ఇష్టానిష్టాలతో సంబంధం లేదని చెప్పింది. ఆ స్వేచ్ఛ తనకున్నదని వివరించింది. లక్ష ద్వీప్ దీవుల సమీపంలోని మన ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి సముద్ర జలాల్లోకి తన సప్తమ నౌకా దళానికి చెందిన యుఎస్‌ఎస్ జాన్ పాల్ జోన్స్ అనే నౌక ప్రవేశించిందని అమెరికాయే ప్రకటించింది. అంత వరకు ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. అప్పుడు గాని మన విదేశాంగ శాఖ అందుకు అభ్యంతరం తెలుపలేదు. లక్షద్వీప్ దీవులకు 130 సాగర మైళ్ల దూరంలో అమెరికా నౌక విన్యాసాలు చిత్తగించింది. 200 మైళ్ల దూరం వరకు సాగర జలాల్లో మన ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి విస్తరించుకొని ఉన్నది. అంతర్జాతీయ జల పరిధుల చట్టాల ప్రకారం భారత దేశం నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే యుద్ధ నౌకా విన్యాసాలను జరిపే స్వేచ్ఛ తనకున్నదని అమెరికా వివరించిన తీరు మన సాగర జల సార్వభౌమాధికారాన్ని గాయపరిచింది.

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చర్య వల్ల మనకు ప్రత్యక్షంగా నష్టమేమీ జరగలేదు గాని కొన్ని ప్రత్యేక నేపథ్యాల్లో దాని ఈ చర్య మన ప్రయోజనాలను దెబ్బ తీసే ప్రమాదం పొంచి ఉంది. ఐక్యరాజ్య సమితి సాగర జల నియమాల ప్రకారం ముందుగా చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా ఏ దేశంగాని ఇంకొక దేశ ఆర్థిక మండలి పరిధిలోని సాగర జలాల్లో సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రయోగాలు జరపకూడదు. మన చట్టం కూడా ఇదే చెబుతున్నది. ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో విశదం చేసినప్పటికీ అమెరికా తన వైఖరిని మార్చుకోలేదు. 1995లో అవతరించిన ఐక్యరాజ్య సమితి సాగర నియమాల పత్రం మీద ఇండియా, చైనాలు కూడా సంతకాలు చేశాయి. అమెరికా మాత్రం అందులో చేరలేదు. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అమెరికా సప్తమ నౌకా దళ నౌకల విన్యాసాలకు బీజింగ్‌ను నిలువరించే లక్షం ఉంది.

కాని మిత్రదేశమైన భారత్ పట్ల కూడా దానికి అటువంటి ఉద్దేశం ఉందని అనుకోవాలా? 1971లో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ తరపున అమెరికా సప్తమ దళ యుద్ధ నౌక ఈ విధంగానే మన సాగర జలాల్లోకి ప్రవేశించి మనను బెదిరించింది. అప్పుడు భారత్ సోవియట్ మైత్రీ ఒప్పందం కింద సోవియట్ రష్యా సహాయాన్ని మనం కోరగానే పసిఫిక్ సముద్రంలోని దాని నౌకా దళం హుటాహుటిన మనకు అండగా వచ్చి ఆదుకున్నది. అమెరికాపై విశ్వాసంతో గుండెల మీద చేయి వేసుకొని నిద్రించే పరిస్థితి మనకు లేదని ఈ ఘటన చాటుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News