మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘మా తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నేను మంత్రి పదవి ఇప్పించే స్థితిలో లేను..’ అని రాష్ట్ర రహదారులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బిసి రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులూ ఢిల్లీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో ముచ్చటించారు. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని అన్నారు.
మంత్రి పదవి ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన తెలిపారు. అధిష్టానం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాను సీనియర్ మంత్రిని అయినప్పటికీ అధిష్టానం నిర్ణయమే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పదవుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను మంత్రి పదవి ఇచ్చే స్థితిలో కానీ, ఇప్పించే స్థితిలో కానీ లేనని ఆయన తెలిపారు. అంతా అధిష్టానం, పార్టీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని ఆయన అన్నారు. మంత్రి పదవి విషయంలో తానే కాదు ఎవరూ జోక్యం చేసుకోలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.