Tuesday, May 7, 2024

పటేల్‌ది సమైక్యతా వాదం.. అమిత్ షాది విచ్ఛిన్నకర నాదం

- Advertisement -
- Advertisement -

Vinod kumar fires on Union Home Minister amit shah

బిజెపి నాయకుల తీరు దేశ సమగ్రతకు చేటు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్

హైదరాబాద్ : దేశానికి స్వాతంత్రం వచ్చి రోజుల్లో అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యతా వాదంతో ముందుకు సాగారని… కానీ ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం దేశ విచ్ఛిన్నకర నాదంతో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. మత విద్వేష బీజాలు నాటడం వంటి చర్యలను బిజెపి మానుకోవాలని ఆయన సూచించారు. ఆ పార్టీ నాయకుల వైఖరితో దేశ సమగ్రతకు చేటు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ విశాల దృక్పథం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. సంకుచిత భావంతో ఏమి సాధించలేరు అని, ఈ వాస్తవాన్ని గ్రహించి మెలగాలని వినోద్‌కుమార్ అన్నారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని దాదాపు 540 సంస్థానాలను భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి విలీనం చేశారని.. అందులో భాగంగానే హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత దేశంలో అంతర్భాగం చేశారని వినోద్‌కుమార్ గుర్తు చేశారు.

1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను గవర్నర్ ( రాజ్ ప్రముఖ్ )గా వల్లభాయ్ పటేల్ నియమించారని వినోద్‌కుమార్ తెలిపారు. వల్లభాయ్ పటేల్ విశాల దృక్పథం కలిగిన వ్యక్తి అని, బిజెపి నాయకుల వలె సంకుచిత భావం ప్రదర్శించలేదని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మేరకు మత విశ్వాసం కలిగి ఉండటం ప్రజల ప్రాథమిక హక్కు అని.. అయితే మత ఛాందస వాదం మాత్రం దేశానికి పెను ప్రమాదం అన్నారు. దేశంలో వివిధ మతాలు, సంస్కృతుల, జాతుల సమ్మేళనం అని, సర్వ మతాలకు భారత దేశం ఇలవేల్పు అని వినోద్‌కుమార్ వివరించారు. పశ్చిమ ఆసియాలోని కొన్ని దేశాలు మత ఛాందస వాదుల చేతిలోకి వెళ్లడంతో విధ్వంసకరమైన వాతావరణం నెలకొందని తెలిపారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలు కులాలు, మతాలు, రాజకీయ విద్వేషాలకు అతీతంగా జాతీయ సమైక్యతా భావంతో కలిసి ప్రగతి పథంలో పయనించాలని వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News