Tuesday, April 30, 2024

మళ్లీ మనమే వస్తాం….

- Advertisement -
- Advertisement -
  • పాలమూరు రంగారెడ్డి త్వరలో పూర్తి
  • పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్న కాంగ్రెస్
  • దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
  • తెలంగాణ హరితోత్సవంలో సియం కెసిఆర్

రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో మరోమారు మనమే అధికారంలోకి వస్తామని మిగిలి ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకుందామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితారెడ్డి, సిఎస్ శాంతికుమారిలతో కలిసి మహగని మొక్కను నాటారు.

అధికారులతో కలిసి అటవీ అభివృద్ధ్ది పనులను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలలో మనందరం పట్టుబట్టి జట్టుకటి బీడు బారిపోయిన తెలంగాణకు తొవ్వకు తెచ్చుకోవడం వలన తెలంగాణ పచ్చబడ్డదన్నారు. దేశంలో ధాన్యం ఉత్పత్తిలో 2014లో పదహేను, పదహరవ స్థానంలో ఉన్న మనం నేడు దేశంలోనే అగ్రస్థానంలో నిలబడటం సంతోషకరమన్నారు.

ఆస్తి, సంపదలు ఎంత ఉన్న పిల్లలకు ఆరోగ్యం బతికే పరిస్థితులుండాలన్నారు. తెలంగాణ రాకముందు ఇందిరాపార్క్‌లో అక్సిజన్ అమ్ముతామనే బోర్డులు ఉండేవని నేడు పచ్చని తెలంగాణలో ఆ అవసరం లేదన్నారు. దేశంలో పుషల్కంగా అడవులు, నీరు ఉన్న వాటిని నాశనం చేసి బీడు వారిన ప్రాంతంగా తయారు చేశారని ఆవేదవ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమపై జోకులు వేశారని, హేళన చేశారని కాని పట్టుబట్టి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఫలాలు నేడు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణలో ఈ రోజు 7.7 శాతం పచ్చదనం పెరిగిందని ఇదేదో మాటలు చెప్తే పెరగలేదని అందరి సమిష్టి కృషి ఉందన్నారు. మొక్కలు నాటడంలో విశేషంగా కృషి చేసిన అటవీ శాఖ అధికారులతో పాటు గ్రామ సర్పంచ్‌లను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.

పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటే పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావల్సి ఉన్న కాంగ్రెస్ పుణ్యాత్ములు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చి ప్రాజెక్టు పనులు ఆగేటట్టు చేశారని మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా పనులు ఆపమని ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి చేశామని త్వరలో పూర్తి చేసి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు నీళ్లే తెచ్చే బాధ్యత నాది అని అన్నారు. సబితారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి ఎప్పుడు కనిపించిన పాలమూరు ప్రాజెక్టు గురించి నాతో పంచాయతీ పెట్టుకుంటారని అన్నారు. రాబోవు మూడు నెలల్లో మార్పు చూడబోతున్నారని పేర్కొన్నారు.

కృష్ణానదిలో నీళ్ల వాటాల పంచాయతీ ఉన్న గోదావరిలో ఎలాంటి పంచాయతీ లేదని మల్లన్నసాగర్ నుంచి గండిపేట్, హిమాయత్‌సాగర్‌కు నీరు తరలించనున్నట్లు తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఘట్‌కేసర్ మీదుగా మూసి నదిని దాటిస్తే లోయపల్లి వరకు గోదావరి నీరు తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని త్వరలో మీ ప్రాంతానికి నీళ్లు వస్తాయన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం ఫలాలు నేడు తుమ్మలూర్ ఫారెస్టులో తిరుగుతుంటే కనిపించాయని సర్పంచ్‌లకు కీర్తి దక్కుతుందని మీరు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కావలసిన ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు.

హరితహరంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని ఆటవీ శాఖ అధికారులతో పాటు ప్రత్యేకంగా తనతో సమన్వయం చేస్తున్న కార్యదర్శులు భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్‌లను అభినందించారు. పచ్చదనం పెంపొందించడంలో చైనా 500 కోట్ల మొక్కలను నాటగా, బ్రెజిల్ 300 కోట్ల మొక్కలను నాటిందని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 276 కోట్ల మొక్కలను నాటి చాలా అడ్వాన్స్‌గా ఉన్నామన్నారు. ప్రతి పల్లెలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు వాటిలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. 170 అర్బన్ పార్కులను గొప్పగా తీర్చిదిద్దుకున్నామని మరిన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ యేడు హరితహారంలో పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణి చేయడానికి రూ.100 కోట్లు కేటాయించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించినవాడు… మీకు వ్యవసాయం చేయడం…అన్నం తినడం నేర్పినమని చెప్పినోడు నేడు ఏడో స్థానానికి పడిపోయాడని మండిపడ్డారు. ఆర్థిక పరపతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండటంతో పాటు తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు సరఫరా, వంద శాతం ఓడిఎఫ్ వంటి అన్నింటిలో మనమే నెంబర్ వన్‌గా ఉన్నామని అన్నారు.

కోరిన కోరికలతో పాటు అదనంగా నిధుల వరద

మా అడబిడ్డగా మంత్రి సబితారెడ్డి కోరిక మేరకు మహేశ్వరంకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నానని తెలిపారు. తుమ్మలూర్‌కు సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నామన్నారు. శంషాబాద్ నుంచి మహేశ్వరం, కందుకూర్ వరకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎల్.బి.నగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న మెట్రో బిహెచ్‌ఇఎల్ వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. తుమ్మలూర్‌లో కమ్యూనిటీ హల్‌కు కోటి రూపాయలు, 65 గ్రామ పంచాయతీలకు పంచాయతీకి రూ.15 లక్షల ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. తుక్కుగూడ, జల్ పల్లి మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున, బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లను ప్రకటించారు.

ప్రాణాలు కోల్పోయిన ఫారెస్టు అధికారి శ్రీనివాస్‌రావు సతీమణికి డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకపత్రం అందచేశారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రసంగించారు. చెవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్‌కుమార్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎగ్గె మల్లేషం, జిల్లా ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఆటవీ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పిసిసిఎఫ్ డోబ్రియాల్, రాచకొండ కమీషనర్ చౌహన్ తుమ్మలూర్ సర్పంచ్ సురేఖ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News