Sunday, April 28, 2024

పంట పొలాలను కాపాడుకుందాం

- Advertisement -
- Advertisement -

భారత దేశం వ్యవసాయక దేశం. 63 శాతం మంది ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రపంచంలో పండే అన్ని పంటలు కూడా భారతదేశంలో పండే సహజమైన భూమి, పండించే రైతులు, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక లక్ష హెక్టార్ల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారుతుంది. అది ముఖ్యంగా అభివృద్ధి పేరుతో రింగ్ రోడ్ల నిర్మాణం, పారిశ్రామికీకరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎవ్వరు అభివృద్ధికి వ్యతిరేకులు కాదు. భారత దేశం ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానంలో ఉంది. ఈ జనాభా కు ఆహారాన్ని అందించాలి. కాబట్టి వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మారిస్తే ఆహార భద్రతకే ప్రమాదం!

10 సంవత్సరాల క్రితం తెలంగాణలో పట్టణాల నుండి గ్రామాలకు వెళుతుంటే ఎక్కడచూసినా రోడ్డుకు రెండు వైపులా పచ్చటి పంట పొలాలతో కళకళలాడే పల్లె సీమలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పచ్చటి పంట పొలాలు వెంచర్లుగా మారి తెల్లారేసరికి ఆకర్షణీయమైన ఆర్చీలు, రోడ్లు, చుట్టూ గోడలు, ఫ్లెక్సీలు, అందమైన చెట్లు, టివి, పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్లు, అందమైన బ్రోచర్లు, గేట్లు, గేట్ల ముందు మన భాష రాని వాచ్‌మెన్లు. అంతేకాకుండా అద్భుతమైన పథకాల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కొనుగోలుదారులు కూడా భవిష్యత్తులో దానిని పెట్టుబడిగా భావించి ఈ ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేసి ఆ భూములను బీడు భూములుగా మారుస్తున్నారు.

ఒకప్పుడు నగరాలకు, పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఐదు, ఆరు సంవత్సరాలుగా చిన్న చిన్న గ్రామాలకు విస్తరించి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఇల్లు జాగా కూడా పేదవారికి అందని ద్రాక్షానే? ఇట్లా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి దేశానికి ఆహార సమస్య వచ్చే పరిస్థితి దగ్గరలోనే ఉంది. మన రాష్ట్రంలో దాదాపు ఒక కోటి 67 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉండగా, గత పది సంవత్సరాలలో సుమారు 12 లక్షల ఎకరాల భూమి వ్యవసాయేతర భూమిగా మారిందంటే ఎంత వేగంగా వ్యవసాయ భూమి తగ్గుతూ వస్తుందో అర్థం చేసుకోవచ్చు! తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత గ్రామాలలో భూస్వాముల కబంధహస్తాల నుండి భూములు విముక్తి చెంది అప్పటి వరకు భూమిలేని పేదలు చిన్న, సన్నకారు రైతులుగా అవతరించి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నయా భూస్వామ్య విధానం అమలవుతుంది. ‘వ్యవసాయం చేసే వారికి భూమి ఉండటం లేదు. భూమి ఉన్న వారు వ్యవసాయం చేయడం లేదు’.

1948 కంటే ముందు ఆయా గ్రామాల్లో ఉండే భూములు ఏ భూస్వామిదో తెలిసేది, ఆ భూములన్నీ ఆ గ్రామస్థులే కౌలుకు లేదా పాలుకు చేసుకుంటూ ఆ రైతులు, రైతు కూలీలు పశువులను, గొర్లు, మేకలను మేపుకుంటూ, కాయలు, పండ్లు కట్టేలతో వాళ్ళ అవసరాలు తీర్చుకొని బతికేవారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాలలో ఉండి బాగా డబ్బులు సంపాదించినవారు ఇప్పుడు వ్యవసాయ భూమి సామాజిక హోదాగా భావించి నయా భూస్వాములుగా అవతరించి వెంచర్లు, ఫామ్ హౌస్‌ల పేర్లతో లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలుకొని చుట్టూ గోడలు పెట్టి, అందులో చిన్న ఇల్లు కట్టి గేటుకు తాళం వేసి ఆ భూమిని బీడు భూమిగా ఉంచి ఆ పట్టేదారు ఎవరో కూడా ఆ గ్రామస్థులకు తెలియదు. సెలవు రోజులలో ఆ పట్టేదార్లు భార్య పిల్లలతో లేదా స్నేహితులతో వచ్చి జలసాలు చేసి పోతుంటారు. గతంలో కేవలం గడీలకు మాత్రమే గోడలు ఉండేవి? ఇప్పుడు పచ్చటి పంట పొలాల చుట్టూ గోడలు దేనికి సంకేతమో? ఇప్పుడు ఒక సామాన్య రైతు తన పొలం దగ్గరికి వెళ్లాలంటే ఆ గోడల చుట్టూ తిరిగి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో తన పొలం దగ్గరికి పోయే పరిస్థితి ఆ గోడలు సృష్టిస్తున్నాయి. దొరల ఇండ్ల చుట్టూ ఉండే గోడలను గడీలు అనే వారం.

ఇప్పుడు పంట పొలాల చుట్టూ ఉండే గోడలను ఏమని పిలవాలి?
ఇప్పుడు తెలంగాణ రైతులు కోటీశ్వరులు అంటున్నారు. రాష్ట్రంలో ‘భూమిని అమ్ముకుంటే కోటీశ్వర్లు, అదే భూమిని నమ్ముకుంటే ఆత్మహత్యలు’? రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఒక ఎకరా భూమి ధర సుమారు 20 లక్షల నుంచి రెండు కోట్లకు పైగా ధర పలుకుతుంది. ఇది ఒకరకంగా భూమి ఉన్న రైతులకు భూమి విలువ పెరగడంతో సామాజిక హోదా, మానసికస్థైర్యం ఆ కుటుంబానికి వస్తుంది. కానీ మన రాష్ట్రంలో సుమారు 86% చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. కొంత మంది రైతులు భూములను అమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, వ్యవసాయంలో వచ్చిన నష్టాలు అనేక కారణాల వల్ల భూములు అమ్మడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు వ్యవసాయ భూములు అమ్ముకోవడం తప్ప మళ్ళీ భూములను కొనే స్థితిలో రైతులు లేరు. భూముల రేట్లు ఆకాశాన్ని అంటడం చాలా దుష్పరిణామం. గతంలో గ్రామాలలో వ్యవసాయ భూమి అమ్మితే ఆ గ్రామస్థులు మాత్రమే ఆ భూమిని కొనేవారు, ఆ కొన్న భూములకు రూపాయలు వాయిదాల పద్ధతిలో పంటల మీద రెండు, మూడు సంవత్సరాలు వరకు కట్టేవారు. ధరలు పెరగడంతో ఆగ్రామ భూములు ఆ గ్రామస్థులు కొనే స్థితిలో లేరు. ఏ ధరలైన సామాన్యులకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు భూములు అమ్ముకుంటే 45 రోజులలో మొత్తం డబ్బులు కట్టేసి కనీసం గ్రామస్థుల సాక్షి సంతకాలు లేకుండా రిజిస్ట్రేషన్, పట్టాలు చేయించుకుంటున్నారు. ఇట్లా కొన్న లక్షల ఎకరాల భూములు బీడు భూములుగా మారుతున్నాయి. దీనితో ఆహార సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని దొరకక నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది.

యువత తప్పు తోవ పట్టే పరిస్థితి ఉంది. వ్యవసాయ భూములు ప్లాట్లుగా మార్చి అమ్మిన నాలా కన్వర్షన్ చేయించడం లేదు ఎందుకంటే ఆ భూములు వ్యవసాయ భూములుగా ఉంటే ఆ పట్టేదారులకు రైతు బంధు, 5 లక్షల రూపాయల రైతు బీమా వస్తుంది. వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మార్చడానికి ప్రభుత్వాలు నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్లు వ్యవసాయ భూములను లేఔట్లుగా మారకుండా అవసరమైన మేరకే అనుమతులు ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ‘వెంచర్లలో ఇండ్లు కట్టుకోరు, ఫామ్ హౌస్‌లలో పంటలు పండించరు’. కేవలం పెట్టుబడిగా భావించే వాటిని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. వ్యవసాయ భూములను రక్షించాలి, ఆ గ్రామాల భూములు ఆ గ్రామస్థులే కొనుగోలు చేసే విధంగా ధరలు అందుబాటులో ఉండాలి, కొన్న ప్రతి గుంటలో పంటలు పండించే నిబంధన పెట్టాలి.

పులి రాజు
9908383567

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News