Monday, April 29, 2024

మూడు జిల్లాల్లో ముచ్చటగా మూడు జ్యూట్ పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

Jute industries in three districts in telangana

వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు
గ్లోస్తెర్, కాళేశ్వరం ఆగ్రో, ఎంబిజి కమోడిటీస్
లిమిటెడ్ కంపెనీలతో ఎంఒయులు మొత్తం
రూ.887కోట్ల పెట్టుబడి గన్నీ బ్యాగుల
ఉత్పత్తిలో రాష్ట్రానికి కలగనున్న స్వయం సమృద్ధి
ఉత్పత్తులను 20ఏళ్ల పాటు ప్రభుత్వమే
కొనుగోలు చేయడానికి అంగీకారం
ఇప్పటివరకు రాష్ట్రంలో ఇలాంటి మిల్లులు లేవు
వీటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది జ్యూట్
పరిశ్రమలకు రవాణా రాయితీలు కూడా ఇస్తాం
రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు పెద్ద ఎత్తున
డిమాండ్ ఈ పరిశ్రమలతో ఆ కొరత తీరనుంది
నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో
కూడా జ్యూట్ పరిశ్రమలు నెలకొల్పుతాం : మంత్రి కెటిఆర్ ఇప్పుడు దేశం తెలంగాణను
అనుసరిస్తుంది : మంత్రి నిరంజన్‌రెడ్డి
సిఎం కెసిఆర్ విధానాల వల్ల రాష్ట్రానికి
పరిశ్రమలు అమితంగా తరలివస్తున్నాయి : మంత్రి గంగుల కమలాకర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మూడు జ్యూట్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మూడు కంపెనీలు కలిసి మొత్తంగా రూ. 887 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు రాష్ట్రం లో 10,400 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఈ కంపెనీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఇక గన్నీ బ్యాగుల కొరత తీరిపోనుంది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలపై ఆదారపడ్డ తెలంగాణకు ఇక సొంతంగానే గన్నీ బ్యాగులను సమకూర్చుకోనుంది. శుక్రవారం నాడిక్కడ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ల సమక్షంలో మూడు కంపెనీలైన గ్లోస్తెర్ లిమిటెడ్, కాలేశ్వరం అగ్రో లిమిటెడ్, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్‌లు రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయు (అవగాహన ఒప్పందం)చేసుకున్నాయి.

ఇందులో గ్లోస్తెర్ కంపెనీ రూ. 330 కోట్లు, కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ రూ. 254 కోట్లు, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్ రూ.303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. ఈ మూడు జూట్ మిల్లులు వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. ఎంఒయు కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జ్యూట్ మిల్లులను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇలాంటి మిల్లులు లేవన్నారు. ఈ నేపథ్యంలో జ్యూట్ మిల్లులను ప్రొత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన వెల్లడించారు. జూట్ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
20 యేళ్ళ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

గన్నీ ఉత్పత్తులను 20 ఏళ్ల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఇందులో మొదటి ఏడేళ్లు రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం గన్నీబ్యాగులను కొనుగోలు చేస్తుందన్నారు. తరువాత ఐదు సంవత్సరాల్లో 75 శాతం, ఆ తరువాత ఎనిమిది సంవత్సరాల్లో 50 శాతం చొప్పున గన్నీ బ్యాగులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలిపారు. అలాగే ఐదేళ్ల పాటు జూట్ పరిశ్రమలకు రవాణా రాయితీలు కూడా అందజేస్తామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ గన్నీ బ్యాగులకు పెద్దఎత్తున డిమాండ్ నెలకొని ఉందన్నారు. రానున్న రోజుల్లో జనపనార పరిశ్రమలకు సంబంధించిన పంటను రాష్ట్రంలోనే పండించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో జౌళి రంగంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

దీని కోసం పెద్దఎత్తున ప్రొత్సాహకాలను కూడా ఇవ్వనున్నామన్నారు. నూతనంగా నెలకొల్పబోయే ఈ జూట్ పరిశ్రమల ద్వారా ఖరీఫ్, రబీ కాలాల్లో రాష్ట్రానికి అవసరమయ్యే గన్నీ బ్యాగుల కొరత తీరనుందన్నారు.. రాష్ట్రంలో జనుము పండించేలా రైతులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలు కేవలం వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లోనే కాకుండా నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.. తమ ప్రతిపాదనలతో ఔత్సాహికులు ముందుకొస్తే తప్పకుండా జూట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ జూట్ ఉత్పత్తులతో ప్లాస్టిక్ మహమ్మారిని కూడా తరిమికొట్టొచ్చునని అన్నారు. జూట్ ఉత్పత్తులతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ జ్యూట్ మిల్లుల పరిశ్రమలకు అవసరమైన జనప నార పంట పండించడం ద్వారా రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రానికి పెట్టుబడులు ఉద్యోగాలతో పాటు రైతులకు మరింత లాభం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ రంగంలో మరిన్ని యూనిట్లు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి పరిశ్రమల శాఖ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో జ్యూట్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నది. ఈ అవగాహన ఒప్పందాల మేరకు సాధ్యమైనంత త్వరగా కంపెనీలను ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కోరారు.

తెలంగాణను దేశం అనుసరిస్తోంది

గతంలో బెంగాల్ ను దేశం అనుసరించేదిని.. ప్రస్తుతం తెలంగాణను దేశం అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతమైన విధానాలతో ముందుకు పోతున్నదన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారుతున్నదన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా అవసరమైన జ్యూట్ మిల్లుల ఏర్పాటుపై సిఎం ప్రత్యేక దృషి సారించారన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకు అవసరమైన జనపనారా పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామన్నారు. నాయకులు అంటే నాయకత్వం వహించడమే కాదు దార్శనికత ఉండాలన్నారు.

ఇందులో సిఎం కెసిఆర్ అగ్రస్థానంలో ఉన్నారన్నారు. దీని కారణంగానే ఏడేళ్ళలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడులకు, పరిశ్రమలకు అత్యంత అనుకూలంగా మార్చారన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. పంట మార్పిడులను రాష్ట్రంలో ప్రణాళికాబద్దంగా చేపట్టడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో పంటల దిగుబడి భారీగా వచ్చిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గోనె సంచులకు తీవ్ర ఇబ్బందులు కలిగిందన్నారు. ఆ సమయంలో ఆలోచించి సిఎం కెసిఆర్ రాష్ట్రంలో జ్యూట్ మిల్లుల ఏర్పాటుకు మంత్రి కెటిఆర్‌ను ఆదేశించారన్నారు. అది కార్యరూపం దాల్చి నేడు పరస్పర ఒప్పందాలు చేసుకోవడం సంతోష దాయకంగా నిలిచిందన్నారు. సమకాలీన రాజకీయ నాయకులలో అత్యంత దూరదృష్టి, దక్షత కలిగిన యువ నాయకుడు కెటిఆర్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌళిక సదుపాయాలు వినియోగించుకుని ఐటి, పరిశ్రమల అభివృద్దికి ఆయన విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

పెట్టుబడుల వెల్లువ : గంగుల

సిఎం కెసిఆర్ విధానాలు, సుభిక్ష పాలన, శాంతి భద్రతలు, 24 గంటల కరెంటు, మౌలిక సదుపాయాలతో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా తరలివస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటల దిగుబడి ఇబ్బడి, ముబ్బడిగా పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం 3.2కోట్ల కొత్త గన్నీ బ్యాగుల అవసరం నుండి 2021..20-22లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం 50 కోట్ల గన్నీ బ్యాగ్‌ల వరకూ పెరుగుతూ వచ్చిందన్నారు. ప్రతి పంట సీజన్‌లో దాదాపు 20కోట్లకు పైగా గన్నీబ్యాగుల అవసరముందన్నారు. ఈ సంవత్సరం దాదాపు 35.25 కోట్ల నూతన గన్నీలుగా అవసరం కానుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News