రోడ్డు ప్రమాదం ఓ మహిళ కిడ్నాప్ కేసును బట్టబయలు చేసింది. ఆమెను అపహరించి కారులో తీసుకెళ్తుండగా మరో కారును ఢీకొట్టారు. కేసు వివరాలను శంషాబాద్ రూరల్ పీఎస్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం… చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన కొండకల్ల పద్మజ, బుచ్చయ్య దంపతులు అదే ఊరికి చెందిన కమ్మెట విజయ్ గౌడ్ కు రూ.4 లక్షలుఅప్పుగా ఇచ్చారు. డబ్బు తిరిగి ఇచ్చే సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో విజయ్‌గౌడ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. పద్మజ భర్త బుచ్చయ్య మానసికంగా అస్వస్థతకు గురయ్యాడు. అతను ఒక వారం నుంచి శంషాబాద్ మండలం మల్కారం గ్రామ పరిధిలోని ఆశాజ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 5 వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ఆమె తన భర్తకు బట్టలు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె ఆసుపత్రి నుండి బయటకు వచ్చి తన భర్తకు పండ్లు తీసుకు రావడానికి వెళ్ళగా ఆ సమయంలో కమ్మెట విజయ్ గౌడ్ వెంటనే వెంకటేష్,
సాయితో కలిసి ఎర్టిగా కారులో ఆ ఆసుపత్రి గేటు వద్దకు వచ్చి ఆమెను బలవంతంగా కారులోకి లాక్కెళ్లారు. విజయ్ గౌడ్ కారు నడుపుతున్నాడు. దారిలో ఆమె కారు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారంతా ఆమెపై దాడి చేశారు. చంపేస్తామని బెదిరించారు. కారులో ఉన్న వ్యక్తులు ఆమెను చేతులతో కొట్టి, తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. ఆమె కారు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్వాల్‌గూడ సమీపంలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద ముందు వైపు వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఫలితంగా పద్మజ తలపై, శరీరంలోని ఇతర భాగాలపై గాయాలయ్యాయి. వెంటనే ఎయిర్ పోర్ట్ పోలీసు సిబ్బంది వారిని మెరుగైన చికిత్స కోసం శంషాబాద్‌లోని అర్కాన్ ఆసుపత్రికి తరలించారు. పైన పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి వెంబడించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.