Friday, May 3, 2024

శ్రీలంక ఘన విజయం.. మళ్లీ ఓడిన ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మరో ఓటమిని చవిచూసింది. గురువారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌కు ఈ టోర్నీలో ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఇక శ్రీలంక రెండో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కుశాల్ పెరీరా 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కొద్ది సేపటికే వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కుశాల్ మెండిస్ (12) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో లంక 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ విల్లేకు ఈ వికెట్లు దక్కాయి. అయితే తర్వాత వచ్చిన సదిర సమరవిక్రమతో కలిసి మరో ఓపెనర్ పథుమ్ నిసాంకా జట్టును గెలుపు పథంలో నడిపించారు.

ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో మరో వికెట్ కోల్పోకుండానే లంకకు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నిసాంకా 83 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 77 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా బ్యాటింగ్ చేసిన సమరవిక్రమ 54 బంతుల్లోనే ఏడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 137 పరుగులు జోడించారు. నిసాంకా, సమరవిక్రమలు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో లంక మరో 24.2 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.

శుభారంభం లభించినా..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ శుభారంభం అందించారు. మలన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బెయిర్‌స్టో కూడా ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు దూకుడు మీద ఉండడంతో ఇంగ్లండ్‌కు మెరుగైన ఆరంభమే లభించింది.

అయితే 6 ఫోర్లతో 28 పరుగులు చేసి జోరుమీదున్న మలన్‌ను మాథ్యూస్ వెనక్కి పంపాడు. దీంతో 45 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్ (3) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే బెయిర్‌స్టో (30) కూడా ఔటయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ జోస్ బట్లర్ కూడా నిరాశ పరిచాడు. బట్లర్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. లివింగ్‌స్టోన్ (1) కూడా విఫలం కావడంతో ఇంగ్లండ్ 85 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బెన్‌స్టోక్స్ కొద్ది పోరాటం చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన స్టోక్స్ ఆరు ఫోర్లతో 43 పరుగులు సాధించాడు. మోయిన్ అలీ (15), విల్లే 14 (నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరును అందకున్నారు. మిగతా వారు విఫం కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 156 పరుగుల వద్దే ముగిసింది. లంక బౌలర్లలో లహిరు కుమార మూడు, మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు పడగొట్టారు. లహిరు కుమారకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News