Friday, May 3, 2024

వరుణిడిదే ‘పైచేయి’

- Advertisement -
- Advertisement -

WTC Final:Play abandoned due to rain on Day 4

నాలుగో రోజు ఆట రద్దు, డబ్యూటిసి ఫైనల్‌ను వీడని వర్షం

సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి వర్షం బెడద తప్పడం లేదు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తుది పోరుకు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పటికే వర్షం వల్ల తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. తాజాగా సోమవారం నాలుగో రోజు ఆట కూడా ఒక్క బంతి పడకుండానే రద్దు చేయక తప్పలేదు. ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో తొలి సెషన్ ప్రారంభం కాలేదు. కుండపోత వర్షం వల్ల మైదానం మొత్తం తడిసి ముద్దయ్యింది. అంపైర్లు, ఇరు జట్ల క్రికెటర్లు పెవిలియన్‌లోనే ఉండి పోవాల్సి వచ్చింది. భోజన విరామం తర్వాతనైన ఆట ప్రారంభమవుతుందనే ఆశతో అభిమానులు, క్రికెటర్లు ఉన్నారు. అయితే వారి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. రెండో సెషన్ సమయంలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో ఈ సెషన్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు.

ఇలాంటి స్థితిలో కనీసం మూడో సెషన్‌లోనైనా వరుణుడు కణికరిస్తాడని అందరూ ఆశించారు. అయినా అందరికీ మరోసారి నిరాశ తప్పలేదు. ఎడతెరిపి లేని వర్షం వల్ల చివరికి నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే రెండున్నర రోజుల పాటు ఆట రద్దు కావడంతో ఫైనల్ సమరంలో ఫలితం వస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. రిజర్వ్‌డే ఉన్నా ఫలితం వచ్చే పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికే నాలుగు రోజులు పూర్తయినా మొదటి ఇన్నింగ్స్ ఇంకా మిగిలేవుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే కివీస్ మరో 116 పరుగులు చేయాలి. ఇక ఇప్పటి వరకైతే న్యూజిలాండ్ పైచేయిలో ఉంది. ఒకవేళ మంగళవారం ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు రాణించి కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తేనే టీమిండియా గెలుపు అవకాశాలు సజీవంగా ఉంటాయి.

డ్రా దిశగా అడుగులు..

మొదటి రోజు నుంచే వరుణుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో డబ్లూటిసి ఫైనల్ సమరం చాలా చప్పగా సాగుతోంది. వర్షం దెబ్బకు శుక్రవారం తొలి రోజు ఆట సాధ్యం కాలేదు. భారీ వర్షం వల్ల ఆట మొత్తం రద్దు చేయక తప్పలేదు. శనివారం రెండో రోజూ కూడా వరుణుడు పలుసార్లు ఆటకు అంతరాయం కలిగించాడు. ఈసారి కూడా పూర్తి ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. ఇక ఆదివారం మూడో రోజు మాత్రమే కాస్త ఎక్కువ ఓవర్ల పాటు ఆట నడిచింది. కానీ మరో 20కి పైగా ఓవర్లు మిగిలివుండగానే వెలుతురు లేని కారణంగా మ్యాచ్‌ను నిలిపి వేయాల్సి వచ్చింది. తాజాగా సోమవారం నాలుగో రోజు కూడా వర్షం బెడద తప్పలేదు. ఈసారి వరుణుడి దెబ్బకు ఒక్క బంతి పడకుండానే పూర్తి రోజు ఆటను రద్దు చేయాల్సి ఉంది.

ఇక ఇప్పటికే నాలుగు రోజుల ఆట పూర్తి కావడం, తొలి ఇన్నింగ్స్‌లే పూర్తికానీ పరిస్థితులు నెలకొనడంతో ఫైనల్ పోరు డ్రా కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్‌లో ఫలితం వచ్చడం అసాధ్యంగా కనిపిస్తోంది. అయితే ఇరు జట్లలోనూ అగ్రశ్రేణి బౌలర్లు ఉండడంతో మ్యాచ్ ఫలితాన్ని ముందే ఊహించడం కష్టమవుతోంది. ఫైనల్‌కు రిజర్వ్‌డే కూడా ఉండడంతో మ్యాచ్‌లో ఫలితం తేలినా ఆశ్చర్యం లేదు. అయితే ఇది జరగాలంటే బౌలర్లు అసాధారణ రీతిలో రాణించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఒక వేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే భారత్‌న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతగా ప్రకటించి ట్రోఫీని బహూకరిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News