Thursday, May 2, 2024

సంపాదకీయం: నైపుణ్యాల కల్పన

- Advertisement -
- Advertisement -

Youth training in professions యువతకు నైపుణ్యాలు సమకూర్చడం, అందులో ఉత్తమ ప్రమాణాల శిక్షణ ఇవ్వడం దేశాభివృద్ధికి ఎంతటి కీలకమో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా చక్కగా వివరించారు. కరోనా సంక్షోభం దెబ్బకు త్వరత్వరగా మారిపోతున్న వ్యాపార, మార్కెట్ రంగాల అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యవంతులు కావాలి, తమకున్న నైపుణ్యాలను కాలానుగుణంగా మెరుగుపర్చుకోవాలని ఉద్బోధించారు. సైకిల్ తొక్క గలగడానికి, అది ఎలా నడుస్తుందో తెలుసుకోడానికి ఉన్న తేడాను విడమర్చి చెప్పా రు. సైకిల్ ఎలా నడుస్తుందో తెలుసుకోడం జ్ఞానమని, దానిని నడపగలగడం నైపుణ్యమని వివరించారు. ఆయన ప్రభుత్వం ప్రారంభించిన ‘స్కిల్ ఇండియా మిషన్’ ఐదవ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరిగింది. ఆధునిక భారత నిర్మాణావసరాల కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పేరును మానవ వనరుల అభివృద్ధి శాఖగా 1985 సెప్టెంబర్‌లో మార్చారు.

యువతకు నైపుణ్యాలను కల్పించి వివిధ ఆధునిక వృత్తులలో శిక్షణను ఇచ్చే కృషిని జాతీయ స్థాయిలో సమన్వయ పరచడానికి 2014 నవంబర్‌లో నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేంద్రంలో నెలకొల్పారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును గణనీయంగా పెంచడానికి వీలుగా వ్యవసాయాధార భారతాన్ని తయారీ రంగ దిగ్గజంగా మార్చి పారిశ్రామిక అభివృద్ధిలో పరుగులు తీయించడం లక్షంగా నిపుణ యువతను తీర్చి దిద్దుకోవాలని ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. పని వయసులోని యువత దేశంలో అత్యధికంగా ఉన్నారు. 13 35 సంవత్సరాల వారు జనాభాలో 40 శాతం ఉంటారని అంచనా. 15 ఏళ్లు , అంతకు మించిన వయసులోని భారతీయ యువతలో సగం మంది పని, పాటు లేకుండా ఉన్నారని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నివేదిక వెల్లడించింది. ఇందుకు కారణం వీరిలో చాలా మందికి ఆధునిక పారిశ్రామిక అవసరాలకు పనికి వచ్చే స్థాయి ఉన్నత ప్రమాణాల విద్య, వృత్తి నైపుణ్యాలు లేకపోడమే.

ఈ లోటును తొలగించాలంటే దేశమంతటా యువతకు భారీ ఎత్తున మేలి రకం వృత్తి శిక్షణ ఇవ్వాలి. ఇది అత్యంత నిష్ఠతో జరగాలి. అలా శిక్షణ పొందినవారిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగేలా పారిశ్రామికీకరణ జరగాలి. దేశ జనాభాలో 65 శాతం పనిచేసే వయసులో ఉన్నారని, ఈ అసాధారణ జన శక్తిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధనా మండలి సీనియర్ ఫెలో రాధికా కపూర్ చేసిన వ్యాఖ్య వాస్తవ స్థితికి అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రమాణాల విద్య, నైపుణ్యాల కల్పన ఎంత భారీ స్థాయిలో, మరెంత శీఘ్రతరంగా జరగాలో వివరించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే వైద్య పట్టభద్రులు, ఐటి నిపుణులైన మన యువత చాలా మంది మంచి భవిష్యత్తు కోసం విదేశాలకు తరలిపోతున్నారు. ఇక్కడ పరిశోధనా రంగానికి తగినంత చేయూత లభించకపోడం వల్ల శాస్త్రవేత్తలు బయటికి వెళ్లిపోతున్నారు. ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దేశ యువత గమనాన్ని విప్లవీకరించే విద్య, నైపుణ్యాల కల్పన, శాస్త్ర పరిశోధన రంగాలను బాగు పర్చుకోవాలి. స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా నెలకొన్న వందలాది ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల ద్వారా ఐటి, సేల్స్, వెబ్ వంటి రంగాలలో కూడా శిక్షణ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇక్కడ శిక్షణ పొందిన కొన్ని లక్షల మందికి కొలువులు లభించినట్టు సమాచారం.

ఈ యోచన, కార్యాచరణ మెచ్చుకోదగినవి. అయితే ఉద్యోగాలు, ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వామ్యం లేని అపారమైన యువ శక్తిని పూర్తిగా వినియోగించుకోగలగాలంటే అందుకు ఇది చాలదు. మన మహిళా శక్తిలో నాలుగో వంతు మాత్రమే ఉద్యోగులుగా, ఉద్యోగార్థులుగా ఉన్నారంటే లింగ అసమానత్వం దేశ ఆర్థిక రంగానికి ఎంతటి శాపంగా మారిందో తెలుస్తున్నది. 1950లలో భారత్‌తో పాటే వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న, మన కంటే అధిక జనాభా గల చైనా తన యువతను సాగు రంగం నుంచి తయారీ రంగంలోకి మార్చుకోడంలో త్వరగా విజయవంతమయింది. వారిని చవక శ్రమ శక్తిగా మలచి బహుళ జాతి సంస్థల పెట్టుబడులను విశేషంగా ఆకర్షించగలిగింది. ప్రపంచ వస్తూత్పత్తి కర్మాగారంగా మారగలిగింది. 1980ల నాటికి చైనా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో తయారీ రంగం వాటా 40.2 శాతానికి చేరుకోగా, భారత దేశంలో అది 16.2 శాతం వద్దనే ఉందని ఆరేళ్ల నాటి ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఒక్క దశాబ్ది కాలంలోనే చైనాలో వ్యవసాయేతర రంగంలో ఉద్యోగాల కల్పన గణనీయంగా పెరిగింది. ఇవి మనకు ఆదర్శవంతమైన పాఠాలు కావాలి. మన పురాణాలలో విలు విద్యకిచ్చిన ప్రాధాన్యం కృషి విద్యకు లభించలేదు. ఆధునిక భారతంలోనైనా నాణ్యమైన వస్తువులను తక్కువ ఖర్చుతో తయారు చేసి దేశదేశాల మార్కెట్లను ఆకట్టుకోగల విద్య, శిక్షణ అభివృద్ధి చెందాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News