Thursday, May 2, 2024

స్వరాష్ట్ర ఫలమిచ్చిన చెట్టు పుట్టినరోజు

- Advertisement -
- Advertisement -

కోటి వృక్షార్చన అద్భుతం

1 Crore saplings plantation on KCR's birthday

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమం జోరుగా సాగింది. పలువురు సెలిబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొని మరింత ఉత్సాహం నింపారు. తెలంగాణ శాసనసభ ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలను నాటారు. ఇందులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మండలి విప్ కుచికుళ్ళ దామోదర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చా ర్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్ తన భార్య శైలిమా, కూతురు అలేఖ్యతోతో కలిసి మొక్కలను నాటారు. అలాగే బొటానికల్ గార్డెన్‌లో మంత్రి ఇంద్రకర ణ్ రెడ్డి, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, గద్వాల సమీపంలోని వీరాపురంలో మొక్కను నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలూరి గౌరీశంకర్ గారు రచించిన ‘ఒక్కగానొక్కడు’ పుస్తకాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ లోని బూత్పూర్ రోడ్డు లో గల తన వ్యవసాయ క్షేత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. కూకట్ పల్లి లోని రెస్క్యూ హోమ్ లో మంత్రి సత్యవతి రాథోడ్, నల్గొండ జిల్లా మూసి పరివాహక ప్రాంతంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివ నగర్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తన నివాస ప్రాంగణంలో భర్త అనిల్ గారితో కలిసి మొక్కలు నాటారు. మలక్ పేటలోని తన కార్యాలయ ఆవరణలో ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దివ్యాoగులతో కలిసి కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డా .వాసుదేవరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలనా విభాగం కార్యాలయ ఆవరణలో ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మొక్కలు నాటారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్..12లోని ఎంఎల్‌ఎ కాలనీ, హుడా పార్కులో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు డి. నాగేందర్‌తో కలిసి జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మొక్కలు నాటారు.


హరితకానుకను ఇవ్వాలన్న తన సంకల్పం వంద శాతం నెరవేరిందని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నాగోల్‌లో శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, స్థానికులతో కలిసి మొక్కలు నాటడం ద్వారా కోటి వృక్షార్చనను ఎంపి లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోనూ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తలపెట్టిన కోటి వృక్షార్చన అద్భుతంగా జరిగిందని, పాల్గొన్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని తలపెట్టిన యజ్ఞం ఊహించిన దాని కన్నా విజయవంతం అయిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో స్వయంగా ముఖ్యమంత్రే తన పుట్టిన రోజు నాడు రుద్రాక్ష మొక్కనాటడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. తమకు అందుతున్న రిపోర్టుల ప్రకారం రాష్ట్రంతో పాటు, దేశ విదేశాల్లో సిఎం అభిమానులు కోటికి పైగా మొక్కలు నాటారని ఎంపి తెలిపారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న టిఆర్‌ఎస్ శ్రేణులు, మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. కోటి వృక్షార్చన విజయవంతంతో బాధ్యత మరింత పెరిగిందని, నాటిన ప్రతి మొక్కను వందశాతం బతికించాలన్నారు. రానున్న ఎండల నుంచి మొక్కలను అన్నింటినీ రక్షించుకోవాలని ఆయన కోరారు. నీటి లభ్యత ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఉన్న మొక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కోటి వృక్షార్చన కార్యక్రమం ప్రకటించిన నాటి నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను వెన్నతట్టి ప్రోత్సహించిన సినీతారలు, నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలందరిలో హరిత భావజాల వ్యాప్తిలో భాగమయ్యారని, హరిత తెలంగాణ సాధనలో వారి భాగస్వామ్యాన్ని నిరంతరం కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

చేతులు లేకున్నా మొక్కలు నాటిన వికలాంగుడు
కోటి వృక్షార్చనలో భాగంగా తనకు రెండు చేతులు లేకున్నా జాకీర్ పాషా అనే వికలాంగులు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఉన్న అభిమానంతో సిర్పూర్ కాగజ్ నగర్‌లో మొక్కలు నాటడానికి రెండు చేతులు కాళ్లతో మొక్కను నాటి నీళ్ళు పోసి అందరికి ఆదర్శంగా నిలిచారు. జాకీర్ పాషా యొక్క నిబద్ధతను చూసిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

ఉత్తరప్రదేశ్‌లో వృక్షార్చన
కోటి వృక్షార్చనలో భాగంగా జగ్ ప్రీత్ సింగ్ తన కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలోని, ఇంటోరి గ్రామంలో తన నివాసంలో మొక్కలు నాటి ఈ మహత్తర కార్యక్రమములో పాలు పంచుకున్నారు. ఇలా ఒక తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో పలు చోట్ల సిఎం కెసిఆర్‌పై అభిమానం తో , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చిన స్ఫూర్తి తో చాలా మంది భాగ స్వామ్యులు అయ్యారు.

1 Crore saplings plantation on KCR’s birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News