Wednesday, May 8, 2024

14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?

- Advertisement -
- Advertisement -

Quarantine

 

 

కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి?
లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు
26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు
ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు
క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్
ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ

తిరువనంతపురం : ఆ రోజు మార్చి 19. కోవిడ్ 19 సోకినవారి గురించి అప్పుడే దేశమంతటి నుంచీ వార్తలు వస్తున్నాయి. ఆ తరుణంలో ఓ వ్యక్తి దుబాయ్ నుంచి కేరళలోని కన్నూరుకు వచ్చారు. కరోనా వైరస్ లక్షణాలు ఏవీ లేకపోయినా 28 రోజులు ఇంట్లోనే ఉండి స్వయంగా ఐసోలేషన్ పాటించమని సలహా ఇచ్చారు. 26 రోజుల తర్వాత ఏప్రిల్ 14న అతనికి పరీక్షలు జరిపారు. అప్పటికీ వైరస్ లక్షణాలు కనిపించకున్నా విదేశం నుంచి వచ్చారు కనుక కేరళ ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకొని అతన్ని హై రిస్క్ కేటగిరీలో (అత్యంత ప్రమాదరకమైన స్థాయి) ఉంచింది. రెండు రోజుల తర్వాత అతనికి కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్టు కనుగొన్నారు.

మార్చి 20న మరో ఇద్దరు దుబాయ్ నుంచి రాగా వాళ్లిద్దరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయితే, మొదటి కేసు వల్ల కలిగిన అనుభవంతో ఏప్రిల్ 14న వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఏప్రిల్ 16న వచ్చిన ఫలితంలో… వారు తమతోపాటు కరోనా వైరస్ పాజిటివ్‌ను తెచ్చారని తేలింది. కన్నూరు జిల్లా మెడికల్ ఆఫీసర్ చెప్పిన వివరాల ప్రకారం… విదేశాల నుంచి వచ్చిన 248 మందిపై కరోనా వైరస్ పరీక్షలు జరపగా వారిలో 17 మందికి కోవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. ఈ 17 కేసుల్లో 95 శాతం మందిలో మొదట కరోనా లక్షణాలు కనిపించలేదు.

‘మేము కచ్చితంగా 28 రోజుల ఐసోలేషన్‌ను పాటిస్తున్నాం. వైరస్ లక్షణాలు కనిపించకున్నా హై రిస్క్ కేటగిరీకి చెందినవారికి పరీక్షలు జరుపుతున్నాం. వీరంతా క్రమబద్ధంగా, విధిగా కఠినమైన ఐసోలేషన్ పాటిస్తున్నారు కనుక ఆందోళన చెందాల్సిన పని లేదు’ అని వైద్యాధికారి కె. నారాయణ నాయక్ చెప్పారు.

కేరళలో కరోనా కేసుల కథనం దేశంలో మిగతా ప్రాంతాల పరిస్థితి కంటే కాస్త భిన్నంగా ఉంది. 14 రోజుల ఐసోలేషన్‌లో కోవిడ్ 19 లక్షణాలు కనిపిస్తే పరీక్షలు జరపాలన్న ప్రక్రియను అనుసరిస్తున్నారు. ‘చైనాలోని వుహాన్‌లో ఒక కేసులో 27వ రోజున వైరస్ లక్షణాలు కనిపించాయి. కనీసం ఐదు శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు వెలుగు చూసేందుకు 14 రోజుల కంటే ఎక్కువే (ఇన్‌కుబేషన్ పిరియడ్) పడుతుంది. కేరళలో 28 రోజుల ఐసోలేషన్‌ను పాటించడం వెనక దాగిఉన్న కారణం ఇదే’ అని డాక్టర్ మహమ్మద్ అషీల్ అన్నారు.

డాక్టర్ అషీల్ ప్రజారోగ్యరంగ నిపుణుడు. కేరళలో కోవిడ్ 19 కంటైన్‌మెంట్ చర్యల ముఖ్య బృందంలో సభ్యుడు. ‘కేరళలో కచ్చితంగా 26 రోజుల ఇన్‌కుబేషన్ పిరియడ్ ఉండాలని అనుకోనక్కర్లేదు. వ్యాధి లక్షణాలు కనిపించి, బయటపడే రోజులను బట్టి ఇన్‌కుబేషన్ పిరియడ్ ఉంటుంది. పైగా 60 శాతం కోవిడ్ 19 కేసుల్లో తక్కువ లక్షణాలే ఉంటాయి. ఏదేమైనా కేరళ కేసుల్లో ఇన్‌బేషన్ 14 రోజుల పైనే ఉంటోంది’ అని అషీల్ వివరించారు.

వివిధ పత్రికల్లో వచ్చిన అధ్యయనాల ప్రకారం చూస్తే 95 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు 0 14 రోజుల మధ్యలో కనిపిస్తాయి. (సగటున ఐదు రోజులు పడుతుంది). మిగతా ఐదు శాతం కేసుల్లో ఎక్కువ రోజులే పడుతుంది. ఇంకా చెప్పాలంటే 24 రోజుల తర్వాత లేదా నెల రోజులకు కానీ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ఈ ఐదు శాతం కేసులు సంఖ్యాపరంగా తక్కువే అయినా, వీటివల్ల తాజాగా వ్యాధి మరింత వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా ఉన్న కేసులు తీవ్రతరం కావచ్చు.

‘ఇందువల్ల నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే వ్యాధి లక్షణాలు కనిపించని వాళ్ల ద్వారా కూడా 14 రోజుల తర్వాత వైరస్ వ్యాపించవచ్చు. అయితే ఇది ఐదు శాతం కేసుల్లో మాత్రమే ఉండవచ్చు’ అని డాక్టర్ అషీల్ అన్నారు. దేశంలో మొదటి మూడు కరోనా కేసులు కేరళలోనే వెలుగుచూశాయి. ఇంతవరకూ రాష్ట్రంలో 395 కరోనా కేసులు నమోదైనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువ. కోవిడ్ 19 వల్ల కేరళలో ముగ్గురే మరణించారు. ఇలా ఉండగా మహారాష్ట్రలో 194 మంది, మధ్యప్రదేశ్‌లో 53, ఢిల్లీ, గుజరాత్‌లలో 30 మంది చొప్పున కరోనా సోకి మరణించారు. దీన్ని బట్టి చూస్తే కేరళ ఈ వైరస్‌ను ఎంతగా కట్టడి చేసిందో తెలుస్తోంది.

14 days Quarantine lot
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News