Monday, April 29, 2024

హడలెత్తిస్తున్న 4 జిల్లాలు

- Advertisement -
- Advertisement -

corona virus

 

హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్‌లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి

జిహెచ్‌ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు
సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు
నిజామాబాద్‌లో 58, వికారాబాద్‌లో 33 కరోనా పాజిటివ్‌లు
పొరుగు జిల్లాలకు వ్యాపించకుండా ప్రభుత్వం అప్రమత్తత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమానిత లక్షణాలు కూడా ఈ జిల్లాల్లో ఎక్కువగా వస్తుండటం, అసలు ఏ స్థాయిలో వైరస్ విస్తరించిందనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నెల 15వ తేదీ వరకు జిహెచ్‌ఎంసి పరిధిలో మరణాలు మినహాయించి 337 కేసులు నమోదు కాగా, అదే 17వ తేదీకి వచ్చేసరికి 417కు చేరాయి. అంటే రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక ఈ నెల 13వ తేదీ వరకు సూర్యాపేట జిల్లాలో 20 పాజిటివ్ కేసుల నుంచి శుక్రవారం నాటికి 44కు చేరింది. అంటే 24 కేసులు పెరిగాయి. నిజామాబాద్ జిల్లాలో 50 కేసులు నమోదు కాగా శుక్రవారం నాటికి 58కి చేరింది. వికారాబాద్‌లో 24 పాజిటివ్ కేసుల నుంచి 33కు చేరాయి.

మర్కజ్ లింక్ బయటపడిన తరువాత కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో ఇతర జిల్లాల్లోనూ మర్కజ్ బాధితులు ఉన్నప్పటికీ ఆ జిల్లాల్లో కేసుల తీవ్రత అంతగా లేదు. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు, వారి నుంచి సన్నిహితులకు, సెకంట్ కాంటాక్ట్‌కు కూడా వైరస్ సోకింది. వీరందరినీ ట్రెస్ చేసి క్వారంటైన్ చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే పాజిటివ్ వచ్చి, బంధువులకు, సన్నిహితులకు కాకుండా థర్డ్ పర్సన్‌ను తెలియకుండా కలవడంతో వైరస్ విస్తరించిందని అధికారులు భావిస్తున్నారు. లక్షణాలు బయటపడే వరకు వారి నుంచి ఇంకెంత మందికి సోకిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. అలాగే మర్కజ్ వెళ్లొచ్చిన వారు చాలామంది రాష్ట్రానికి 20వ తేదీ లోపే చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 22న జనతా కర్ఫూ, ఆ తరువాత 23 నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

అంతకంటే ముందే వాళ్ల ద్వారా వైరస్ వివిధ ప్రాంతాలలోని వ్యక్తులకు చేరిందా అనే అనుమానం ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా పాటించి ఎవరింట్లో వారే ఉండటం ద్వారా ఒకవేళ వారికి పాజిటివ్ ఉన్నా… ఇతరులకు సోకే ప్రమాదం ఉండదని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లోనే ఒక కుటుంబంలోనే ఒకరి ద్వారా 20 మందికి వైరస్ సోకిందంటే ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌కి తరలించారు.

దాదాపు 14 రోజుల వరకు వారిలో ఎవరికీ లక్షణాలు బయటపడకపోతే క్వారంటైన్ నుంచి విడుదల చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొందరిలో కేసులు బయటపడినప్పటికీ, వీరిద్వారా వైరస్ వ్యాప్తి అంతగా జరగలేదని కొవిడ్ 19 నివారణ, సలహాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు ఒకరు మన తెలంగాణతో వ్యాఖ్యానించారు. టెస్టులు పెంచడంతో పాటు, కంటైన్మెంట్ పటిష్టంగా అమలు చేయడం, లింక్‌ను బ్రేక్ చేయడం ద్వారానే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఆయన పేర్కొన్నారు.

Growing cases in those four districts
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News