Tuesday, April 30, 2024

భారీ ఎన్‌కౌంటర్‌

- Advertisement -
- Advertisement -

దట్టమైన అడవి ఒక్కసారిగా ఎరుపెక్కింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు సెగలు కక్కుతుంగా తూటాల ప్రవాహం సాగింది. బుల్లెట్లు శరీరాల్లోంచి దూసుకెళ్తుంటే అటవీ నేల రక్తసిక్తమైంది. లోక్‌సభ ఎన్నికల వేళ చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మంగళవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో 29మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో భద్రతా బలగాల్లోని ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు శంకర్ రావు, లలిత, రాజు ఉన్నట్లు సమాచారం. వీరిలో శంకర్ రావు తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. కాంకేర్ జిల్లాలోని చోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బినగుండాకరోనార్ గ్రామాల మధ్య ఉన్న హపటోలా అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం వరకు కాల్పుల మోత మోగింది.

ఎన్‌కౌంటర్ అనంతరం జరిపిన సోదాల్లో 29 మృతదేహాలతో పాటు పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఎకే 47 తుపాకులు, ఇన్సాస్ రైఫిళ్లు కూడా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ గార్డ్, బిఎస్‌ఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. క్షతగాత్రులైన సైనికులను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. బస్తర్ రేంజ్ ఐజిపి సుందర్ రాజ్ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. పెట్రోలింగ్ జరుపుతుండగా మావోయిస్టులు తారసపడ్డారని, ఈ క్రమంలో బలగాలకు, మావోయిస్టులకు నడుమ భీకర కాల్పులు చోటుసుకున్నాయని వివరించారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు. గాయాలైన ముగ్గురు జవాన్ల పరిస్థితి ఆందోళనకరంగా లేదని, వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు.

కొద్ది మాసాలుగా బస్తర్ ప్రాంతంలో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 79మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారని సుందర్ రాజ్ వివరించారు. ఏప్రిల్ 2న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ తర్వాత జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఇదే. ఇదిలావుండగా బస్తర్ రేంజ్ పరిధిలో ఉన్న కాంకేర్ నియోజకవర్గంలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News