Friday, May 10, 2024

అక్టోబర్ 11 నుండి 33 కొత్త బిసి గురుకులాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ 11 నుండి 33 కొత్త బిసి గురుకులాలు ప్రారంభం
15 డిగ్రీ కాలేజీల్లో అక్టోబర్ 15 నుండి తరగతులు ప్రారంభం
సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హైదరాబాద్: బిసిల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జిల్లా ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుండి, నూతన డిగ్రీ కళాశాలలను అక్టోబర్ 15 నుండి ప్రారంభించాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. మంత్రి నివాసంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కొత్త గురుకులాలను నెలకొల్పుతున్నామని, స్థలాల గుర్తింపు బాధ్యతను స్థానిక జిల్లా మంత్రులు, ఎంఎల్‌ఎలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామి మేరకు హాలియా, దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్లా, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించాలన్నారు. ఈ నూతన గురుకులాలతో మొత్తం బిసి గురుకులాల సంఖ్య 310కి చేరింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 41 కుల సంఘాలకు రూ.95.25 కోట్లు, కోకాపేట్, ఉప్పల్ బగాయత్లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించిందని వీటిలో 24 కుల సంఘాలు ఇప్పటికే పట్టాలు పొందారని మంత్రి తెలిపారు. మిగితా సంఘాలకు కూడా ఈ నెల 8న పట్టాలను ప్రధానం చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భర్తీ చేస్తున్న 80,025 ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ బిసి స్టడీ సర్కిళ్లు మరింత విస్తృతంగా అభ్యర్థులకు సేవలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 12 స్టడీ సర్కిళ్లకు అదనంగా అతి త్వరలో మరో 50 స్టడీ సెంటర్ల ద్వారా గ్రూప్స్, డిఎస్‌సి, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు. వీటి ద్వారా దాదాపు 25 వేల మందికి పైగా అభ్యర్థులకు నేరుగా లబ్దిచేకూరుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజెపి సొసైటి కార్యదర్శి మల్లయ్య బట్టు, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్, బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సంధ్య, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

33 New Gurukulam Schools Starts from Oct 11: Gangula

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News