Thursday, May 2, 2024

రాష్ట్రంలో మరి 55 కేసులు

- Advertisement -
- Advertisement -

55 Corona Positive Cases Registered

 

మాదన్నపేటలో ఒకే అపార్టుమెంట్‌లో 23 మందికి కరోనా
కొత్తగా 55 కేసులు నమోదు, 12 మంది డిశ్చార్జ్
జిహెచ్‌ఎంసి పరిధిలో 44, రంగారెడ్డి 1, సంగారెడ్డిలో 2 నమోదు
మరో ఎనిమిది మంది వలస కార్మికులకూ కరోనా

మన తెలంగాణ/హైదరాబాద్/మాదన్నపేట్ : రాజధాని నగరంలో కరోనా హడలేత్తిస్తుంది. గత పదిహేను రోజుల నుంచి వచ్చే కేసులన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలో నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తుంది. తాజాగా మలక్‌పేట్ డివిజన్ మాదన్నపేట్‌లో కరోనా ఒక్కసారిగా ఉలిక్కిపట్టిస్తోంది. ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి బర్త్‌డే పార్టీతో 23 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వీరంతా ఒకే అపార్ట్‌మెంట్ వాసులు కావడం గమనార్హం. ఇటీవల ఈ ఉద్యోగి తన పుట్టిన రోజు వేడుకలను లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారు. శనివారం నిర్ధారించబడ్డ బాధితుల్లో 11 నెలల పసికందుతో పాటు, గర్భిణి స్త్రీ ఉండటం కూడా బాధకరం.

ఈ బర్తడే పార్టీలో సుమారు 50 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా, వారందరికీ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 23 మందికి పాజిటివ్ రాగా, మరో ఐదుగురు రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే వీరు ఎవరెవర్నీ కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరిస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సుమారు 4వేల మంది ఎన్‌ఎమ్‌లు, నర్సులతో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవల వనస్థలిపురంలో ఓ పుట్టిన రోజు కారణంగా ఎక్కువ మందికి వైరస్ సోకింది. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇంకా ఇలాంటి సామూహిక వేడుకలను నిర్వహించుకోవడం విస్మయానికి గురిచేస్తుంది.

లింక్‌ను ఇలా గుర్తించారు

ఒకరి నిర్లక్షం 23 మందికి వైరస్ సోకిన ఘటన సౌత్‌జోన్ జిహెచ్‌ఎమ్‌సి సంతోష్‌నగర్ సర్కిల్ 7లోని కుర్మగూడ డివిజన్ మాదన్నపేట్‌లో చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో పనిచేసి పని మనిషికి, మాదన్నపేట్ మార్కెట్‌లో కూరగాయాలు అమ్మే ఇద్దరు వ్యక్తులకు అనుమానిత లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయగా కరోనా తేలింది. దీంతో అప్రమత్తమైన జిహెచ్‌ఎమ్‌సి అధికారులు లింక్‌ను ట్రేస్ చేసే భాగంగా పుట్టిన రోజు నిర్వహించిన అపార్ట్‌మెంట్‌ను గుర్తించారు. వినాయక్‌నగర్‌లో ఉండే ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో పుట్టిర రోజు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ కార్యక్రమానికి అపార్ట్‌మెంట్‌లో నివసించే అందరూ పాల్గొన్నారు. క్రమంగా ఒక్కోక్కరికి టెస్టులు చేయగా, విందు ఏర్పాటు చేసిన వ్యక్తికి కరోనా సోకిన్నట్లు నిర్థారణ అయింది. అతని కటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి బయట పడింది. ఇందులో 11 నెలల పసికందు ఉండటం అందరిని కలిచివేసింది.

దీంతో జిహెచ్‌ఎమ్‌సి అధికారులు అపార్ట్‌మెంట్‌లోని 55 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 23 మందికి కరోనా ఉన్నట్లు నిర్థారణ అయింది. ఈ విందు కార్యక్రమానికి బయటి నుంచి వచ్చిన మరో 5గురికి కూడా కరోనా ఉన్నట్లు తేలగా,మరో ఐదు మంది రిపోర్ట్ రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో నివసించే నిండు గర్భిణికి నెగటివ్ రావడంతో ఆమెను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వారి అత్తమామ,భర్తకు కరోనా సోకడంతో వారిని గాంధీ హస్పిటల్‌కు తరలించారు. కుర్మగూడ డివిజన్‌లోని మూడుగుళ్ల వద్ద నివసించే 75 ఏళ్ల వృద్ధునికికూడా కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా కలసిన వారందరికి క్వారంటైన్‌లో ఉంచారు. మరోవైపు ఒక్కసారిగా ఉలిక్కిపట్టించిన మాదన్నపేట్ ప్రాంతాన్ని శనివారం జిహెచ్‌ఎమ్‌సి కమిషనర్ లోకేష్‌కుమార్,సౌత్‌జోన్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్‌లు పరిశీలించి స్థానిక అధికారులకు తగిన సూచనలు చేశారు.

రాష్ట్రంలో మరో 55 మందికి కరోనా సోకగా, 12 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీనిలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఏకంగా 44 ఉండగా, సంగారెడ్డిలో 2, రంగారెడ్డిలో ఒకరితో పాటు మరో ఎనిమిది మంది వలస కార్మికులకూ వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1509కు చేరగా, డిశ్చార్జ్‌ల మొత్తం సంఖ్య 971కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 504 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు శనివారం వరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు 52 మంది వలస కార్మికులకు వైరస్ సోకిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News