Monday, April 29, 2024

పాజిటివ్ ఉన్నా పది రోజుల్లో డిశ్చార్జ్

- Advertisement -
- Advertisement -

We provide treatment according to ICMR regulations

 

ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వలనే కేసులు పెరుగుతున్నాయి
కరోనా రోగులకు ఐసిఎంఆర్ నిబంధనలు ప్రకారమే చికిత్స అందిస్తున్నాం
 వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ సోకి అసుపత్రిలో అడ్మిట్ అయిన పది రోజుల్లో వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేకపోతే ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం ఎలాంటి నిర్ధారణ టెస్టులు లేకుండానే డిశ్చార్జ్ అవ్వొచ్చని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

గతంలో వైరస్ సోకిన వ్యక్తికి చికిత్స అనంతరం రెండు సార్లు కరోనా నిర్ధారణ టెస్టులు చేసేవాళ్లమని, ఈరెండింట్లో నెగటివ్ వస్తేనే డిశ్చార్జ్ చేసేవాళ్లమని ఆయన తెలిపారు. కానీ ఇటీవల మార్చి 10వ తేదిన ఐసిఎంఆర్ ఆ నిబంధనలను సవరించిందని, దాని ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కానీ దీర్ఘకాలిక రోగులకు మాత్రం ఖచ్చితంగా రెండు సార్లు డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వలనే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు.

వీరందరికీ ఐసిఎంఆర్(ఇండియన్ ఇనిస్టిట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనలు ప్రకారమే చికిత్స అందిస్తున్నామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కరోనా నివారణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈసందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…హైదరాబాద్ లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో నిరంతరం మాట్లాడి అన్ని విషయాలను పరిశీలిస్తుమన్నారు. ఇటీవల ఐసిఎంఆర్ డిశ్చార్జ్, ఐసొలేషన్, డెత్‌గైడ్‌లైన్స్‌ను సవరించిందని, వాటి ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నూతన మార్గనిర్దేశకాల ప్రకారం కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను పది రోజుల పాటు చికిత్స అందించిన తరువాత ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్ చేయవచ్చని పేర్కొందని మంత్రి గుర్తుచేశారు.

ఇలా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంచాలని, ఒక వేల లక్షణాలు ఎక్కువ ఉన్న, ఇతర ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషంట్లను మాత్రం హాస్పిటల్ లో ఉంచి చికిత్స అందిచాలని ఐసిఎంఆర్ నిర్దేశించిందని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ కొరకు మే 10 వ తేదీన విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్శరీ కాంటాక్ట్ ను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ఐసిఎంఆర్ చెప్పిందని వెల్లడించారు. ఇంట్లో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారికి సహాయం కోసం ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఐసిఎంఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. అలా సహాయం అందిస్తున్న వ్యక్తి కి హెచ్‌సిక్యూటాబ్లెట్స్ అందించాలని సూచించి, 17 రోజుల పాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పారు. ఇలా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని ఉదయం సాయంత్రం మెడికల్ టీం లు పరీక్షలు చేస్తారని, వారికి అవసరం అయిన నిత్యావసరవస్తువులు అన్నీ జిహెచ్‌ఎంసి ద్వారా అందజేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.

అన్ని శాఖల సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమించామన్నారు. కోవిడ్ మరణాల విషయంలో కూడా ఐసిఎంఆర్ నూతన మార్గానిర్దేశకాలను విడుదల చేసిందని, వీటి ప్రకారం కాన్సర్, గుండెజబ్బులు, లేదా ఇతర జబ్బులతో చనిపోయిన వారికి కరోనా పాజిటివ్ ఉన్న కూడా దీర్ఘ కాలిక వ్యాధులతో చనిపోయినట్టుగానే పరిగణించాలని కొత్త నిబంధనలు చెప్తున్నాయని అన్నారు. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందని, వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ఐసిఎంఆర్ తెలిపిందన్నారు. అయితే పాజిటివ్ కేసులు, మరణాలు దాస్తే దాగవని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తప్పుడు వార్తలు ప్రచురించవద్దని మీడియాకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News