మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 69 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందులో ఓబిసిలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్‌లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ‘విద్యలో ముందంజ’లో కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు అవలంభిస్తున్న సిఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం త న హృదయాన్ని తాకిందని సిఎంపేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంతో పేద విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. తెలంగాణలోనూ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ నాడార్ వంటి గొప్ప యోధులు జన్మస్థలం తమిళనాడు అని ఆయన అభివర్ణించారు. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్‌ను అనుసరించారని సిఎం రేవంత్ అన్నారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తోందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుందన్నారు.
తమిళనాడు, -తెలంగాణల మధ్య సారూప్యతలున్నాయి
నాన్ ముదలవన్ (స్కిల్ డెవలప్‌మెంట్) రూ.10 వేల ఉపకార వేతనం ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే బాలురు, బాలికలకు ఇచ్చే ఈ స్కీమ్‌లు ఉండడం అదృష్టమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమిళనాడు పేదలకు అండగా సిఎం స్టాలిన్ ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ కితాబునిచ్చారు. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉందని ఆయన అన్నారు. 1991 సరళీకరణ తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందిందని, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం అమల్లో తమిళనాడు, -తెలంగాణల మధ్య సారూప్యతలున్నాయని ఆయన పేర్కొన్నారు.
మేము కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం
తాము కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్నా భోజన పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమేనని ఆయన తెలిపారు. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం తమకు ప్రేరణ కలిగించిందన్నారు. దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచిందని ఆయన కితాబునిచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వం, తాను విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అందుకే విద్యా శాఖను తన దగ్గరే ఉంచుకున్నానని ఆయన పేర్కొన్నారు.
తమ రాష్ట్రంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యలేమితో ఉద్యోగాలు దక్కకపోతుండడంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సిఎం రేవంత్ తెలిపారు. పిపిపి విధానంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, దానికి చైర్మన్‌గా ఆనంద్ మహేంద్రను నియమించామని, కార్పొరేట్ సంస్థల అధిపతులను డైరెక్టర్లుగా నియమించామని సిఎం రేవంత్ తెలిపారు.
దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్
మనకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నా ఒలింపిక్స్‌లో మనకు ఒక్క గోల్డ్ మెడల్ రాలేదని ఆయన వాపోయారు. 4-5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వచ్చాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఒక క్రీడాకారిణికే మూడు అర్చరీ గోల్డ్ మెడల్స్ వచ్చాయని, మరి మన విజయ గాథ ఎక్కడ ఉందని సిఎం రేవంత్ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో మనం ఎక్కడ ఉన్నామని, ఒక్క గోల్డ్ మెడల్ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 56 అంగుళాల ఛాతీతో ఏం ప్రయోజనం అని, అందుకే తాను యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీని ప్రారంభించానని ఆయన తెలిపారు. అందులో సంజయ్ గోయెంకా, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, ఉపాసన కొణిదెల వంటి క్రీడాకారులతో పాటు కార్పొరేట్ సంస్థలను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
తమిళనాడు-, తెలంగాణల మధ్య సాంస్కృతిక, స్నేహ సంబంధాలు కొనసాగాలి
తమిళనాడు-, తెలంగాణల మధ్య సాంస్కృతిక, స్నేహ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమిళ విద్యార్థులు, కోచ్‌లకు స్పోర్ట్ యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించే బాధ్యత తెలంగాణ-, తమిళనాడు తీసుకుంటాయని, మోడీ, అమిత్ షాతో అది సాధ్యం కాదని ఆయన అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలు ఉండేవని, మేం వారంతా వేర్వేరు అని అనుకోవడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ విద్యార్థులంతా ఒకే చోట ఉండి చదువుకుంటారని సిఎం రేవంత్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి నర్సరీ ప్రారంభం
ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 1956లో ప్రారంభించిన ఐటీఐల్లో ఇప్పటికీ అదే సిలబస్ కొనసాగిస్తున్నారని, ఇప్పటికీ డీజిల్ మెకానిక్, ప్లంబర్ ట్రైనింగ్ ఇస్తున్నారని, అక్కడ శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి లభించడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. టాటా కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఇటీవలే మేం నూతన విద్యా విధానం తీసుకువచ్చామని అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి నర్సరీ ప్రారంభిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
విద్యపై చేసే వ్యయం భవిష్యత్ తరాల పెట్టుబడి
తమిళనాడులో మాదిరే తెలంగాణలో కూడా అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయని, తమిళనాడు, తెలంగాణ దేశానికి రోడ్‌మ్యాప్‌లను ఇవ్వనున్నాయని, నాలెడ్జ్ హబ్‌లు కానున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యను విప్లవంగా తాము భావిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. తమిళనాడు మాదిరే తెలంగాణ కూడా విద్యపై చేసే వ్యయాన్ని భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తుందన్నారు. కేవలం విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు తిరు స్టాలిన్‌కు, తమిళనాడు ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
Also Read: ఆర్‌టిసి బస్సెక్కితే బహుమతులు