Sunday, April 28, 2024

ఇంగ్లండ్ జట్టులో కరోనా కల్లోలం

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ జట్టులో కరోనా కల్లోలం
కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్, పాక్‌తో సిరీస్‌కు కొత్త జట్టు ఎంపిక
లండన్: భారత్‌తో జరిగే కీలకమైన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత నిర్వహించిన కరోనా పరీక్షల్లో జట్టులోని మొత్తం ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలింది. వీరిలో ముగ్గురు క్రికెటర్లు ఉండగా మరో నలుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. అయితే వారి పేర్లను మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. ఇక జట్టులోని కొందరు కరోనా బారిన పడడంతో ఇంగ్లండ్ జట్టంతా ఐసోలేషన్‌లోకి వెళ్లి పోయింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ బోర్డు ధ్రువీకరించింది. శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తర్వాత ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలడంతో ఒక్కసారిగా కల్లోలం నెలకొంది. మరోవైపు బుధవారం నుంచి ఇంగ్లండ్‌, పాకిస్థాన్ జట్ల మధ్య ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ బోర్డు బెన్‌స్టోక్స్ నేతృత్వంలో కొత్త జట్టును ఎంపిక చేసింది. ఇక పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఇంగ్లండ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ మీడియాతో వెల్లడించారు. బయో సెక్యూర్ పరిస్థితులకు దూరంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాము ముందే ఊహించామన్నాడు. తాము భయపడినట్టే జట్టులో కరోనా కల్లోలం సృష్టించిందన్నారు.
తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు చోటు
ఇక పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం బెన్‌స్టోక్స్ సారథ్యంలో 14 మందితో కూడిన జట్టును ఇంగ్లండ్ బోర్డు ఎంపిక చేసింది. వీరిలో తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు చోటు కల్పించింది. కౌంటీ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సిరీస్‌ను నిర్వహించాలనే ఉద్దేశంతో కొత్త జట్టును ఎంపిక చేయాల్సి వచిందన్నారు. ఇక అందివచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జట్టులో చోటు సంపాదించిన చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుగైన ప్రతిభను కనబరిచారన్నారు. పాకిస్థాన్ సిరీస్‌లో వీరంత సత్తా చాటడం ఖాయమనే ధీమాను గిల్స్ వ్యక్తం చేశారు.
ఇంగ్లండ్ జట్టు ఇదే: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేక్ బాల్, డానీ బ్రిగ్స్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, లూయిస్ గ్రెగరి, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డానియల్ లారెన్స్, షకీబ్ మహమూద్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఒవర్టన్, మార్ట్ పార్కిన్సన్, జేమ్స్ విన్స్, జాన్ సింప్సన్, ఫిల్ సాల్ట్, డేవిడ్ పెయిన్.

7 members of England team test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News