Tuesday, April 30, 2024

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

- Advertisement -
- Advertisement -

KCR

 

ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం, ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు, ఇరిగేషన్ రంగంలో అసాధారణ అభివృద్ధి, కాళేశ్వరం ద్వారా రోజుకు 3 టిఎంసిల గోదావరి నీరు ఎత్తిపోతకు ఏర్పాట్లు, శరవేగంగా పాలమూరు ప్రాజెక్టు పనులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మ సాగర్, ఇక నుంచి రైతుబంధు సమితులుగా సమన్వయ సమితులు, త్వరలోనే కార్యాచరణ, మెరుగైన ప్రజా వైద్యం అందిస్తున్న 3 రాష్ట్రాల్లో తెలంగాణ : ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్ : అన్ని రంగాలకు పునరుత్తేజం కల్పించడానికి దార్శనిక సిఎం కెసిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రశంసించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శుక్రవారం ప్రసంగించారు. నమస్కార్.. వణక్కంతో ప్రారంభమైన ఆమె ప్రసంగం 40 నిమిషాలపాటు కొనసాగింది. వృద్ద్యాప్య పెన్షన్ అర్హత వయసును 65సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆసరా పెన్షన్లు అందుతాయని చెప్పారు. అవినీతికి, జాప్యానికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వని విధంగా కొత్త రెవెన్యూ చట్టా న్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త భూ పరిపాలనా విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆమె చెప్పారు.

రాష్ట్రంలో నీటిపారుదల రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని, ఇప్పటికిప్పుడు కళ్లముందు సాక్షాత్కారిస్తున్న నిలువెత్తు నిదర్శనం ఈ యాసంగి రికార్డు స్థాయిలో వరి సాగు కావడమేనన్నారు. యాసంగిలో అధికంగా 123.5 శాతం పెరిగిన వరి విస్తీర్ణం రాష్ట్రం సాధించిన విజయానికి సంకేతంగా చెప్పారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తవుతుందన్నారు. ఈ ఏడాది వర్షాకాలం నుంచి గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజు కు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లతో పాటు, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సుమారు 40 టిఎంసిల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతు సమన్వయ సమితులుగా వ్యవహరించిన వ్యవస్థను ఇప్పటి నుంచి రైతుబంధు సమితులుగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతు బంధు సమితులు కీలక బాధ్యతలు పోషించే విధంగా ప్రభుత్వం త్వరలోనే కార్యాచరణను ప్రారంభించనుందని తెలిపారు. దేశంలో మెరుగైన ప్రజావైద్యం అందిస్తున్నమొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం మనందరికీ స్పూర్తిదాయకమైన విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 20 న్యూ బార్న్ కేర్ సెంటర్లకు గాను ఆరు ప్రారంభమయ్యాయని తెలిపారు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవ న విధ్వంసం ఫలితంగా కుదేలైన రంగాలు, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత తక్కువ వ్యవధిలో సాధించిన ప్రగతిని చూసి, యావత్ దేశం అబ్బురపడుతుందన్నారు.

ఉద్యమ నాయకుడే సారథి కావడం కలిసొచ్చింది
ఆరు దశాబ్దాల పాటు పోరాటం కొనసాగించి, తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగిందన్నారు. చాలా స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవడం గర్వకారణమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడే, సాకారమైన స్వరాష్ట్రానికి సారధి అయి ముందుకు నడిపించడం తెలంగాణకు కలిసొచ్చిన అంశమని ఆమె తెలిపారు.

సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇక సమైక్య రాష్ట్రంలో అయితే నిత్య విద్యుత్ కోతలతో రాష్ట్రం గాఢాంధకారంలో ఉండేదని, పేద ప్రజలకు కనీస జీవన భద్రత లేకుండా పోయిందిదన్నారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు నిత్యకృత్యంగా ఉండేవన్నారు. రూ.200లతో చాలీచాలని పెన్షన్ పేదల అవసరాలు తీర్చలేకపోయింది. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయి ఉండేది. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాలికలు రూపొందించుకుని, పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

సంక్షేమమే ఊపిరిగా..
ప్రభుత్వం సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఆసరా పెన్షన్లతో పాటు బీడీ కార్మికులకు ద్వారా ఇస్తున్న 2,016 రూపాయల పెన్షన్లతో పేదలందరు ఎవరిమీద ఆధారపడకుండా ఎంతో సంతోషంగా బతుకుతున్నారన్నారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.500ల నుంచి రూ.3016లకు పెంచి ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్ల పెండ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం లక్షా 116 రూపాయల చొప్పున అందిస్తున్నదని గవర్నర్ తెలిపారు. విద్యార్థులకు పాఠశాలల్లో, హాస్టళ్లలో ప్రభుత్వం సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డిస్తుందన్నారు. పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ విద్యాలయాలను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్వహిస్తున్నదన్నారు.

మిగులు విద్యుత్ రాష్ట్రంగా..
రాష్ట్రంలో దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడితే, తెలంగాణలో అంతకు మించి, 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని చెప్పారు. అయినా లోటు లేకుండా సరఫరా చేసుకోవడం రాష్ట్రం సాధించిన ఘన విజయమన్నారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నదని పేర్కొన్నారు.

సాగులోకి భూమి..అధిక దిగుబడులు
రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, గత పాలకులు సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల, అసలు ఓ విధానమంటూ లేకపోవడంతో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందన్నారు. వ్యవసాయ రంగాన్ని కుదుట పర్చేందుకు, అన్నదాతల్లో ఆశావహ దృక్పథం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చిందని తెలిపారు.

ఈ వేసవిలోనే సమ్మక్క సారక్క బ్యారేజి
ప్రాజెక్టుల నిర్మాణం కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేసిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తున్నదని గవర్నర్ తెలిపారు. వరి పంట సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు అయితే 38,19,419 ఎకరాల సాగును వ్యవసాయశాఖ నమోదు చేసిందన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు నీరందించేందుకు సమ్మక్క సారక్క బ్యారేజి నిర్మాణాన్ని ఈ వేసవిలోనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుందన్నారు.

యావత్ ప్రపంచానికి రైతుబంధు ఆదర్శం
విప్లవాత్మక పథకం ‘రైతుబంధు’ ఇప్పుడు భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమైందన్నారు. రైతులకు అండగా ఉండాలనే సత్సంకల్పంతో ఇప్పుడు ఎకరానికి రూ.పదివేల చొప్పున రెండు విడతల్లో అందిస్తున్నామన్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో ‘రైతుబంధు’ ఒకటని ఐక్యరాజ్యసమితి ప్రకటించడం మన రాష్ట్రానికి, మన రైతులకు గర్వకారణంగా గవర్నర్ తెలిపారు.

మంచినీటి సమస్యలకు మిషన్ భగీరథ
రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు సురక్షిత మంచినీరు మిషన్ భగీరథ పథకం ద్వారా అందుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మంచినీటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి దేశంలోని 11 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే మిషన్ భగీరథ పనులపై అధ్యయనం చేశాయని గవర్నర్ తెలిపారు. అన్ని రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడం మంచిదని నీతిఆయోగ్ సిఫారసు చేయడం పథకానికి దక్కిన ప్రశంసగా పేర్కొన్నారు.

బస్తీ దవాఖానాలు.. మెరుగైన వైద్యం
ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలు, పేదలు ఎక్కువుండే బస్తీల్లో ప్రభుత్వ పరంగా ఆరోగ్య సేవలు అందించడం కోసం బస్తీ దవాఖానాల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని, పేదలకు ఉచితంగా పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రంలోని 84 పి.హెచ్.సి.లు ఎన్.క్యూ. ఎ.ఎస్. స్థాయిని పొంది, దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మందుల కొనుగోలుకు కేటాయించే బడ్జెట్ ను మూడింతలు పెంచినట్లు చెప్పారు.రాష్ట్రంలో 96 శాతం ఇమ్యునైజేషన్ సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. కంటి వెలుగులో కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించినట్లు తెలిపారు.

పరిపాలనా సంస్కరణలు
రాష్ట్రంలో 10 జిల్లాలను 33 జిల్లాలు, 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 73 కి పెంచుకున్నామని గవర్నర్ తెలిపారు. 459 మండలాలను 590, మున్సిపాలిటీల సంఖ్యను 52 నుంచి 128 కి పెంచుకున్నామని చెప్పారు. కార్పొరేషన్ల సంఖ్యను 6 నుంచి 13కు పెంచుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది పోలీస్ కమిషనరేట్లున్నాయన్నారు. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 164కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 719కు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 815కు ప్రభుత్వం పెంచింందన్నారు.

ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీ కోసమే
కొత్త విధానాలు – కొత్త చట్టాలు అధికారులు, ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచడం కోసం, స్థానిక సంస్థలను క్రియాశీలం చేయడం కోసం తీసుకువచ్చినట్లు గవర్నర్ తెలిపారు. కొత్తగా పంచాయతీ రాజ్, కొత్త మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. పల్లెలు బాగుపడే కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం కలెక్టర్లకు ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఇచ్చిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతీ నెలా రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్దికి ప్రతీ నెలా రూ.148 కోట్లలను ప్రభుత్వం అందిస్తుందని వివరించారు.

14 లక్షల మందికి ఉపాధి
కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులిచ్చే టిఎస్ – ఐపాస్ సింగిల్ విండో విధానం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఇప్పటి దాకా 12,427 పరిశ్రమలకు ఈ విధానం ద్వారా అనుమతులు పొందాయి. వీటివల్ల 2లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చినట్లు తెలిపారు. 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు.201314 ఆర్థిక సంవత్సరంలో ఐ.టి ఎగుమతుల విలువ రూ. 57వేల కోట్లు ఉంటే 201819 నాటికి రూ.లక్షా 9 వేల కోట్లకు పెరిగిందన్నారు.

త్వరలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్
శాంతి భద్రతలు సజావుగా ఉంటేనే పౌర జీవనం ప్రశాంతంగా సాగుతుందని, ప్రగతి నిరాఘాటకంగా జరుగుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని గవర్నర్ తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణలో 6 లక్షల సిసి కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, దేశం మొత్తం మీద ఉన్న సిసి కెమెరాల్లో 66 శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ లో నిర్మిస్తున్న అంతర్జాతీయ స్థాయి పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

తెలంగాణది గంగా జమునా తహజీబ్
తెలంగాణది గంగా జమునా తహజీబ్ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు శతాబ్దాల తరబడి ఇక్కడి కలిసి మెలసి స్నేహ భావంతో జీవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల మధ్య ఐక మత్యాన్ని పెంచడానికి, లౌకిక స్పూర్తిని కాపాడడానికి త్రికరణ శుద్ధిగా పాటుపడుతుందని ప్రకటించారు. అన్ని మతాల విశ్వాసాలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. అన్ని మతాల పండుగలను ఆదరిస్తుందన్నారు.
మాంద్యంలోనూ ఆదాయ వృద్ధి

దేశంలో గడిచిన కొద్ది నెలలుగా కొనసాగుతన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడిందని గవర్నర్ తెలిపారు. అయినప్పటికీ పటిష్టమైన పరిపాలనా విధానాలతో, కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ నిలదొక్కుకోగలుగుతోందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా, తెలంగాణ ఆ దుస్థితిలో లేకపోవడం గుడ్డిల్లో మెల్ల అన్నట్లు కనిపించే అంశంగా చెప్పారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్ధికాంశాలలో కఠినమైన క్రమశిక్షణ పాటించాలని నిర్ణయించుకుందన్నారు. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను నెరవేరుస్తూ, ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలను యధాతధంగా అమలు చేస్తూ, స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటూ అత్యంత ఆశావహ దృక్పథంతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యత సాధిస్తూ, ప్రజల అవసరాల ప్రాతిపదికన పాలన సాగుతోందన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న అచంచల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు.
ఉరుపసియం.. ఒబప్పినియం.. సెరుపగయం సెరా తాయఅయల్వత్ నాదు..
(ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వ లేని రాజ్యమే గొప్ప రాజ్యం)

నేడు కేబినెట్ ప్రత్యేక భేటీ
నేడు కేబినెట్ ప్రత్యేక భేటీ కానుంది. సాయ ంత్రం 7 గంటలకు సిఎం కెసిఆర్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్‌లో జరగనుంది. బడ్జెట్ 20202021కు సంబంధించి ఈ సమావేశం జరుగుతోంది. సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారంతో పాటు ప్రతీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించిందన్నారు. ప్రమాద వశాత్తూ మరణించిన గీత కార్మికులు, మత్స్యకారులకు ప్రభుత్వం రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తుందన్నారు. జి.ఓ.నెంబర్ 58 కింద రెగ్యులరైజేషన్ ప్రకారం రాష్ట్రం మొత్తం లక్షా 25 వేల మందికి భూమి పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, 5 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని కల్పించిందన్నారు. పూజారులకు ప్రభుత్వ ఉద్యోగులకు, మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు భృతి అందిస్తున్నామన్నారు. సంక్షేమరంగంలో దేశంలోనే తెల ంగాణ నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉందన్నారు.

 

Planned development under leadership of KCR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News