Tuesday, April 30, 2024

శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!

- Advertisement -
- Advertisement -

Tickets Subsidy in Shramik trains is an illusion

 

వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన 15 శాతం మాత్రమే రాష్ట్రాలు భరించవలసి వస్తుందని చెప్పింది. నిజంగా ఇలాగే జరిగిందా?

ఈ శ్రామిక్ రైళ్ళ టిక్కెట్ల ధరను విశ్లేషిస్తే ఇది నిజం కాదని అర్థమవుతుంది. నిజానికి రాష్ట్రాలు అసలు టిక్కెట్టు ధర కన్నా చాలా ఎక్కువ చెల్లించాయి. రైల్వేలు ప్రకటించిన టిక్కెట్ ధరలతో పోల్చి చూసినా ఈ వాస్తవాలు అర్థమవుతాయి. ఈ 85 శాతం సబ్సిడీ అనేది ఒకపెద్ద ఊహాత్మక భావన. కేవలం పాసింజరు రైళ్ళు మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని మొత్తం రైల్వే ఇన్‌ఫ్రాస్టక్చర్, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చులన్నీ లెక్కించి, ఆ ఖర్చుల్లో సబ్సిడీ ఇస్తున్నట్లు చేసిన ఊహ మాత్రమే. నిజానికి 85 శాతం సబ్సిడీ ఇచ్చినట్లు ఏ ఆడిట్ లెక్కలు కూడా ధ్రువీకరించడం జరగలేదు.

ఈ సబ్సిడీని ఎలా లెక్కించారో, రైల్వే టిక్కెట్లకు సంబంధించి ఏ టిక్కెట్టు ధరలో సబ్సిడీ ఇచ్చారో కూడా స్పష్టత లేదు. మెయిలు లేదా ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్టు ధర సాధారణ లోకల్ లేదా పాసింజర్ రైలు టిక్కెట్టు ధర కన్నా 80 శాతం అధికంగా ఉంటుంది. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలులో కూడా వివిధ కేటగిరీల టిక్కెట్ల ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా మెయిల్ లేదా ఎక్ప్‌ప్రెస్ రైలులో 501 కి.మీ. దూరం ప్రయాణానికి టిక్కెట్ల వివరాలు చూస్తే జనరల్ తరగతికి 151 రూపాయలు తీసుకుంటారు.

అదే స్లీపర్ క్లాసు అయితే రూ. 276, ఎ.సి.ఛైర్ కార్ అయితే రూ. 577, ఎ.సి.త్రీటైర్ స్లీపర్ అయితే రూ. 733, ఎ.సి.టూ టైర్ స్లీపర్ అయితే రూ. 1,058, ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండీషన్ అయితే రూ. 1,794 తీసుకుంటారు. ఒకే దూరానికి వివిధ తరగతుల టిక్కెట్టు ధరల్లోనే ఇంత తేడా ఉంది. దీనికి తోడు రిజర్వేషన్ చార్జీలు కూడా ఆయా తరగతుల టిక్కెట్టుకు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్ళలో బేస్ ఫేర్ కన్నా గ్రాస్ టిక్కెట్టు ధర 40 శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 85 శాతం సబ్సిడీ అనేది తప్పుదారి పట్టించే మాట. ఏ ధరలో ఈ సబ్సిడీ ఇచ్చారన్నది స్పష్టంగా లేదు.

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 40 శ్రామిక్ రైళ్ళ కోసం చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైల్వే శాఖకు రూ. 3,83,31,330 చెల్లించింది. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల ముక్కుపిండి ఈ సొమ్ము కేంద్రం వసూలు చేస్తుందని చత్తీస్‌గఢ్ అధికారులు వాపోతున్నారు. సాధారణంగా చెల్లించే పూర్తి టిక్కెట్టు ధర కన్నా అధికంగా చెల్లించవలసి వచ్చిందని అంటున్నారు. ఉదాహరణకు, భారత రైల్వే శాఖ మే 24వ తేదీన కేరళలోని తిరువనంతపురం నుంచి చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ వరకు శ్రామిక్ రైలు నడిపింది. 12 వందల మంది ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి రూ. 13 లక్షల వసూలు చేసింది. అంటే ఒక్కో ప్రయాణికుడి టిక్కెట్టు ధర 1,083 రుపాయలు. అయితే, 2,675 కి.మీ. దూరానికి సాధారణంగా మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్ క్లాస్ టిక్కెట్టు అసలు ధర రూ. 813 మాత్రమే.

గుజరాత్ నుంచి మొత్తం 16 రైళ్ళు చత్తీస్‌గఢ్‌కు నడిపారు. మే 9 నుంచి మే 28 వరకు ఈ రైళ్ళను నడిపారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ రైళ్ళ కోసం రూ. 1,47,74,405 చెల్లించింది. మొత్తం ప్రయాణీకులు 23,770 మంది ప్రయాణించారు. ఒక్కో ప్రయాణీకుడి టిక్కెట్టుకు రూ. 621 అవుతుంది. ఈ రైలులో ప్రయాణించిన వారి సగటు ప్రయాణ దూరం 1350 కి.మీ.లుగా లెక్కించినా స్లీపర్ క్లాసు అసలు టిక్కెట్టు ధర రూ. 535 మాత్రమే.

ప్రయాణంలో ఆహారం, నీరు ఉచితంగా సరఫరా చేశామని చెప్పడం కూడా అబద్ధమే. విశ్లేషించి చూస్తే, చాలా రైళ్ళలో రూ. 50 నుంచి రూ. 100 వరకు దీని కోసం చార్జీ చేశారు. ఈ చార్జీలు వడ్డించినప్పటికీ సరిగా ఆహారం, నీరు సరఫరా చేయలేదనే ఫిర్యాదులు కోకొల్లలు. ఉదాహరణకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి చత్తీస్‌గఢ్‌లోని చంపా వరకు వేసిన రైలు చంపా స్టేషనుకు మే 27వ తేదీన చేరుకుంది. మొత్తం 26 గంటల ప్రయాణం. ప్రయాణికులకు ఒకే ఒక్కసారి ఆహారం ఇచ్చినట్లు పలువురు ఫిర్యాదులు చేశారు.

టిక్కెట్టు ధర ఎక్కువగా ఉండడం, ఆహారం సరఫరా సరిగా ఉండకపోవడంతో పాటు చాలా శ్రామిక్ రైళ్ళు విపరీతమైన ఆలస్యంతో నడిచాయి. సాధారణంగా వెళ్ళవలసిన రూటు వదిలేసి ఎక్కడెక్కడో తిరిగి వెళ్ళాయి. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీని గురించి మాట్లాడుతూ రైళ్ళు దారి తప్పలేదని, రద్దీ వల్ల దారి మళ్ళించవలసి వచ్చిందని అన్నారు. కాని చాలా రైళ్ళు ఉత్తరప్రదేశ్ లేదా బీహారు వెళుతున్నాయి. కాబట్టి రద్దీ పెరిగిందని అన్నారు. ఈ వాదన కూడా పొంతన లేని వాదన. లాక్ డౌన్ వల్ల రైళ్ళ రద్దీ లేదు. సాధారణ పరిస్థితుల్లో రైళ్ళ రద్దీ కన్నా చాలా తక్కువ రద్దీ మాత్రమే ఉంది. సాధారణ రోజుల్లో రోజుకు 13 వేల రైళ్ళు నడుస్తుంటాయి. కేవలం 4000 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను మాత్రమే ఇప్పుడు నడిపారు. మిగిలిన రైళ్ళన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఆర్ధిక కార్యకలాపాలు కూడా స్తంభించి ఉన్నాయి కాబట్టి గూడ్సు రైళ్ళు కూడా పెద్దగా నడవడం లేదు. అయినా మంత్రిగారు రద్దీ గురించి మాట్లాడడం విచిత్రం.

శ్రామిక్ రైళ్ళు ఇలా దేశమంతా తిరిగి వెళ్ళడానికి కారణం వాటిని ‘ప్రత్యేకరైళ్ళు’గా రైల్వే శాఖ వర్గీకరించడం. భారత రైల్వేలో ‘ప్రత్యేక’ రైళ్ళకు అతి తక్కువ ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది. ఎందుకంటే అవి ముందుగా ప్రకటించిన నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట మార్గంలో నడిచే రైళ్ళు కావు. అందువల్ల వివిధ జోనల్ విభాగాల్లోని ఆపరేటింగ్ సెక్షన్లు ఈ రైళ్ళకు చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. తమ ప్రాధాన్యతల ప్రకారం పని చేస్తాయి. ఫలితంగా ఈ అయోమయం ఏర్పడింది. రైల్వే యూనియన్‌కు చెందిన మాజీ సెక్రటరీ రవి బెనర్జీ ఈ విషయాన్నే చెప్పారు. శ్రామిక్ రైళ్ళు ప్రత్యేక రైళ్ళుగా ప్రకటించడం వల్లనే ఈ అయోమయం చోటు చేసుకుందని అన్నారు.

నిజానికి ఇప్పుడు ప్రత్యేకంగా వేసిన ఈ శ్రామిక్ రైళ్ళ మార్గంలోనే నడిచే సాధారణ రైళ్ళు చాలా ఉన్నప్పటికీ వాటిని నడపకుండా, ప్రత్యేకంగా ఈ ప్రత్యేక రైళ్ళ ముద్రతో శ్రామిక్ రైళ్ళు ఎందుకు నడిపారో ప్రభుత్వానికే తెలియాలి. సాధారణంగా ఏదన్నా మార్గంలో ప్రమాదం వల్ల లేదా రైళ్ళ రద్దీ వల్ల అడ్డంకులు ఉంటే రైళ్ళను దారి మళ్ళిస్తున్నప్పుడు రైల్వే విభాగం మరో దగ్గరి దారిని చూస్తుంది. ఢిల్లీ నుంచి అలీగఢ్ మార్గంలో ప్రమాదం జరిగితే, ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళే రైళ్ళ దారి మళ్ళింపు చాలా మరో దగ్గరి దారిలోనే ఉంటుంది. ఆగ్రా నుంచి లేదా బరేలీ నుంచి ఉత్తరప్రదేశ్ వెళతాయి. అంతేకాని, సగం దేశం చుట్టి వెళ్ళవు. కాని శ్రామిక్ రైళ్ళ పరిస్థితి అలాగే అయ్యింది. ముంబయిలోని వాసాయి నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ చేరుకోవలసిన రైలు ఒడిశాలోని రూర్కెలా చేరుకుంది.

గోరఖ్ పూర్ కు 700 కి.మీ. దూరంలో రూర్కెలా ఉంది. సాధారణంగా అయితే ముంబయి నుంచి గోరఖ్ పూర్ వెళ్ళే రైలు రెండు మార్గాల నుంచి వెళుతుంది. ముంబయి, భుసావల్, ఇటార్సి, ఝాన్సీ, కాన్పూర్, గోరఖ్ పూర్ మార్గం లేదా ముంబయి ఇటార్సీ జబల్ పూర్, అలహాబాద్, గోరక్ పూర్ మార్గం. కానీ ఈ రైలు ముంబయి నుంచి భుసావల్ వెళ్ళింది, ఆ తర్వాత అయోమయంగా నాగపూర్, భిలాస్ పూర్, రూర్కెలా వైపు మళ్లింది. అంటే అసలు దూరం 1600 కి.మీ.కు రెట్టింపు దూరం ప్రయాణించింది. శ్రామిక్ రైళ్ళ వ్యవహారాన్ని విశ్లేషిస్తే ఇలాంటివి ఎన్నెన్నో.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News