Thursday, May 9, 2024

కోట్లలో కొత్త బాల కార్మికులు

- Advertisement -
- Advertisement -

Millions of child laborers with Covid 19 crisis

 

భారత్ సహా అనేక దేశాలలో తలెత్తనున్న నిరుద్యోగ సమస్య
స్కూళ్ల మూతతో పనిబాటలో బలవంతంగా బాలలు
ఆర్థిక సంక్షోభం కారణంగా భారం కానున్న చదువులు

ఐక్యరాజ్య సమితి : కోవిడ్-19 సంక్షోభంతో భారత్, బ్రెజల్, మెక్సికోతో సహా అనేక దేశాలలో లక్షల సంఖ్యలో బాలకార్మికులు తయారవుతారని, గడచిన 20 ఏళ్లలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సాగించిన కృషి కోవిడ్-19 కారణంగా నిర్వీర్యమవుతుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ), యునిసెఫ్ సంయుక్తంగా తమ తాజా నివేదికలో వెల్లడించాయి. 2000 సంవత్సరం నుంచి బాల కార్మికుల సంఖ్య 9.40 కోట్లు తగ్గిందని, అయితే కోవిడ్-19 సంక్షోభంతో ఇప్పటిదాకా సాధించిన కృషి వృథాగా మారే ప్రమాదం ఉందని కోవిడ్-19 సంక్షోభం బాల కార్మికులు, సంక్షోభ సమయం, కార్యాచరణ అవసరం పేరిట ఒక నివేదికను ఈ సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం సందర్భంగా(జూన్ 12) ఈ నివేదిక విడుదలైంది. ఇప్పటికే బాల కార్మికులుగా పనిచేస్తున్నవారి పరిస్థితి మరింత దయనీయంగా మారనున్నదని, వారు ఎక్కువ పనిగంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది.

ప్రమాదకరమైన పనులను కూడా వారి చేత బలవంతంగా చేయిస్తారని, దీని వల్ల వారి భద్రత, ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారినపుడు ముఖ్యంగా పిల్లలను కార్మికులుగా మార్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఉదాహరణకు ఆర్థిక సంక్షోభం కారణంగా బ్రెజిల్‌లో కుటుంబ పెద్దలు ఉపాధి కోల్పోవడంతో వారి పిల్లలను పనికి పంపుతున్నారని, ఈ పరిస్థితి గ్వాటెమాలా, ఇండియా, మెక్సికో, టాంజేనియాలో కూడా కనపడుతోందని నివేదిక తెలిపింది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు మూతపడడంతో బాల కార్మికులు పెరుగుతున్నారని, 130 దేశాలకు చెందిన దాదాపు 100 కోట్ల మంది బాలలపై దీని ప్రభావం పడుతోందని నివేదిక వెల్లడించింది. మళ్లీ స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ తమ పిల్లలను చదివించుకునే తాహతు చాలామంది తల్లిదండ్రులకు ఉండకపోవచ్చని పేర్కొంది.

దీని ఫలితంగా బాలకార్మికులు పెరగడమే కాక లింగ వివక్ష కూడా తలెత్తే ప్రమాదం ఉందని, చాలామంది బాలికలు వ్యవసాయ పనులు, ఇళ్లలో పనిమనుషులుగా మారే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. బాల కార్మికుల సమస్య పరిష్కారానికి అనేక సూచనలను కూడా నివేదికలో ప్రతిపాదించారు. పేద వర్గాలకు సమగ్రమైన సామాజిక భద్రత కల్పించడం, వారికి సులభంగా రుణ సౌకర్యాలు కల్పించడం, బాలకార్మికులను తిరిగి పాఠశాలకు రప్పించడానికి వారి కుటుంబ పెద్దలకు ఉపాధి కల్పించడం, పిల్లలకు స్కూలు ఫీజులు రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టడం వల్ల బాలకార్మిక సమస్యను పరిష్కరించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News