Thursday, May 30, 2024

బిజెడిలో చీలికకు బిజెపి కుట్ర: ఒడిశా బిజెడి నేత

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: గెలుపు కోసం ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష బిజెపి పోటీ చేయడం లేదని, ఎన్నికల తర్వాత బిజూ జనతాదళ్(బిజెడి)ని ముక్కలు చేసే ఉద్దేశంతోనే తన సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ఆ పార్టీ పోటీ చేస్తోందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహిత సహచరుడు, బిజెడి నాయకుడు వికె పాండ్యన్ బుధవారం ఆరోపించారు. గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్‌లో కొందరు టెలివిజన్ జర్నలిస్టులతో మాజీ బ్యూరోక్రాట్ పాండ్యన్ మాట్లాడుతూ 120 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలని 2014లో ప్రయత్నించి బిజెపి విఫలమైందని తెలిపారు.

2019లో వారి లక్షం తనకు తెలియనప్పటికీ 2024 ఎన్నికల్లో మాత్రం 50 నుంచి 60 సీట్లు గెలుచుకుని బిజెడిలో చీలికలు తేవాలన్నది వారి ఆలోచనని ఆయన చెప్పారు. ఇదే వారి ఎన్నికల వ్యూహమని పాండియన్ అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, మధ్య ప్రదేశ్‌లో కూడా బిజెపి ఇదే పని చేసిందని ఆయన చెప్పారు. అయితే బిజెపి కుట్ర ఫలించబోదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోసం జాతీయ స్థాయి నుంచి చాలా మంది వస్తున్నారని, కాని వారిపై ఒడిశా ప్రజలలో నమ్మకం లేదని, ప్రజలు కేవలం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను మాత్రమే నమ్ముతారని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీస్సులు నవీన్ పట్నాయక్‌కే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వరుసగా ఆరవసారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్న గట్టి విశ్వాసం తనకు ఉందని ఆయన తెలిపారు. ఆ నమ్మకం ఉన్నందువల్లే జూన్ 9న నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తాను చెప్పగలిగానని ఆయన తెలిపారు. ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ స్థానాలలో 60 స్థానాలలో బిజెపికి అభ్యర్థులే లేరని పాండ్యన్ చెప్పారు. తమ పార్టీ తప్పించిన లేదా తిరస్కరించిన నాయకులను తీసుకోవడం కోసం జెడిఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కోసం బిజెపి ఎదురుచూసిందని ఆయన చెప్పారు. ఇదే ఒడిశాలో బిజెపి వాస్తవ పరిస్థితని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News