Friday, May 3, 2024

20 లక్షలు దాటేశాయ్

- Advertisement -
- Advertisement -

20 లక్షలు దాటేశాయ్
ఒక్క రోజే 62 వేలకు పైగా కొత్త కొవిడ్19 కేసులు
886 మంది మృత్యువాత
13.78లక్షలకు చేరిన రికవరీలు

India's Corona Cases tally Across 20 lakhs mark

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 62,538 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో 60 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షలు దాటి 20,27,074కు చేరుకుంది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13,78,105 మంది బాధితులు కోలుకోగా 6,07,384 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం ఒక్క రోజే దాదాపు 50 వేల మంది వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తొలి లక్ష చేరుకోవడడానికి 110 రోజులు పడితే పది లక్షలు చేరుకోవడానికి మరో 59 రోజులు పట్టింది. అయితే 20 లక్షలు దాటడానికి మాత్రం కేవలం 21 రోజులు పట్టిందంటే దేశంలో ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థమవుతుంది.

కాగా దేశంలో నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరసగా ఇది తొమ్మిదో రోజు. గడచిన తొమ్మిది రోజుల్లోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే అదే సమయంలో రికవరీ రేటు రోజురోజుకు మెరుగవుతూ ఉండడం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 67.98 శాతానికి చేరుకోగా మరణాల రేటు 2.07 శాతంగా ఉంది. కాగా గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో 886 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 41,585కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

మహారాష్ట్రలో మళ్లీ 300కు పైగా మరణాలు
కొవిడ్ మహమ్మారి తీవ్రతకు మహారాష్ట్ర వణికి పోతోంది. గడచిన రెండు రోజులుగా నిత్యం 10 వేలకు పైగా కేసులు, 300దాకా మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఒక్క రోజే కొత్తగా 11,500 కేసులు నమోదు కాగా 316 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల80 వేలకు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 16,792మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోను నాలుగో సారి వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు తమిళనాడులో కరోనాతో 4,571మంది చనిపోయారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, యుపి తదితర రాష్ట్రాల్లోను కరోనా తీవ్రత అధికంగానే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,27,88,393 శాంపిల్స్‌ను పరీక్షించగా, నిన్న ఒక్క రోజే6,39,042 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) తెలిపింది.

India’s Corona Cases tally Across 20 lakhs mark

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News