కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ
14 ఏండ్ల బాలిక 26 వారాల గర్భ ఆక్రోశం
మెడికల్ బోర్డుల ఏర్పాటు పరిశీలన
న్యూఢిల్లీ: అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాధితురాలికి చట్టపరమైన హక్కులుంటాయి. ఈ హక్కులను ఈ బాధితురాళ్లకు తెలియచేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారానికి గురై, అవాంఛనీయ గర్భం దాల్చిన వారు దిక్కుతోచనిస్థితిలో ఉంటున్నారు. ఇటువంటి విధివంచితలలో 20 వారాల పరిధి దాటిన గర్భాల విచ్ఛిత్తికి సంబంధించిన అంశం ప్రధాన చట్టపరమైన విషయం అయింది. దీనికి సంబంధించి కేంద్రం, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా వైద్య మండళ్లను ఏర్పాటు చేయాల్సి ఉందనే అభ్యర్థనతో కూడిన పిటిషన్‌పై సర్వోత్తమ న్యాయస్థానం శుక్రవారం స్పందించింది. మెడికల్ బోర్టుల ఏర్పాటుపై వివరణ తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు వెలువరించింది.
1971 నాటి గర్భస్రావ సంబంధిత చట్టం మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రిగ్నెసీ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం 20 వారాలు దాటిన తరువాత గర్భ విచ్ఛిత్తికి అనుమతించడం జరగదు. ఈ కోణంలో అత్యాచార బాధితురాలి అవాంఛనీయ గర్భం తీసివేయడంలో చట్టపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో బాధితురాలు అవాంఛనీయ గర్భం కొనసాగిస్తూ తరువాతి క్రమంలో అనేక విధాలుగా సామాజిక సమస్యలు ఎదుర్కొవల్సి వస్తోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం దీనిపై సరైన విధంగా వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని కేంద్రానికి పంపిన తాఖీదులలో తెలిపింది. ‘ ఓ మహిళ అత్యాచారానికి గురై, గర్భం దాలిస్తే, చట్టపరంగా ఆమెకు ఎటువంటి రక్షణ ఉంటుంది? ఆ వంచిత న్యాయపరమైన హక్కులు ఏమిటి అనేది, తెలుసుకునేందుకు వీలు కల్పించాలి. ఈ విధమైన చేతన కల్పించాల్సి ఉంది’ అని ప్రధాన న్యాయమూర్తి ఎఎస్ బోబ్డే తెలిపారు.
అత్యాచారానికి గురై , గర్భవతి అయిన 14 ఏండ్ల బాలిక తరఫున దాఖలు చేసిన పిటిషన్ విచారణ క్రమంలో లాయర్ వికె బిజూ తమ వాదన విన్పించారు. ఈ బాలిక కేసు హృదయవిదారకం అని, అవాంఛనీయ గర్భంతో తరువాతి దశలో బిడ్డ పరిస్థితి ఏమిటని బాధితురాలి తల్లిదండ్రులు బాధపడుతున్నారని, ఓ దశలో గర్భస్రావానికి వారు సిద్ధం అయ్యారని, అయితే బాలిక గర్భానికి 26 వారాలు నిండటంతో ఈ దశలో విచ్ఛిత్తి భావ్యం కాదనే వైద్యుల సలహా మేరకు గర్భ విచ్ఛిత్తికి తాము అనుమతిని కోరడం లేదని న్యాయవాది తెలిపారు. అయితే ఇటువంటి విషయాలపై బాధితురాలి సమస్యలు ఏమిటీ? వారికి చట్టపరంగా ఉండే రక్షణ ఏర్పాట్లు, వారి హక్కుల విషయం తెలియాల్సి ఉందని పిటిషనర్ తరఫున తెలిపారు. రాష్ట్రాలు, యుటిలు దీనికి సంబంధించి నిర్థిష్టరీతిలో మెడికల్ బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉందనే వాదనపై సుప్రీంకోర్టు స్పందించింది.
ఈ అంశంపై కేంద్రం తన వివరణను నాలుగు వారాలలో ఇచ్చుకోవల్సి ఉందని స్పష్టం చేసింది. తమ దృష్టికి వచ్చిన అంశంలోని తీవ్రతను గుర్తించామని ఇటువంటి విషయాలలో జోక్యానికి లేదా తగు సాయానికి స్థానికంగా బోర్డులు ఉంటే బాధితురాలికి తగు విధంగా సాయం చేసేందుకు వీలేర్పడుతుందని , దీనిని కేంద్రానికి తెలియచేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటికి ధర్మాసనం తెలిపింది. ‘ అత్యాచారం జరిగినట్లు అధికార యంత్రాంగానికి తెలియచేయడం జరగకపోతే పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది. అయితే బాధితురాలి విషయం నివేదించడం జరిగినప్పుడు , బాధితురాలికి సంబంధించి తగు న్యాయం చేసేందుకు అవసరం అయిన ఏదో విధమైన వ్యవస్థ లేదా యంత్రాంగం లేదా ఏర్పాటు అవసరం . అత్యాచారానికి గురైన మహిళ గర్భం దాల్చిందా? ఈ పరిస్థితి ఏర్పడితే ఆమె దీనిని అవాంఛనీయ గర్భంగా భావిస్తే పరిస్థితి ఏమిటీ? కొనసాగించాలనుకుంటే తదుపరి క్రమం ఏమిటీ? బాధితురాలి చట్టపరమైన హక్కులు తెలియాల్సి ఉంది. ఇందుకు అవసరం అయిన మెడికల్ బోర్డుల ఏర్పాటుపై ఏం ఆలోచిస్తున్నారు? ’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.