Tuesday, April 30, 2024

నో లాక్‌డౌన్, కర్ఫూ

- Advertisement -
- Advertisement -

సెకండ్ వేవ్‌ను ఎదుర్కొడానికి సర్వం సిద్ధం

పక్క రాష్ట్రాల నుంచే వైరస్
భయం వద్దు, ఏ కొరత రానివ్వం
దీని ప్రభావం కొంత కాలం ఉంటుంది
అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్, నాన్‌కొవిడ్ సేవలు
సీరియస్ కేసులు గాంధీకి, అనుమానం ఉంటే పరీక్షలు చేసుకోవాలి
– మీడియాతో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్

Minister Etela Rajender press meet on Coronavirus

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి రోజు లక్షా యాభై వేల మందికి వ్యాక్సిన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని సుర క్షితంగా ఉండాలన్నారు. అంతేగాక ఇప్పటికే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, వారు అనుమతి ఇవ్వగానే మిగతా సెక్టార్లకూ వేస్తామన్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై ఆయన బుధవారం కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ…పక్క రాష్ట్రాల వ్యాప్తితోనే మన దగ్గర కేసులు పెరుగుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వచ్చే కేసుల్లో 60 శాతం మహరాష్ట్ర నుంచి వస్తున్నాయన్నారు. ఆ ప్రభావం తెలంగాణపై కూడా ఉందన్నారు. మన రాష్ట్రం నుంచి మహరాష్ట్రకు కేవలం వందల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో ప్రతి రోజు రాకపోకలు పెరిగాయన్నారు. బోర్డర్లలో ప్రత్యేక టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ, వ్యాప్తి పెరగడం కాస్త ఆందోళన కల్గించే అంశమన్నారు. రాబోయే రోజుల్లో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీకి మరింత ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కానీ లాక్‌డౌన్, కర్ఫూ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉండవన్నారు.ప్రజలంతా భయాందోళన చెందకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
90 నుంచి 95 శాతం మందికి లక్షణాలులేవ్….
సెకండ్‌వేవ్‌లో 90 నుంచి 95 శాతం కేసులకు ఎలాంటి లక్షణాలు లేవని మంత్రి అన్నారు. దీంతోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ వ్యాప్తి జరిగిందని మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో ట్రిపుల్ టీని మరింత సమర్ధవంతంగా అమలు చేయబోతున్నామన్నారు. అనుమానితులందరికీ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నామన్నారు. అంతేగాక లక్షణాలు ఉండి నెగటివ్ తేలితే వెంటనే ఆర్‌టిపిసిఆర్ టెస్టులను కూడా నిర్వహిస్తామన్నారు. ప్రతి పిహెచ్‌సిలో యంటీజెన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేగాక పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను వేగంగా గుర్తించగల్గుతున్నామన్నారు. గతంలో ట్రేసింగ్ చేసేందుకు సుమారు 15 నుంచి 20 రోజులు పడుతుండగా, ప్రస్తుతం కేవలం నాలుగు రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు. అంతేగాక అసింప్టమాటిక్, మైల్డ్ పాజిటివ్‌లకు టెస్టు చేసిన వెంటనే హోం ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు.
నాణ్యమైన వైద్యం అందించాలని సిఎం ఆదేశించారు…
గత సంవత్సర కాలంలోని అనుభవాన్ని బేరీజు వేసుకుంటూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటికే టెక్నికల్ కమిటీ ఎప్పటికప్పుడు గతేడాది పరిస్థితులను నివేదిక రూపంలో తయారు చేస్తూ తమకు సూచనలు చేస్తుందన్నారు. ఈమేరకే రాష్ట్రంలో టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున ప్రతి రోజు 60 వేల కరోనా పరీక్షలు చేస్తుండగా, రాబోయే రోజుల్లో లక్ష టెస్టులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేగాక ట్రీట్మెంట్ విధానాల్లోనూ స్పీడప్ చేశామన్నారు. పిహెచ్‌సి నుంచి టర్శరీ వరకు మందులు, మౌళిక వసతులను అందుబాటులో ఉంచామన్నారు. అంతేగాక ప్రతి హాస్పిటల్‌లో కొవిడ్, నాన్‌కోవిడ్ సేవలు కూడా కొనసాగుతాయన్నారు.
ఆశావర్కర్ నుంచి హైయర్ ఆఫీసర్ వరకు నో లీవ్స్…
కరోనా ఫ్యాండమిక్ పరిస్థితి నుంచి గట్టేక్కాలంటే వైద్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కమిట్మెంట్‌తో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ఆశావర్కర్ నుంచి హైయ్యర్ ఆఫీసర్ వరకు ప్రస్తుత పరిస్థితుల్లో సెలవు తీసుకోవద్దని మంత్రి కోరారు. ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ సెంటర్లు…
ప్రధాన ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేకుండా ఉండేందుకు అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ సెంటర్లను పుఃన ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వీటిలో అసింప్టమాటిక్, మైల్డ్ సింప్టమ్స్ వాళ్లకి వైద్యం అందిస్తామన్నారు. అయితే మల్టీ ఆర్గాన్ సమస్యలునోళ్లను డిస్ట్రిక్ట్, ఏరియా ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. అక్కడ వారికి కావాల్సిన ఇంజక్షన్లు, మందులను అందుబాటులో ఉంచామన్నారు. వీరిలో ఎవరికైనా సీరియస్ పరిస్థితులు తలెత్తితే గాంధీకి తరలిస్తామన్నారు. అంతేగాక ఏరియా, జిల్లా, టీచింగ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసియూ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో మందులు, మ్యాన్‌పవర్‌ను కూడా పెంచుతున్నామన్నారు. అంతేగాక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ కొవిడ్ సేవలు అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు.
కరోనా వైద్యాన్ని వ్యాపార కోణంలో చూడొద్దు…
కరోనా వైద్యాన్ని వ్యాపార కోణంలో చూడొద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ హస్పిటల్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత దృక్ఫదంతో ఆలోచించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే ట్రీట్మెంట్ అందించాలని కోరారు. ఇదిలా ఉండగా గడిచిన సంవత్సర కాలంలో ఉన్న అనుభవాన్ని దృష్టా ప్రభుత్వాలు కరోనాపై యుద్ధం చేస్తున్నాయన్నారు. కానీ ప్రజలకు కూడా సహకరించాలన్నారు. మరిన్ని రోజులు సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే అదృష్టవషాత్తు కేసులు సంఖ్య పెరిగినప్పటికీ, డెత్ రేట్ చాలా తక్కువగా తేలుతుందన్నారు.
రోగుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్…
హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు కిట్లను ఇవ్వడమే కాకుండా ప్రతి రోజూ పర్యవేక్షిస్తామన్నారు. అంతేగాక ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు కూడా ఇస్తామన్నారు. అన్ని జిల్లాల్లో కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. దీంతో పాటు 104 టోల్ ఫ్రీ నంబరు ద్వారా టెలీ కాన్ఫరెన్స్ వైద్యం కూడా ఇస్తామన్నారు.
సూపరింటెండెంట్లతో మంత్రి భేటీ…
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో బుధవారం కోఠి కమాండ్ సెంటర్‌లో భేటీ అయ్యారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఏ అవసరం వచ్చినా వెంటనే తనకు తెలపాలని మంత్రి చెప్పారు.
ఫిక్కీ సదస్సులో పాల్గొన్న మంత్రి…
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కంటికి కనిపించని కరోనా వైరస్ మనందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిందన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైందన్నారు. అయితే మేధావులు, నిపుణులు, వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి మరోసారి గుర్తు చేశారు.

Minister Etela Rajender press meet on Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News