Tuesday, April 30, 2024

టాలీవుడ్‌లో కర్ఫ్యూ టెన్షన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ దేవుడు, ఇష్క్ చిత్రాల వాయిదా

50మందితో మాత్రమే షూటింగ్‌లకు అనుమతి

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో టెన్షన్ మొదలైంది. గతేడాది కోవిడ్ కారణంగా తీవ్ర నష్టాలను చవి చూసిన తెలుగు ఇండస్ట్రీ.. అలాంటి పరిస్థితి పునరావృతం అవుతోందని కలవరపడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కరోనాను కట్టడి చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా సినిమా షూటింగ్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ షూటింగ్స్ మాత్రమే జరుపుకోవాలని… అత్యవసరం అనుకుంటే 50 మంది సినీ కార్మికులతో మాత్రమే షూటింగ్ చేసుకోవచ్చని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొది. ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు మీడియం, భారీ బడ్జెట్ సినిమాల షూటింగులను వాయిదా వేసుకున్నారు. కొన్ని సినిమాల విడుదలను సైతం వాయిదా వేసుకున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ఈ నెల 30 వరకు థియేటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ‘వకీల్ సాబ్’ సినిమాను ప్రదర్శించే థియేటర్లు మినహా అన్ని సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమా మొదటి వారంలో రికార్డు కలెక్షన్లను వసూలు చేసి రెండో వారంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటో ంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన ఈ పెద్ద సినిమా మరికొన్ని రోజులు మంచి కలెక్షన్లను సాధించే అవకాశం ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాను ప్రోత్సహించే నేపథ్యంలోనే ‘వకీల్‌సాబ్’ థియేటర్లను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం థియేటర్లలో ఆంక్షలు విధిస్తున్నారు. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విడుదల వాయిదా…
కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ దేవుడు, ఇష్క్ చిత్రాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ పేర్కొన్నారు. తెలంగాణలో థియేటర్ల బంద్, ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లపై ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ చిత్రంలో ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈనెల 23న థియేటర్లలోకి వచ్చేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని, ప్రజల శ్రేయస్సును కోరుతూ.. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా దర్శకుడు హరీష్ వడత్యా, మాక్స్‌ల్యాబ్ సిఈఓ మహ్మద్ ఇంతెహాజ్ అహ్మద్‌లు హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇక ఈనెల 23న విడుదల కావాల్సిన ‘ఇష్క్’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్.రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఆర్.బి.చౌదరి తెలియజేశారు.
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
సినిమా థియేటర్ బంద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సినిమాలు లేక థియేటర్లు బందు పెట్టాల్సి వస్తుంది. సినిమాలు నడుపదల్చుకుంటే నడుపుకోవచ్చు. ప్రభుత్వం కరోనా నిబంధనల మేరకు సినిమా థియేటర్లు నడిపిస్తాం.
-రాజ్‌కుమార్, తెలంగాణ థియేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్

Corona restrictions imposed on Telugu Cinema Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News