Tuesday, May 21, 2024

యడ్యూరప్ప నిష్క్రమణ

- Advertisement -
- Advertisement -

Chief Minister Yediyurappa has resigned

 

గత కొంత కాలంగా దట్టమైన మబ్బులు కమ్మిన కర్నాటక రాజకీయాకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఫెళఫెళార్భాటాలతో కుంభవృష్టి కురిసినట్టయింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం నాడు రాజీనామా చేశారు. దీనితో దక్షిణాదిలోని తొలి బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటక మళ్లీ వార్తలకెక్కింది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి వరించిన యడ్యూరప్ప ఏ ఒక్కసారీ పూర్తి పదవీకాలం పాటు ఆ పీఠంలో కొనసాగలేకపోయారు. స్వయంగా తాను పాల్పడిన అవినీతి చర్యలు, అధికారంలో కుటుంబ సభ్యుల అతి జోక్యంతో పాటు పార్టీలో అసమ్మతి కూడా ఆయనను స్థిరమైన ముఖ్యమంత్రిని కానివ్వలేకపోయాయి. దానితో భారతీయ జనతా పార్టీ కర్నాటకను గట్టిగా ఆధారపడదగిన రాష్ట్రంగా నిలుపుకోలేకపోతున్నది. 2008 ఎన్నికల్లో బిజెపికి నాయకత్వం వహించి, ఆ పార్టీని దక్షిణాదిలో ప్రప్రథమంగా పాలక పీఠమెక్కించిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణల మూలంగా 2011లో రాజీనామా చేశారు.

ఆ తర్వాత బిజెపి కేంద్ర నాయకత్వం తనను చిన్నచూపు చూస్తున్నదన్న కారణంతో ఆ పార్టీ నుంచి తప్పుకొని కర్నాటక జనతా పక్షం అనే సొంత కుంపటిని పెట్టుకున్నారు. అది ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయేసరికి దానిని బిజెపిలో విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించగా గవర్నర్ వజూభాయ్ వాలా సహకారంతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటికీ తగిన సంఖ్యా బలాన్ని సమకూర్చకోడంలో విఫలమై రెండు రోజుల్లోనే వైదొలగారు. 2019లో జులైలో కాంగ్రెస్ జెడి(ఎస్) ప్రభుత్వం మైనారిటీలో పడిపోడంతో యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. వాస్తవం చెప్పుకోవాలంటే పాలక కాంగ్రెస్ జెడి(ఎస్) పార్టీల నుంచి 17 మంది శాసన సభ్యుల చేత రాజీనామా చేయించి దొడ్డి దారిలో ఆయన ఈ అవకాశాన్ని సాధించుకున్నారు.

ఆ తర్వాత ఆ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 మందిని గెలిపించుకొని ముఖ్యమంత్రి పీఠం మీద స్థిరపడ్డారు. ఆ విధంగా ఆయన మళ్లీ అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు ముగిసిన సందర్భంలో సోమవారం నాడు అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి పదవికి మళ్లీ రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా ఆయనే ఈ పరిణామాన్ని సూచనప్రాయంగా ప్రకటిస్తూ వచ్చారు. పార్టీ కేంద్ర నాయకత్వం దిగిపొమ్మంటే అందుకు సిద్ధంగా ఉన్నానని పదేపదే చెప్పారు. కర్నాటకలో గణనీయమైన ఓటు బలమున్న లింగాయత్‌ల నాయకుడుగా యడ్యూరప్ప అధికారంలోకి రాడానికి అందులో కొనసాగడానికి తన కులాన్ని బలమైన కార్డుగా వినియోగించుకున్నారు. ఆ రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం. గతంలో ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పిన ఎస్ నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ ఈ కులానికి చెందిన వారే.

కాని అధికారం కోసం యడ్యూరప్ప తన సామాజిక వర్గ ప్రాబల్యాన్ని ఉపయోగించుకున్నంతగా వారు దానిని వాడుకోలేదు. ఈసారి అధికారంలో కొనసాగడానికి యడ్యూరప్ప మఠాధిపతుల ఆశీస్సులను సైతం ప్రయోగించి విఫలమయ్యారు. అధికారంలో ఉండగా ఆయన వీర శైవ మఠాలకు దండిగా నిధులిచ్చి వాటి మద్దతును కూడగట్టుకున్నారనే ఆరోపణ ఉంది. ఆయనకీసారి పార్టీలోనే తీవ్రమైన ఎదురు గాలి వీచింది. యడ్యూరప్ప నాయకత్వంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు వెళితే పార్టీ పరాజయం పాలుకాక తప్పదని, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని బిజెపి శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్ బహిరంగంగా ప్రకటించారు. అలాగే మరో బిజెపి ఎంఎల్‌ఎ అరవింద్ బెల్లాడ్, మంత్రి సిపి యోగేశ్వర కూడా యడ్యూరప్ప నాయకత్వాన్ని బాహాటంగా విమర్శించారు. ఈ మధ్య కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించిన సదానంద గౌడ సైతం యడ్యూరప్ప వ్యతిరేక వర్గానికి చెందిన వారేనని స్పష్టపడుతున్నది.

కేంద్ర మంత్రి పదవి కోలోయిన తర్వాత ఢిల్లీ నుంచి బెంగళూరుకు మొదటిసారి వచ్చినప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అనే నినాదాలు ఆయనకు స్వాగతం చెప్పాయి. 24 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా అతి తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు దఖలు పరిచారనే ఆరోపణను యడ్యూరప్ప ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూముల డీనోటిఫికేషన్ ఆరోపణపై దర్యాప్తును సుప్రీంకోర్టు గత ఏప్రిల్‌లో నిలిపివేసినప్పటికీ పార్టీలో అసమ్మతిని అదుపు చేయడంలో ఆయన విఫలమయ్యారు. దీనికి తోడు రాష్ట్రంలో కరోనాను అదుపు చేయలేకపో యారనే విమర్శ ఆయన మెడకు చుట్టుకున్నది. అధికారంలో తన కుమారులు రాఘవేంద్ర, విజయేంద్రల జోక్యం 78 ఏళ్ల యడ్యూరప్పకు కళంకాన్ని తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో లేవు. 2023లో జరుగనున్నాయి. అంత వరకు కర్నాటకలో బిజెపి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడానికి తగిన నాయకుడిని నియమించే దిశగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఎంత వరకు సరైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News