Tuesday, April 30, 2024

కృష్ణ రివర్ బోర్డు సమావేశం సెప్టెంబర్ 1కి వాయిదా

- Advertisement -
- Advertisement -

Krishna Board meeting adjourned till 1 pm

చర్చించవలసిన అంశాలపై నివేదికలు సిద్ధం చేసుకుంటున్న తెలుగు రాష్ట్రాలు
బోర్డు చైర్మన్ ఎంపి సింగ్ సెలవులో ఉన్నందునే వాయిదా?
సెప్టెంబర్ 1న ఉ.11గం॥కు జలసౌధలో సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీజలాలకు సంబంధించి ఈ నెల 27న జరగాల్సివున్న కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని తిరిగి సెప్టెంబర్ ఒకటిన నిర్వహించనున్నట్టు బోర్డు సభ్యకార్యదర్శి రాయపురే తెలిపారు. ఈ నీటిసంవత్సరంలో కృష్ణానదీజలాలను తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వాటాలను ఖరారు చేయటంతోపాటు, బోర్డుపరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ, బోర్డు నిర్వహణకు నిధులు, బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు తరలింపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు వివిధ సాగునీటి పథకాల డిపిఆర్‌లు తదితర అంశాలపై కృష్ణారివర్‌బోర్డు 14వ సమావేశంలో చర్చించాల్సివుంది.

సమావేశపు అజెండా అంశాలను కూడా బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే 27న జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నట్టు బోర్డు సభ్యకార్యదర్శి రెండు రాష్ట్రాలకు సమాచారం అందచేశారు. ఇదే సమావేశం సెప్టెంబర్ ఒకటిన ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించనున్నట్టు తెలిపారు. బోర్డు సమావేశంలో చర్చించేందుకు మరికొన్ని అంశాలను కూడా అజెండాలో చేర్చాలని తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలు బోర్డుకు ఇప్పటికే లేఖలు రాశాయి. సమావేశం వాయిదాకు స్పష్టమైన కారణాలు ఏమిటన్నది అధికారులు తెలియజేయలేదు. అయితే కృష్ణారివర్ మేనేజ్‌మెంట్‌బోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్ సెలవులో ఉన్నదునే 27నాటి సమావేశాన్ని వాయిదా వేసినట్టు అనధికారికంగా చెబుతున్నారు.

మరోవైపు ఈ నెల 27న జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో రాయలసీయ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కేసు విచారణకు రానుంది. నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ రాయలసీయ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని బోర్డును ఆదేశించింది. ఈ ఆదేశాలమేరకు ఈనెల రెండవ వారంలో బోర్డు సభ్యుల బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి నివేదిక అందచేసింది. 27న ట్రిబ్యునల్‌లో జరగనున్న విచారణలో కూడా బోర్డు అధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడ పాల్గొనాల్సిఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే 27నాటి బోర్డు సమావేశం సెప్టెంబర్ ఒకటినాటికి మార్చాల్సివచ్చిందని అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News