భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో మిళితమై ఉన్న చేనేతరంగం ఒక కళగా, వారసత్వ సంపదగా ఆదరింపబడినది. నేడు ప్రభుత్వాలు, పాలకులు కల్ల బొల్లి కబుర్లు చెబుతూ సవతితల్లి ప్రేమనే చూపిస్తున్నందున తన ఉనికిని చాటుకోలేని దుస్థితికి చేనేత రంగం నెట్టివేయబడినది. మానవ జీవితంలో ముడిపడి ఉన్న కూడు, గుడ్డ, గూడు వంటి నిత్యావసరాలలో గుడ్డ (వస్త్రం) ప్రజల మానరక్షణకు తోడ్పాటు అందించడంతోపాటు మానవ నాగరికతకు వస్త్రం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. వ్యవసాయ రంగం తర్వాత లక్షలాది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత రంగం దేశంలో 30 లక్షల చేనేత మగ్గాలపై దాదాపు కోటి మంది చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజలకు జీవాధారమై ఆధారపడి ఉన్నారు. ఎలాంటి విద్యుత్ వినియోగం లేకుండా మానవశ్రమ సృజనాత్మక ఆలోచనతో మనిషి తన చేతుల ద్వారానే పనిచేస్తూ వస్త్రాన్ని తయారు చేస్తాడు.
ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయంలో పత్తిని పండించి ఆ పత్తి ద్వారా నూలు వడికి సహజ రంగుల అద్దకంతో (colorful paint) పూర్తిస్థాయి ప్రకృతి సహజ సిద్ధమైన సృజనాత్మకత పెట్టుబడుగా చేనేత కార్మికులు తమ సున్నితమైన చేతులతో వేలాది దారాలను క్రమపద్ధతిలో పేర్చి వస్త్రాన్ని తయారు చేస్తారు. చేనేత రంగం కేవలం వస్త్రాల తయారీకి కాకుండా పర్యావరణాన్ని రక్షించడానికి చేనేత కార్మికుడు ఎంతగానో దోహదపడతాడు. చేనేత కార్మికులను పర్యావరణవేత్తలుగా గౌరవించాలి. చేనేత వస్త్రాలు పర్యావరణానికి ఎన్నోవిధాలుగా ఉపయోగపడతాయి.చేనేత వస్త్రాల తయారీలో సహజ నూలు ఉపయోగించటం వలన సింథటిక్ బట్టల తయారీలో ఉపయోగించే హానికరమైన రసాయనాలు చేనేత వస్త్రాలకు అవసరము ఉండదు. తద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. చేనేత వస్త్రాలు నేలలో సులభంగా కలిసిపోతాయి.
దేశ వస్త్ర ఉత్పత్తులలో తెలంగాణ చేనేత వస్త్రోత్పత్తులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రంగుల అద్దకం, ప్రింటింగ్, చిటికి పరిశ్రమ, డిజైన్లు మొదలైన నైపుణ్యతతో ఆధునిక మార్కెట్లో సైతం పోటీపడుతున్నారు. తెలంగాణ చేనేత కార్మికులు తరతరాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా వస్త్రోత్పత్తులు చేస్తూ తమ నైపుణ్యాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాకతీయుల పరిపాలనతోపాటు అనేక సంస్థానాల మూలంగా చేనేత వస్త్రోత్పత్తులకు చేనేత కళకు మంచి ప్రోత్సాహం లభించింది. ఆ తరువాత నిజాం పరిపాలన చేనేత వస్త్రాల ఉత్పత్తులలో అనేక మార్పులు తెచ్చి అరబ్ దేశాలకు ఎగుమతి చేయడానికి తేలియా రుమాళ్ళును ప్రోత్సహించింది. నూలు సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. అగ్గిపెట్టెలో అమిరే ఆరు గజాల చీర ఇమడగల సున్నితమైన వస్త్రం తయారు చేయగల నైపుణ్యం, ఎటువంటి చిత్రాన్నైనా చూసి దానిని వస్త్రంపై నేయటం తెలంగాణ చేనేత నేతగాళ్ళ సొంతం.
కుట్టు లేని అంగీలు, కటింగ్ లేని గాంధీ టోపీలు స్వాతంత్ర పోరాటానికి అందించిన ఘనత తెలంగాణ నేతన్నది. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ చీరలు, పట్టు, కాటన్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల పట్టు చీరలు, నారాయణపేట కాటన్ చీరలు, వరంగల్ తివాచీలు, డర్రీలు, కరీంనగర్ కాటన్ దుప్పట్లు, హకీంపేట్ టిస్సార్ పట్టు చీరలు, ఆర్మూర్ పట్టు చీరలు, పీతాంబరి పట్టు జరీ చీరలు పలు రకాల నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్ర నేతన్న నైపుణ్యానికి ప్రతిబింబం, దేశానికి తలమానికం. తెలంగాణ రాష్ట్రంలో చేనేతన్నల జీవితాలు అత్యంత దుర్భరంగా, దయనీయంగా మారిపోయాయి. నేడు చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చేనేత మగ్గాన్ని నమ్ముకొని బతుకులీడుస్తున్న నేతన్నలు పని లేక పస్తులు ఉంటూ, ఆకలి చావులు ఆత్మహత్యలకు గురిఅవుతూ… తరతరాల నుంచి నమ్ముకున్న చేనేత మగ్గం నేతన్నల పాలిట ఉరి పగ్గంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక చేనేత రంగం చేనేతన్నల కుటుంబాల జీవితాలలో వెలుగులు నిండుతాయని, ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందుతామని కోటి ఆశలతో చేనేత కార్మికులు ఎదురు చూశారు.
కానీ ఆ విధంగా జరగకపోగా వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాలకుల అలసత్వం, అవినీతి, వివక్షతో పూర్తిగా చేనేత రంగాన్ని సమస్యల సుడిగుండంలో నెట్టివేయబడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా నేతన్నల ఉపాధి కల్పన కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలోనే ఆర్థిక ఇబ్బందులతో పాటు ఉపాధి లేకపోవడం వలన దాదాపు 36 మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందజేయలేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తక్షణమే పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 36 నెలలు ఉన్న ‘చేనేతకు చేయూత పొదుపు’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా నిలిపివేసి నేడు 24 నెలలకు కుదించి కొత్తగా ‘థ్రిఫ్ట్ పథకం’ ప్రవేశపెట్టినట్లు ప్రకటించడం, గత ప్రభుత్వ హయాంలో ఉన్న ‘నేతన్న బీమా’ పథకమును ‘నేతన్న భద్రత’గా పథకం వయస్సు పరిమితి పొడిగించిందే తప్ప చేసింది ఏమీలేదు.
పథకం పేరు మార్చి కొత్తగా ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకొంటూ చేనేత కార్మికులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో చేనేత ఉత్పత్తి రూ. 1000 కోట్లు ఉంటుంది. ఐదు శాతం జిఎస్‌టి భరిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కేవలం 50 కోట్ల వరకు భారం పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకార, వ్యవసాయ పరపతి సంఘాలు పనిచేస్తున్నాయి. అవన్నీ కొనసాగుతున్నప్పుడు చేనేత నేత కార్మిక సహకార సంఘాల పట్ల ఎందుకు చిన్నచూపు, వివక్ష చూపిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం తెలపాలి? రాష్ట్ర శాసనసభలో 202425 సం॥లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 187 కోట్లు మాత్రమే ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల ఖర్చులు పోను మిగిలేది అంతంత మాత్రమే! ఇలా అయితే చేనేత రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది? లిక్కర్కు పాలసీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేయాలి. చేనేత సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మిషన్ ఏర్పాటు చేయాలి. చేనేత అన్నలకు సంవత్సరానికి రూ. 36 వేల పెట్టుబడి సహాయం అందించాలి. తెలంగాణ రాష్ట్రంలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్న మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటని చందాన ఆ రంగానికి సహాయం చేయకపోగా చేనేతకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులపై జిఎస్‌టి విధించి చేనేత మనుగడని ప్రస్నార్థకంగా చేశారు. భారతదేశంలో ఎన్నడు లేనిది చేనేతపై జిఎస్‌టిని మొట్టమొదటిసారిగా 2017 సంవత్సరములో ఐదు శాతం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన చేనేతలపై విధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన చేనేతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి చేనేత రంగాన్ని వారసత్వ సంపదగా, ఒక కళగా, అభివృద్ధికి తోడ్పడే వృత్తిగా, ఉపాధి అవకాశాలు కల్పించే రంగంగా ప్రభుత్వాలు, పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
- చిక్కా దేవదాసు
93913 99394 - నేడు జాతీయ చేనేత దినోత్సవం