Friday, August 8, 2025

కునారిల్లుతున్న విద్య, వైద్య రంగాలు

- Advertisement -
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలైనప్పటికీ దేశంలో ప్రజల అవసరాలకు తగినన్ని విద్యాలయాలు, -వైద్యశాలలు ఇంకా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఉన్న వాటిపై ప్రజలకు విశ్వాసం లేదు. నిధుల కొరత, నిర్వహణ లోపం, పర్యవేక్షణ లోపం, ప్రజల అవగాహన లేమితో ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలు సక్రమంగా నడవడం లేదు. ప్రభుత్వ విద్య-, వైద్య సంస్థలలో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు, డాక్టర్లు, ప్రైవేటు విద్య సంస్థలు, వైద్య సంస్థలు, అధికారిక, అనధికారిక లావాదేవీలు, వ్యాపారాలు నిర్వహిస్తూ మనసును, సమయాన్ని ఉద్యోగంకన్నా వాటిపైనే కేంద్రీకరిస్తున్నారు. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు, డాక్టర్లు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఏదోరకంగా మచ్చిక చేసుకొంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక అంకెకు మించిలేదు. ఒకప్పుడు ఊరుకొక్క బడి పేరుతో విస్తరింపజేసిన ప్రభుత్వాలు ఆచరణలో శ్రద్ధ చూపకపోవడం, సమాజంలో వచ్చిన పరిణామాలు ప్రభుత్వ పాఠశాలలను, వైద్యశాలలను మరింత అధ్వాన స్థితిలోకి నెట్టివేశాయి. పేదలకో బడి, పెద్దలకో బడి అన్నట్లుగా మారి, ఒకప్పుడు ప్రజలందరి కోసం ఏర్పాటు చేయబడిన విద్య-, వైద్య సంస్థలు కేవలం కఠిక పేదవాళ్ళ కోసమేనన్న విధంగా తయారయ్యాయి. ఎంతో కొంత నాణ్యత ప్రమాణాలు, మానవీయ విలువలు పాటించే ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలు నేడు నిర్లక్ష్యం నీడన నిరుపేదల బతుకులు అన్న చందంగా మారాయి. ‘దరిద్రులను దేవతలు కూడా బాగుచేయలేరు’ అనే హితోపదేశాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు-, అధికారులు- విద్య-, వైద్య సంస్థల ఉద్యోగులు బాధ్యతల నుండి తప్పుకుంటూ ఉద్యోగ వృత్తిధర్మాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

రోగమొచ్చిన సమాజానికి శస్త్రచికిత్స చేయగలిగినవారు డాక్టర్లు-, ఉపాధ్యాయులు మాత్రమే. ఉపాధ్యాయులు, డాక్టర్లు అపసవ్య పరిసరాలను -పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు, -సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలరు, రోగులను ఆరోగ్యవంతులుగా తయారు చేయగలరు. డాక్టర్లు-, ఉపాధ్యాయులు సమాజాన్ని మానవీయ కోణంలో ముందుకు నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తూ, నాయకులై నడిపిస్తూ సమాజ నిర్దేశకులుగా నిలువగలరు. వారికి ఆ విధమైన శక్తియుక్తులు, -సామర్థ్యం గలదు. కాని డాక్టర్లు-, ఉపాధ్యాయులు కూడా ప్రపంచీకరణ,- ప్రైవేటైజేషన్, -లిబరలైజేషన్ ప్రభావానికి గురైనారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు నాటి ప్రేమ, ఆప్యాయతతో కూడిన పలకరింపులు మర్చిపోయినారు. కొందరైతే ఉన్నామా! తిన్నామా! పడుకున్నామా! అన్నట్లు ఉద్యోగ వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూన్నారు. తల్లి-దండ్రి- దైవం అనే నానుడి ఒకప్పుడు ఉండేది.

కాలక్రమేణ అది తల్లి-దండ్రి- గురువు అయింది. ఆ తరువాత తల్లి-దండ్రి- గురువు- వైద్యుడు అయింది. ఈ నలుగురి తర్వాతే దైవం అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. రోగం వైద్యుడి వల్ల నయం కానప్పుడు మాత్రమే ప్రజలు దైవంమీద భారమేస్తారు. డాక్టర్లు-, ఉపాధ్యాయులను దేవుడి కన్నా గొప్పగా సమాజం చూసేది. ప్రతి మనిషి తల్లిని, తండ్రిని గురువులో చూస్తారు. ఆ ముగ్గురిని వైద్యునిలో చూస్తారు. ఇప్పుడు గురువును -వైద్యున్ని అంతటి గౌరవస్థానంలో చూడడానికి, గౌరవించడానికి, సమాజం సంకోచిస్తూంది. దీనికి కారణం గురువులు, వైద్యులు మానవీయ విలువలు పాటించకపోవడం. నేడు గురుశిష్యుల బంధాలు కాని, డాక్టర్ -రోగి సంబంధాలు కానీ లేవనే చెప్పాలి. అంకితా భావం కలిగిన తోటి ఉపాధ్యాయుల పట్ల కొందరు ఉపాధ్యాయులే చులకన చేసి మాట్లాడడం బాధాకరం.

ఇది ఉపాధ్యాయ వృత్తికే అవమానం. పాలక వర్గాలు భారత రాజకీయాలను నోట్లు, ఓట్లు, కోట్లు అనే ఫార్ములాకు దిగజార్చారు. అదే మాదిరి విద్య, వైద్యరంగాలను కూడా పైసలు పట్టాలు ధనార్జనగా మార్చారు. విద్య-, వైద్య రంగాలలో విస్తరించిన ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు పచ్చదనం, పరిశుభ్రత లాంటి ఆరోగ్యసేవల రంగంలో అడుగుపెట్టకపోవడం గమనించదగిన విషయం. దీనికి ప్రధాన కారణం ఆరోగ్య సేవల్లో లాభాలు లేకపోవడమే. ప్రజా ప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బడిబాటలో భాగంగా ఎవరైనా ఎక్కడైనా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించారేమో ఆలోచించాలి? ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆచరణాత్మక ఆలోచనలతో నిర్మాణాత్మక ప్రతి పాధనలకు పూనుకోవాలి.

  • విశ్వ జంపాల, 77939 68907
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News