గత ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు చెత్త ప్రదర్శన చేసింది. 14 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచుల్లో గెలిచి టేబుల్లో 9వ స్థానంతో సీజన్‌ను ముగించింది. అయితే ఆర్ఆర్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్ జట్టును వీడే ఆలోచనలో ఉన్నాడని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. 2027 వరకూ సంజూకి ఆర్ఆర్తో అగ్రిమెంట్ ఉన్నా.. అతడని రిలీజ్ చేయాలని జట్టును సంజూ కోరాడట. అయితే అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే విషయంపై చర్చ మొదలైంది. తాజాగా ఆర్ఆర్ పెట్టిన ఓ పోస్ట్ చూస్తే అభిమానులకు కొంత క్లారిటీ వచ్చిందనే చెప్పుకోవచ్చు.
మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ఆడేందుకు భారత కీపర్-బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్ సిద్ధమయ్యాడు. అతడు సెంట్రల్ జోన్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్ఆర్ (Rajasthan Royals) సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘‘స్టంప్స్ వెనక ఉండి మ్యాచ్‌ను మార్చేసే ప్లేయర్ అతడు’’ అంటూ పేర్కొంది. ఫోటోపై కెప్టెన్ జురెల్ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో సంజూ శాంసన్‌ని జట్టు నుంచి తప్పించి.. కెప్టెన్సీ బాధ్యతలను ధ్రువ్‌కి అప్పగిస్తారని.. ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా రాజస్థాన్‌కి కెప్టెన్‌గా ఉంటున్న సంజూ జట్టును వీడి.. చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) గూటికి చేరనున్నాడని టాక్. సిఎస్కె కూడా అతన్ని తీసుకునేందుకు ఆసక్తిగా ఉందట. ఆరో టైటిల్‌ని లక్ష్యంగా పెట్టుకున్న సిఎస్కె సరైన కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది. గత సీజన్లో తొలుత కొన్ని మ్యాచులు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేసినా.. అతడు గాయపడటంతో ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ, జట్టు 4 మ్యాచులు మాత్రమే గెలిచింది. ఇప్పుడు తమ జట్టులోకి సంజూ లేదా కెఎల్ రాహుల్‌ని తీసుకుంటే అది తమకి బాగా కలిసి వస్తుందని సిఎస్కె అనుకుంటోంది. ఈ క్రమంలోనే సంజూ ఆర్ఆర్ని వీడేందుకు రెడీగా ఉండటంతో అతన్ని తమ జట్టులోకి ట్రేడింగ్ చేసుకోవాలని భావిస్తోంది. సంజూను సిఎస్‌కెకి ఇస్తే.. ఇద్దరు ఆటగాళ్లకు తమకు ఇవ్వాలని రాజస్థాన్ షరతు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.